నయనతార నుంచి ఇప్పటికే ఓ సినిమా ఓటీటీలో డైరక్ట్ గా రిలీజైంది. గతేడాది లాక్ డౌన్ టైమ్ లో ఆమె నటించిన అమ్మోరు తల్లి సినిమాను డిస్నీ హాట్ స్టార్ లో డైరక్ట్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు నయనతార నుంచి మరో సినిమా నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. దాని పేరు నెట్రికన్.
నయనతార లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాను డైరక్ట్ గా రిలీజ్ చేసేందుకు డిస్నీ హాట్ స్టార్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తుంది.
మిలింద్ రావు (గృహం మూవీ దర్శకుడు) డైరక్ట్ చేసిన ఈ సినిమాకు నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ నిర్మాత. రౌడీ పిక్చర్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార పెట్టుబడులు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. కాబట్టి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. మరో వారం రోజుల్లో ఈ డీల్ పై స్పష్టత వస్తుంది.
బ్లైండ్ అనే కొరియన్ థ్రిల్లర్ ఆధారంగా నెట్రికన్ తెరకెక్కింది. ఈ సినిమాలో నయనతార అంథురాలిగా కనిపించనుంది. అజ్మల్, మణికందన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.