ఏది మిఠాయి మోడీజీ! ఎవరికి మిఠాయి!!

‘‘ ‘మిఠాయి సంస్కృతి’ (Revadi culture) తో జాగ్రత్తగా ఉండాలి. అది మంచిది కాదు ప్రమాదకరం..’’ ఈ వ్యాఖ్యలు.. రాజకీయేతర ప్రముఖులనుంచి మనం తరచూ వింటూ ఉంటాం. ప్రజలకు ఉచితంగా ఏమైనా ఇవ్వడం అనేది…

‘‘ ‘మిఠాయి సంస్కృతి’ (Revadi culture) తో జాగ్రత్తగా ఉండాలి. అది మంచిది కాదు ప్రమాదకరం..’’ ఈ వ్యాఖ్యలు.. రాజకీయేతర ప్రముఖులనుంచి మనం తరచూ వింటూ ఉంటాం. ప్రజలకు ఉచితంగా ఏమైనా ఇవ్వడం అనేది సమాజానికి చేటు చేస్తుందని రకరకాల విశ్లేషణలు వినిపిస్తూ ఉంటాయి. అలాగే.. ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల గురించి.. ఆ పథకాల కోవకు చెందని సంపన్న, ఉన్నత, అగ్ర వర్గాల నుంచి అనేక రకాల విమర్శలు, సెటైర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ రాజకీయ నాయకుల నుంచి అలాంటి మాటలు వినిపించవు. 

ఇందుకు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే కారణం కాదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి జీవన ప్రమాణాలు కనీస స్థాయిలో ఉండడానికి, జీవించడానికి కూడా గతిలేని వారికి ప్రభుత్వం కొంత మద్దతు తప్పనిసరిగా అవసరం అవుతుంది. గతిలేని వారిని ప్రత్యేకమైన దృష్టితో ఆదుకోకపోతే.. ఇక ప్రభుత్వాలు ఎందుకు? ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసి.. ఆ డబ్బులోంచి తాము లక్షల కోట్లు జీతాలు తీసుకుని, వైభోగాలు అనుభవిస్తూ.. మిగిలిన సొమ్ముతో తిరిగి ప్రజలకోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం కావాలా? ప్రజల బాగోగులు చూడాల్సిన పనిలేదా?

ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటే.. ఒక బిడ్డ బలహీనంగా అనారోగ్యంగా ఉంటే.. వాడి మీద ప్రత్యేక శ్రద్ధతో, ఒక ముద్ద ఎక్కువ తినిపించాలని తల్లి కోరుకోవడం తప్పు అవుతుందా? ప్రభుత్వాలు పేదల కోసం చేపట్టే ఉచిత పథకాలు కూడా అచ్చంగా ఆ తల్లి ప్రేమ లాంటివే. అయితే.. ఇవి కొద్దిగా శ్రుతిమించి ఓటు బ్యాంకు రాజకీయాలకోసం గాడితప్పడం, అతి కావడం కొన్ని చోట్ల జరుగుతూనే ఉంది.

దేశ ప్రధానిగా.. ఇలాంటి గాడితప్పే వ్యవహారాలను నియంత్రించడం మోడీ బాధ్యత అవుతుంది. వ్యవస్థలో లోపాలను చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా.. మొత్తానికి రూపుమాపాలని అనుకోవడం.. మంచిది కాదు.

మోడీ విచక్షణ ఉన్న నాయకుడే అయితే.. ఈ ఉచితపథకాలను.. ‘రేవడీ కల్చర్’ అంటూ ఎగతాళి చేసేవారు కాదు. ఆయన వాడిన పదజాలం ఆయనలోని అహంకారానికి నిదర్శనం. నేను చాయ్ వాలా స్థాయినుంచి ఈ దేశ ప్రధాని అయ్యాను అని చెప్పుకునే మోడీకి.. ఆ స్థాయి నిమ్న వర్గాలకు చెందిన పేదల జీవితాల గురించిన స్పృహ, జాలి, గౌరవం ఉన్నట్టు లేవు. ఉంటే.. ‘మిఠాయి సంస్కృతి’ అని అర్థం వచ్చే మాటలు మాట్లాడేవారు కాదు. 

పేదలకు అందించే ఉచిత పథకాలను ఎగతాళి చేస్తున్న నరేంద్రమోడీ.. వేలకు వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టి పారిపోతున్న వారిని ఏం చేయగలుగుతున్నారు? నష్టపోయిన బ్యాంకులకు మద్దతుగా ప్రభుత్వం తరఫున నిధులు సర్దుబాటు చేసే దుర్మార్గమైన సంస్కృతిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు?

బ్యాంకు  రుణాలు ఎగ్గొట్టే బడా బాబుల నుంచి వసూలు చేయించగల దమ్ములేని ప్రభుత్వానికి, పేదలకు ఉచితంగా పథకాలు అందించడం తప్పని చెప్పే హక్కు ఎక్కడ ఉంటుంది? అని ఆలోచించాలి.

పేదల గురించి ప్రత్యేకంగా పట్టించుకునే కన్సర్న్ ఉన్న నాయకుడు అయితేనే మోడీ ఈ దేశానికి ప్రధానిగా ప్రజలు కోరుకుంటారు.. అలాకాకుండా.. ఆ బాధ్యతలేం నాకు వద్దు.. ప్రజలనుంచి వసూలు చేసిన డబ్బును అవినీతి చేయకుండా ఖర్చు పెట్టే మేనేజర్ లాగా మాత్రమే ఉంటాను.. అనేట్లయితే ఆయన మేనేజర్ మాత్రమే అవుతారు.. నాయకుడు కాలేరు!