cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కంటెంట్ కా? కలెక్షన్లకా?

కంటెంట్ కా? కలెక్షన్లకా?

మహేష్ బాబు మళ్లీ కాలర్ ఎగరేసారు. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. మహేష్ రెండోసారి కాలర్ ఎగరేసే ముందు చెప్పారు.. 'మీ కోసం మరోసారి' అని. నిజమే. ఏ హీరోకి అయినా ఫ్యాన్స్ ను ఖుషీ చేయడం కన్నా కావాల్సింది? చేయాల్సింది? ఏముంటుంది? నందమూరి హీరోలు తొడకొట్టడం, మీసం మెలేయడంలా? మహేష్ కాలర్ ఎగరేయడం. కొత్త ట్రెండ్ అనుకోవాలి.

అయితే మహేష్ కాలర్ ఎగరేసింది మహర్షి ఎపిక్ బ్లాక్ బస్టర్ అనా? లేక కంటెంట్ కు అన్నివైపుల నుంచి మంచి అప్లాజ్ వస్తోందనా? 'తిట్లర్' (ఈ మధ్య ట్విట్టర్ నిండా తిట్లే ఎక్కువ వుంటున్నాయి కనుక)లో మాత్రం కంటెంట్ కే తమ హీరో కాలర్ ఎత్తాడని చాలామంది మహేష్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అది కూడా నిజమే అనుకోవాలి. ఎందుకంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (కుటుంబ సంబంధాలు) బ్రహ్మోత్సవం (మానవ సంబంధాలు), శ్రీమంతుడు (గ్రామాల దత్తత), భరత్ అనే నేను (స్వపరిపాలన) మహర్షి (వీకెండ్ ఫార్మింగ్) ఇలా ప్రతి సినిమాలో దాదాపు ఓ మంచి పాయింట్ అయితే వుండేలా చూసుకుంటున్నాడు మహేష్ బాబు.

మహర్షిలో రైతు సమస్యలు, రైతుకు గౌరవం అనే విషయాల కన్నా వీకెండ్ ఫార్మింగ్ అన్నదే గట్టిగా జనాలలోకి వెళ్లింది. కాలనీలు, కాన్వెంట్ లు, కాలేజీలు ఇక ఇదో సరదాగా, లేదా సీరియస్ గా తీసుకుంటాయి. వాస్తవానికి ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ ల్లో చాలామంది సాఫ్ట్ వేర్, ఇంకా మంచి ఉద్యోగాలు వున్నవారు సామూహిక వ్యవసాయం, వీకెండ్ ఫార్మింగ్ ను చాలాకాలంగా చేపట్టారు. ఈ మేరకు వేలాదిమందితో ఫేస్ బుక్ గ్రూప్ లు వున్నాయి. ఇప్పుడు ఈ విషయం సినిమాలోకి, అందునా మహేష్ లాంటి పెద్ద హీరో సినిమాలోకి ఎప్పుడయితే వచ్చిందో కచ్చితంగా మరింతగా జనాల్లోకి వెళ్తుంది.

అంతవరకు మహేష్ కాలర్ ఎత్తడాన్ని పూర్తిగా, పరి పూర్ణంగా హర్షించవచ్చు. ఇలాంటి పనికి వచ్చే, కంటెంట్ వుండే సినిమాలు చేస్తున్నా నేను అని మహేష్ కాలర్ ఎత్తవచ్చు. ఇంకెవరు దాదాపుగా అటువంటి సినిమాలు చేయడంలేదు కాబట్టి. కానీ కలెక్షన్ల పరంగానో, రెవెన్యూ పరంగానో కాలర్ ఎత్తివుంటే అది సబబు కాదు. కలెక్షన్లు చూసి, రెవెన్యూలు చూసి ఫ్యాన్స్ కాలర్ ఎత్తాలి. సవాల్ విసరాలి. శివాలు తొక్కాలి. వాళ్లకు ఏం చేసినా చెల్లుతుంది. కానీ హీరో మాత్రంకాదు.

పైగా హీరోలు స్థిత ప్రజ్ఞతతో వుండాలి. సినిమా గురించి మరిన్ని మంచి మాటలు మాట్లాడాలి. మరిన్ని ప్రసంగాలు చేయాలి. మరిన్ని ఇంటర్వూలు ఇవ్వాలి. మరింత హడావుడి. హల్ చల్ చేయాలి. కానీ కాలర్ ఎత్తడం అన్నది మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ రేంజ్ ను కాస్త తక్కువ చేసేదిగా వుంటుంది. వాస్తవానికి ఏ మీడియా కూడా మహర్షికి హిట్ రేటింగ్ ఇవ్వలేదు. ఎందుకనో మీడియా మొత్తానికి యూనివర్సల్ గా మహర్షి కంటెంట్ లో లోపాలు కనిపించాయి.

కానీ జనాలు సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. అది వాస్తవం. మంచి కలెక్షన్లు కుమ్మేసాయి. అదీ వాస్తవం. దీనికి చాలా రీజన్లు వున్నాయి. ఎందుకంటే కలెక్షన్లు అనేవి చాలా ఫ్యాక్టర్ల మీద ఆధారపడి వుంటాయి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కాబట్టి, దిల్ రాజు కాబట్టే ఇది సాధ్యమైంది అనుకోవాలి. మరెవరు అయినా, ఈ విధమైన రిలీజ్ సాధ్యంకాదు. సమ్మర్ సినిమాల పంపిణీ అన్నీ దాదాపుగా ఆయన చేతిలోనే వుండడంతో, పక్కాగా ఆయన జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు.

నైజాంలో టికెట్ రేట్లు పెంచడం, అది కూడా తొలిసారి మల్టీఫ్లెక్స్ లో పెంచడం అన్నది దిల్ రాజు వల్లనే సాధ్యమైంది. మరెవరికీ ఈ ఫీట్ సాధ్యంకాదు. టికెట్ ల పెంపు వల్ల 25శాతం అదనపు ఆదాయం వచ్చిందని అంచనా. సీత అనే సినిమా ఫ్యామిలీ సినిమా. వాస్తవానికి అది మహర్షి వచ్చిన వారానికి వచ్చేసేదే. కానీ దాని నిర్మాత అనిల్ సుంకరనే, మహేష్ తరువాత సినిమా నిర్మాత. అందువల్ల ఆయన ఓ వారం వెనక్కు వెళ్లారు. సమ్మర్ సినిమాలు అన్నీ మహర్షికి ముందే కానిచ్చేసారు దిల్ రాజు.

అయితే ఇక్కడ ఇంకో పాయింట్ వుంది. సినిమా బాగా లేకపోతే, ఎంత గ్యాప్ వున్నా జనాలు సినిమా చూడరు. అజ్ఞాతవాసి, ఎన్టీఆర్ బయోపిక్ ల విషయంలో అది రుజువయింది. మహర్షి కంటెంట్ కొంతయినా జనాలకు చేరింది కాబట్టే నిలబడింది అనుకోవాలి.  మీడియా కూడా సినిమాకు అబౌవ్ ఏవరేజ్ రేటింగ్ 2.75 ఇచ్చింది కానీ యావరేజ్, బిలో యావరేజ్ కాదు. అందువల్ల రేట్లు, కంటెంట్, సీజన్, థియేటర్లు ఇలా అన్నీ కలిసి వచ్చి మహర్షికి తొలివారం మంచి ఫలితాలు వచ్చాయి.

ఈ విషయం మహేష్ కు కూడా తెలియంది కాదు. కానీ ఇక్కడ ఇంకో సంగతి కూడా వుంది. సినిమాకు ఖర్చు ఎక్కువ అయింది. నిర్మాతలు దిల్ రాజు, పివిపి వారి స్వంత బాధ్యతతో, స్వంత రిస్క్ తో సినిమాను విడుదల చేసారు. మరే నిర్మాత అయినా ఇలా చేయడం కష్టం. మరి అలా చేసిన నిర్మాతలను గట్టెక్కించాల్సిన అవసరం వుంది. బిలోయావరేజ్ కంటెంట్ అయితే మహేష్ కూడా సైలంట్ గా వుండేవాడు. అబౌవ్ యావరేజ్ కంటెంట్ కనుకే సినిమాను మరింత లేపడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆ విధంగా నిర్మాతలను పూర్తిగా సేఫ్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే భరత్ అనే నేను సినిమాకు హిట్ టాక్ వచ్చింది. హిట్ రేటింగ్ లు వచ్చాయి. కానీ అందరు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ కాలేదు. ఈసారి అలా జరగడానికి వీలులేకుండా వుండాలని మహేష్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. 

మహర్షి  సినిమా ఏరియాల వారీ  చూసుకుంటే నైజాం దాదాపు సేఫ్ జోన్ కు వచ్చేసింది.

సీడెడ్ ది ఎప్పుడూ డిఫరెంట్ వ్యవహారం. అక్కడ మాత్రం మహర్షికి మైనస్ కాక తప్పదు.

ఉత్తరాంధ్రలో మరో రెండు కోట్ల వరకు రావాలి. సెకెండ్ వీకెండ్ కు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.

ఈస్ట్ లో ఇంకో కోటి రూపాయలు రావాలి. అది కూడా సెకెండ్ వీకెండ్ కోసం వెయిటింగ్.

వెస్ట్ లో కూడా దాదాపు అంతే రావాలి. అదే వీకెండ్ వస్తే బ్రేక్ ఈవెన్.

కృష్ణలో కోటిన్నర వరకు రావాలి. శని, ఆదివారాలతో సేఫ్ అయిపోయే అవకాశం వుంది.

గుంటూరులో కూడా కోటిన్నర దూరంలో వున్నారు. వీకెండ్ భరోసా వుంది.

నెల్లూరులో ఓ అరవై, డెభై లక్షలు వస్తే చాలు.

అంటే టోటల్ గా సెకండ్ వీకెండ్ కు సీడెడ్ మినహా డొమస్టిక్ మార్కెట్ అంతా క్లియర్ అవుతుంది.

ఆ తరువాత కమిషన్ లేదా లాభాలు.

ఇక్కడ రెండు పాయింట్లు వున్నాయి.

ఒకటి రేపటి నుంచి మామూలు రేట్లు. అందువల్ల ఈ రేట్లలో సినిమా చూడాలనుకునేవారు థియేటర్లకు వస్తారు. మామూలుగా కలెక్షన్లు తగ్గితే ఈ తరహా రెవెన్యూ భర్తీ చేస్తుందని బయ్యర్ల అంచనా.

అదే విధంగా చిన్నసెంటర్లు, సింగిల్ థియేటర్లలో ఇక రెంట్ల మీద ఆడడం తగ్గించి, షేరింగ్ మీదకు మార్చే వ్యవహారం వుంటుంది. అందువల్ల షేర్ పెరిగే చాన్స్ వుంది. ఫస్ట్ వీకెండ్ తరువాత సోమ, మంగళ, బుధ, గురువారాల్లో అదనంగా వున్న థియేటర్లు షేర్ ను మింగేసిన మాట వాస్తవం.

సో ఇవన్నీ కలుపుకుంటే, మహర్షి సినిమాకు బయ్యర్లు సేఫ్ కావడం పక్కా. కమిషన్లు తినడం, లాభాలు అన్నది తరువాత. నిర్మాతల్లో అశ్వనీదత్ కు మూడుకోట్లకు పైగా ఇచ్చారని టాక్. అందువల్ల ఆయన సేఫ్. దిల్ రాజు-పివిపి చేతిలో కృష్ణ, వైజాగ్, నైజాం, ఓవర్ సీస్ వున్నాయి. అందువల్లు లాంగ్ రన్ లో ఎంతోకొంత వస్తుంది. ఆ విధంగా మహర్షి సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ అనే దాని కన్నా కమర్షియల్ గా సేఫ్ ఫ్రాజెక్టు.

కానీ కంటెంట్, అందులో వున్న మెసేజ్ పరంగా మాత్రం మహేష్  కాలర్ ఎత్తే సినిమా. కమర్షియల్ గా మాత్రం మహేష్ కాలర్ ఎత్తడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నైజాం పాతిక కోట్లు పైగా చేస్తుందని అంచనా. 38 నుంచి 40 కోట్ల రేషియోలో ఆంధ్ర అమ్మారు. మళ్లీ మలి సినిమాకు దీనికి మించిన లెక్కలు వస్తే అప్పుడు కచ్చితంగా కాలర్ ఎత్తవచ్చు.

భరత్ అనే నేను లాంటి హిట్ సినిమా తరువాత మహర్షికి అదనపు ఫిగర్లు రాలేదు. మార్కెట్ స్టడీగానే వుంది. అది హ్యాపీ థింగ్. ఇందులో ఫ్యాన్స్ ఫీలవడానికి లేదు. మంచి సినిమా, హిట్ సినిమా అని ఫ్యాన్స్ మాత్రం కాలర్ ఎత్తుకోవచ్చు.

సుదర్శన్ థియేటర్ ను సందర్శించిన మహర్షి టీమ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

సినిమా రివ్యూ: మహర్షి