కేబినెట్ భేటీ సరే.. అనుమతి ఎవరు తీసుకోవాలి?

పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి అనే సామెత మాదిరిగా తయారైంది రాష్ట్రంలో టీడీపీ-అధికారుల పరిస్థితి. ఈనెల 10-12 తేదీల మధ్య కేబినెట్ మీటింగ్ పెట్టి తీరతానని శపథం చేస్తున్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని…

పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి అనే సామెత మాదిరిగా తయారైంది రాష్ట్రంలో టీడీపీ-అధికారుల పరిస్థితి. ఈనెల 10-12 తేదీల మధ్య కేబినెట్ మీటింగ్ పెట్టి తీరతానని శపథం చేస్తున్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని నిన్న ఢిల్లీలో కూడా చెప్పారు. అటు అధికారులతో పాటు సీఎస్ కూడా కేబినెట్ మీటింగ్ కు వెళ్లడానికి తనకేం అభ్యంతరం లేదని తెలిపారు. కాకపోతే ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలన్నారు. సరిగ్గా ఇక్కడే చిక్కుముడి పడింది.

సీఎస్, అధికారులే ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకొని కేబినెట్ భేటీకి రావాలని చంద్రబాబు అంటున్నారు. సీఎస్ మాత్రం సర్కారే అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. రూల్ బుక్ ప్రకారం, కేబినెట్ మీటింగ్ పెట్టాలనుకునే నాయకులే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి అధికారుల్ని పంపించాల్సిందిగా కోరాల్సి ఉంటుందని అంటున్నారు. దీంతో ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది చంద్రబాబుకి.

ఇగో పక్కనపెట్టి స్వయంగా ఆపద్ధర్మ ప్రభుత్వమే ఎన్నికల సంఘాన్ని కోరితే ఓ చిక్కు ఉంది. అదేంటంటే.. కేబినెట్ భేటీకి అనుమతి కోరితే ఎజెండా వివరాలు ఇవ్వమని కేంద్ర ఎన్నికల సంఘం కోరుతుంది. అదే కనుక జరిగితే చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారవుతుంది. ఈ కేబినెట్ భేటీ ముసుగులో పెండింగ్ లో ఉన్న ఎన్నో ఫైళ్లను క్లియర్ చేయాలని, తమ వర్గానికి చెందిన కొన్ని బిల్లుల్ని ఓకే చేసేయాలనేది చంద్రబాబు పన్నాగం. అలా ఖజానాలో ఉన్న కొద్దిపాటి నిధుల్ని కూడా నాకేయాలని ప్లాన్ వేశారు.

ఇదే తనకు చివరి కేబినెట్ మీటింగ్ అనే విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే ఈ మీటింగ్ లోనే కీలకమైన తీర్మానాలు చేసి, పెండింగ్ లో ఉన్న బిల్లులు, జీవోల్ని క్లియర్ చేసేయాలనేది బాబు ఆలోచన. అలా అస్మదీయులకు ఆఖరి నిమిషంలో కూడా మేళ్లు చేయడానికి చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. ఒకవేళ ఈసీ కనుక కేబినెట్ మీటింగ్ ఎజెండా అడిగితే ఇవన్నీ వాళ్లకు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిగ్గా ఎన్నికల సంఘం మీటింగ్ కు అనుమతి నిరాకరిస్తుంది.

నిజానికి కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టొద్దని రాజ్యాంగం చెప్పడంలేదు. రాజకీయంగా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు, పార్టీకి సంబంధించి కీలకమైన నేత చనిపోయినప్పుడు, రాష్ట్రంలో ప్రజాజీవితం అతలాకుతలం అయినప్పుడు ఈసీకి ఓమాట చెప్పి కేబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఏపీలో అలాంటి పరిస్థితులు లేవు. పెండింగ్ లో ఉన్న చిన్నచిన్న పనుల్ని అధికారులే చకచకా పూర్తిచేస్తున్నారు. చంద్రబాబు అవసరం ఏ కోశానా కనిపించడం లేదు. కానీ కేబినెట్ భేటీ పెడతానంటున్నారు బాబు.

మొత్తమ్మీద కేబినెట్ భేటీ పేరుతో తన పరువు తానే తీసుకోడానికి చంద్రబాబు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టయింది. ఈ మీటింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుచెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు బాబు పరువు పూర్తిగా గంగలో కలవడం ఖాయం.

ఫలితాలకు ముందే జగన్ వైపు చూస్తున్నారా?