సినిమాలైతే చకచకా చేస్తున్నాడు కానీ బాలయ్య ప్రతి సినిమాకు ఓ కొత్త హీరోయిన్ ను వెదికిపట్టుకోవడం మేకర్స్ కు కష్టంగా మారుతోంది. షష్టిపూర్తికి దగ్గరవుతున్న బాలయ్య సరసన నటించడానికి హీరోయిన్లు ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో తన హీరోయిన్లను తానే మరోసారి రిపీట్ చేస్తున్నాడు బాలయ్య. తాజాగా మరోసారి అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు.
బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో కొత్త సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ఈ సినిమా లాంఛింగ్ ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మరోసారి హరిప్రియను తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతంలో బాలయ్య నటించిన జైసింహా సినిమాలో హరిప్రియ నటించింది. ఆ సినిమాకు కూడా కేఎస్ రవికుమారే దర్శకుడు.
పూర్తిగా కన్నడ సినిమాలకే పరిమితమైన హరిప్రియకు, మార్కెట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకోవాలని కోరిక. గతంలో ఆమె చేసిన 2-3 ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గతేడాది బాలయ్య సరసన జైసింహా చేసినప్పటికీ అది ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా కలిసిరాలేదు. సో.. మరోసారి బాలయ్య సినిమాతోనే ఆమె తెలుగులో అదృష్టం పరీక్షించుకోనుంది. అయితే ఈసారి కూడా ఆమె మెయిన్ హీరోయిన్ కాకపోవచ్చు.
ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. సి.కల్యాణ్ బ్యానర్ పై రానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.