ఎట్టకేలకు శ్రీకృష్ణుడి జన్మస్థానానికి రఘురాముడు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును హైదరాబాద్‌లో ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు.
విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రకటనల వెనుక ఎవరున్నారనే విషయమై సీఐడీ అధికారులు ఆయన్ను విచారించారు. హైకోర్టు ఆదేశాలతో ఆయన్ను కోర్టులో హాజరుపరచలేదు. నిన్న బెయిల్‌కు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. కింది కోర్టుకు వెళ్లకుండా ఇక్కడికి నేరుగా ఎందుకొచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
సీఐడీ కోర్టులో రఘురామకృష్ణంరాజును హాజరుపరి చారు. తన కాళ్లు వాచిపోయేలా చితకబాదారని ఆయన జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు రాతపూర్వకంగా న్యాయమూర్తికి ఎంపీ ఫిర్యాదు చేశారు. ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు చెప్పారు.
దీంతో మళ్లీ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. జీజీహెచ్‌లో ఎంపీకి 18 రకాల వైద్య పరీక్షలు పూర్తిచేసిన మెడికల్ బోర్డు.. కోర్టుకు సమర్పించే నివేదికను సిద్ధం చేసింది.
కాసేపటి క్రితం కోర్టుకు కూడా సమర్పించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించడం గమనార్హం. మరోవైపు మెడికల్ బోర్డు కోర్టుకు సమర్పించిన నివేదిక ఏమై ఉంటుందనే ఉత్కంఠ నెలకుంది.