మామూలుగానే చిన్న సినిమాను కూడా భారీ ధరలకు అమ్మడం సురేష్ బాబు ప్రత్యేకత. ఆయనకు ఆ టెక్నిక్స్ బాగా తెలుసు. అలాంటిది రెండు హిట్స్ ఇచ్చిన ఇద్దరు హీరోలతో తీస్తున్న సినిమాను ఏ రేంజ్ కు అమ్ముతారో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. అవును.. వెంకీ మామ సినిమాకు సంబంధించి సురేష్ బాబు చెబుతున్న నంబర్లు చూసి ఇండస్ట్రీ జనాలే ముక్కున వేలేసుకుంటున్నారు.
మజిలీతో నాగచైతన్య హిట్ కొట్టాడు. ఎఫ్-2తో వెంకీ కూడా హిట్ కొట్టాడు. ఇలాంటి ఇద్దరు హిట్ హీరోల్ని పెట్టి వెంకీ మామ సినిమా తీస్తున్నాడు సురేష్ బాబు. హీరోలిద్దరికీ సక్సెస్ లు ఉన్నాయి కాబట్టి సినిమాకు భారీ రేట్లు చెబుతున్నాడట. నిజానికి ఈ సినిమాకు సురేష్ బాబు ఒక్కడే నిర్మాత కాదు, ఆయనతో పాటు టీజీ విశ్వప్రసాద్ కూడా ఉన్నాడు. అయినప్పటికీ బిజినెస్ డీలింగ్స్ అన్నీ సురేష్ బాబే హ్యాండిల్ చేస్తున్నారు. విశ్వప్రసాద్ ప్రొడక్షన్ చూసుకుంటున్నారు.
ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం తాజాగా 2-3 ఛానెళ్లు ప్రయత్నించాయి. అయితే సురేష్ బాబు చెప్పిన ఎమౌంట్ చూసి సైలెంట్ గా వెనక్కి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అచ్చంగా శాటిలైట్ హక్కుల కింద 13 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట సురేష్ బాబు. అదేంటని అడిగితే మజిలీ, ఎఫ్2 సినిమా పేర్లు చెబుతున్నారట.
ప్రస్తుతానికైతే ఈ మూవీకి సంబంధించి బిజినెస్ వ్యవహారాలన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. రాశిఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు బాబి దర్శకుడు.