విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒంటెద్దు పోకడలు పోతున్నారని తమ్ముళ్లు గుర్రుమంటున్నారు. ఆయన తానే అధినాయకత్వమని భావిస్తూ పార్టీలో కొందరినే చేరదీస్తు విభజన రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు.
వైసీపీ హవాలో కూడా విశాఖ నగర పాలక సంస్ధ ఎన్నికలలో ముప్పయి కార్పోరేటర్లు సీట్లను పార్టీ గెలుచుకుంటూ దిశ చూపాల్సిన అధ్యక్షుడు కొందరిని మాత్రమే తన వెంట తిప్పుకుంటూ పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈమధ్య పల్లా శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహిస్తే దానికి ఇద్దరు ముగ్గురు కార్పోరేటర్లు తప్ప మిగిలిన వారు గైర్ హాజరు కావడం పట్ల అధినాయకత్వం కూడా ఆరా తీసింది. అయితే తాము పార్టీకి వ్యతిరేకం కాదని పల్లా విధానాలేక అని చాలామంది కార్పోరేటర్లు చెబుతున్నారు.
ఇవన్నీ పెడితే వైసీపీ విశాఖ రాజకీయాలలో జోరు చేస్తోంది. పైగా రాజధాని కూడా త్వరలో తరలివస్తుందని అరటున్నారు. మరో వైపు ఎన్ని సార్లు గెలిచినా కార్పోరేషన్‌లో ప్రతిపక్షంలోనే ఉండడం వల్ల అభివృద్ధి తమ వార్డులలో జరగడంలేదని భావిస్తున్న కొందరు తమ్ముళ్లు వైసీపీ వైపుగా వచ్చేందుకు కూడా ఆలోచన చేస్తున్నారు అంటున్నారు.
ఇక పల్లా శ్రీనివాసరావు గాజువాకలో తన మేనల్లుడిని ఇన్‌చార్జిగా నియమించడం పట్ల కూడా అక్కడ కార్పోరేటర్లు గుస్సా అవుతున్నారు. పల్లా నాయకత్వం పట్ల పార్టీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేయడమే కాదు, ఏదో ఒకటి తేల్చాలని కూడా హైకమాండ్‌ను కోరుతూండడంతో విశాఖ టీడీపీలో ముసలం పుట్టిందని అంటున్నారు.