షయారా బానో కేసులో ఆమె భర్తతో బాటు ముస్లిం పర్శనల్ బోర్డు కలగజేసుకుని ''మా ముస్లిముల పెళ్లి, విడాకులు వగైరా మా పర్శనల్ లా ప్రకారం జరుగుతాయి. మా పర్శనల్ లా న్యాయపరిధిలోకి రాదు. దానిలో జోక్యం చేసుకోకండి.'' అని సుప్రీం కోర్టుతో వాదించింది. న్యాయపరిధిలోకి వస్తుందని కోర్టులు ఎప్పుడో అభిప్రాయ పడ్డాయి. 2008లో దిల్లీ హై కోర్టు జజ్ బి.డి. అహ్మద్ ముమ్మారు తలాక్ పద్ధతి పాపిష్టి పని అని రూలింగ్ యిచ్చారు.
''ముస్లిములలో ఏ పంథా కూడా దాన్ని ఆమోదించదు. చరిత్రలో ఒకానొక ఘట్టంలో అది అమలులోకి వచ్చింది. దాన్ని తీసి అవతల పారేస్తే ఇస్లాం మౌలిక సూత్రాలకు ఏ మాత్రం భంగకరం కాదు.'' అన్నారాయన. ఇలాహాబాద్ హైకోర్టు యీ ఏప్రిల్‌లో తీర్పు చెపుతూ ఏ పర్శనల్ లా అయినా రాజ్యాంగం, చట్టం పరిధిలోనే పనిచేయాలని చెప్పింది. ఈ తలాక్ విధానం వ్యక్తి స్వేచ్ఛకు భంగకరం అని చెప్పింది. కొందరు ముస్లిం మతపెద్దలు దీన్ని వ్యతిరేకించారు.
సుప్రీం కోర్టు మాజీ జజ్ కెటి థామస్ కేరళ హైకోర్టులో పనిచేసే రోజుల్లో నేతృత్వం వహించిన బెంచ్ ఒక కేసులో కీలకమైన తీర్పు చెప్పింది. దాని ప్రకారం చర్చికి యిద్దరి మధ్య పెళ్లి నిర్వహించే హక్కు వుంది. ఒకసారి పెళ్లయ్యాక భార్య, భర్త యిద్దరికీ రాజ్యాంగం యిచ్చిన చట్టబద్ధమైన హక్కులుంటాయి. వాటిని చర్చి హరింపజాలదు. ఈ తీర్పును సుప్రీం కోర్టు కూడా ధృవపరిచింది. దాన్ని యీ తలాక్ కేసుకు అన్వయిస్తే ఒక వివాహితురాలిగా షయారా బానో హక్కులను ఏ మతాచారమూ హరించలేదు.
మహిళా హక్కుల ఉద్యమనేత, ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యురాలు, లఖనవ్‌లో కాజీగా పనిచేసిన తొలి మహిళ అయిన సయీదా హమీద్ ''2002లోనే షామీన్ ఆరా వెర్శస్ స్టేట్ ఆఫ్ యుపి కేసులో ఆర్ సి లహోటీ, పి వెంకట్రామరెడ్డి అనే సుప్రీం కోర్టు జజ్‌లు ఒకేసారి ముమ్మారు తలాక్ చెప్పడం చట్టబద్ధం కాదని, కురాన్ నిర్దేశించిన ప్రకారం తలాక్ చెప్పాలని రూలింగ్ యిచ్చారు. ముస్లిం పర్శనల్ లా బోర్డు దాన్ని వ్యతిరేకించలేదని నాకు గుర్తు. 2002లోనే బొంబాయి హైకోర్టు వారి ఔరంగాబాద్ బెంచ్ కూడా దగ్డూ పఠాన్ వెర్శస్ రహీమ్ బీ కేసులో కూడా ముమ్మారు తలాక్‌ను కొట్టివేసింది. ఇప్పుడు మళ్లీ దీనిపై చర్చేమిటో నాకు అర్థం కావటం లేదు.'' అన్నారు.
ముస్లిమ్ పర్శనల్ లా బోర్డు ఉపాధ్యక్షుడు, జమాత్ ఏ ఇస్లామీ హింద్ అధినేత అయిన మౌలానా సయ్యద్ జలాలుద్దీన్ ఉమారీ ''తలాక్ యివ్వడానికి వీల్లేదని భర్తలను నిర్బంధిస్తే భార్యలను వదుల్చుకోవడానికి భర్తలు క్రూరమైన పద్ధతులు అవలంబిస్తారు. వారిని సజీవంగా కాల్చేయవచ్చు, చంపేయవచ్చు, వారితో సంసారం చేయమని బెదిరించవచ్చు.'' అన్నాడు. ఎంత చిత్రమైన వాదనో చూడండి. కాపురం సరిగ్గా నడవకపోతే విడాకులు యివ్వవద్దని ఎవరూ చెప్పరు. ఎటొచ్చీ కాస్త సవ్యంగా యివ్వమనే ఎవరైనా అడిగేది.
కురాన్ ప్రకారం 'ఖులా' పద్దతిలో భార్య కూడా వివాహాన్ని విముక్తి కోరవచ్చు.అయితే మధ్యలో ఒక మతగురువుని మధ్యవర్తిగా పెట్టుకుని ఆ పని చేయాలి. భర్త విషయంలో మాత్రం అటువంటి నిబంధన పెట్టలేదు. అదీ చిక్కు. వివాహమన్నది యిద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం అనుకుంటే దాన్ని భంగం చేసే హక్కు యిద్దరికీ సమానంగా వుండాలి. కానీ ముస్లిము భర్తకు ఏకపక్షంగా హక్కు యివ్వడం జరిగింది.
'తలాక్ ఎ బిదాత్, బహుభార్యాత్వం, నికా హలాలాలు చట్టవిరుద్ధమైనవి, రాజ్యాంగవిరుద్ధమైనవి. ఎందుకంటే అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15, 21, 26ల ద్వారా సంక్రమించిన మౌలిక హక్కులను హరిస్తున్నాయి. అందుకని రద్దు చేయాలి' అని షయారా బానో వాదన. 'మమ్మల్ని శాసించేది ముస్లిము పర్శనల్ లా మాత్రమే. దాని ప్రకారం యివన్నీ చెల్లుతాయి' అని షయారా భర్త వాదన. మతస్వేచ్ఛ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడే వుంటుందని రాజ్యాంగం లోని 25వ ఆర్టికల్ చెపుతుంది. ఆర్టికల్ 14 అందరికి సమాన హక్కులను యిస్తుంది.
ముమ్మారు తలాక్ విషయంలో స్త్రీపురుషుల మధ్య వ్యత్యాసం వుంది. ఆర్టికల్ 15 (1) ప్రకారం పౌరుల మధ్య మత, జాతి, కుల, లింగ వివక్షత చూపకూడదు. దీని విషయంలో స్త్రీల పట్ల వివక్షత కనబడుతోంది. ఈ అంశాలపై నిర్ణయించడానికి సుప్రీం కోర్టు ఐదుగురు జజ్లతో ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. దానిలో చీఫ్ జస్టిస్ ఖేహర్ సిఖ్. యితర జస్టిస్‌లలో లలిత్ హిందూ, కురియన్ జోసెఫ్ క్రైస్తవుడు, నారిమన్ పార్శీ, అబ్దుల్ నజీర్ ముస్లిం. ముమ్మారు తలాక్ ఇస్లామ్‌కు మౌలికమైనదా (ఫండమెంటల్) కాదా అని, మౌలికమైనదైతే కోర్టు దీనిలో కలగచేసుకోవచ్చా లేదా, ఆ ఆనవాయితీకి పవిత్రత వుందా, వుంటే అది యితరులకు రాజ్యాంగపు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందా అనే విషయాలు పరిశీలిస్తుంది. ఈ బెంచ్ వేసవి సెలవుల్లో కూడా పనిచేసి మే 18 వరకు యిరుపక్షాల వాదనలూ వింది. తీర్పు రిజర్వ్ చేసింది.
'ముమ్మారు తలాక్ సంప్రదాయం చట్టవ్యతిరేకం, రాజ్యాంగవిరుద్ధం' అని త్వరలోనే సుప్రీం కోర్టు తీర్పు యిచ్చినా అది అమలవుతుందా లేదా అన్న సందేహం రావడంలో ఆశ్చర్యం లేదు. 'నా భర్తకు బాగా డబ్బున్న నాకిస్తానన్న మనోవర్తి యివ్వటం లేదు. దయచేసి యిప్పించండి' అని షా బానో అనే మహిళ 1985లో సుప్రీం కోర్టుకి వెళితే పెళ్లింది. ఆమె భర్తకు అనేకమంది భార్యలు. వాళ్ల వలన పుట్టిన సంతానం మధ్య ఆస్తి తగాదాల్లో దృఢంగా మాట్లాడిందన్న కోపంతో 40 ఏళ్ల కాపురాన్ని ఒక్క నిమిషంలో మూడు తలాకులు చెప్పి ముగించేశాడు ఆమె భర్త.
పైగా మనోవర్తి యివ్వడం మానేశాడు. అది సిపి 125 ప్రకారం నేరం. అది ఎత్తిచూపితే ఆమె భర్త ''నేనూ, మా ఆవిడా ముస్లిములం. మా పర్శనల్ లా ప్రకారం మూణ్నెళ్ల కాలం (ఇద్దత్) తర్వాత మనోవర్తి యివ్వనక్కరలేదు. పెళ్లినాడు యిచ్చిన కానుక (మెహర్) తిరిగి యిచ్చేయాలి. అది యిచ్చేశాను. ఇక నాకే బాధ్యత లేదు.'' అని వాదించాడు. ముస్లిం పర్శనల్ బోర్డు కేసులో భాగస్వామిగా మారి (ఇంప్లీడ్) 'సిపిసి 125 ముస్లిం పర్శనల్ లాను అధిగమించజాలదు (ఓవర్‌రైడ్)' అని వాదించింది. కోర్టు షా బానో పక్షానే తీర్పు చెప్పింది. వివాహం పర్శనల్ లా ప్రకారం జరిగినా మనోవర్తి రాజ్యాంగానికి లోబడే వుంటుందని స్పష్టం చేసింది. అందువలన భర్త మనోవర్తి ఆపడానికి వీల్లేదని చెప్పింది.
వెంటనే ముస్లిం మతపెద్దలు యిది తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అంటూ అల్లరి పెట్టారు. షా బానోకు వ్యతిరేకంగా వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తే లక్షలాది ముస్లిములు వాటికి హాజరయ్యారు. షా బానోకు అనుకూలంగా హాజరైనవారు వందల్లో వున్నారు. ఇది చూసి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కంగారు పడ్డాడు. మొదట్లో అతను సుప్రీం కోర్టు తీర్పును హర్షించాడు. పార్లమెంటులో దానిపై చర్చ జరిగినపుడు ఉదారవాద ముస్లిము ఐన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ చేత తీర్పును వ్యతిరేకించినవారిపై దాడి చేయించాడు.
కానీ యీ ప్రదర్శనలు చూసి, మెజారిటీ ముస్లిముల ఫీలింగ్సు చూసి కంగారు పడ్డాడు. ముస్లిము ఓటర్లకు కోపం వచ్చేస్తుందని భయపడి సుప్రీం కోర్టు రూలింగు చెల్లకుండా 1986లో చట్టం చేశాడు. ముస్లింలను ఆ విధంగా సంతృప్తి పరచినందుకు బదులుగా హిందువులను సంతృప్తి పరచడానికి అంటూ రామజన్మభూమిని తెరిపించాడు. అది క్రమేపీ అనేక వివాదాలకు దారి తీసింది. మాటల్లో, ఆలోచనల్లో పాశ్చాత్య నాగరికతకు పెద్దపీట వేసిన రాజీవ్ చేతల్లో మాత్రం అత్యంత హేయమైన మతఛాందసవాదానికి తెరతీసి, రెండు తప్పులు చేశాడు. వాటి ఫలితాలు 30 ఏళ్లు దాటినా అనుభవిస్తూనే వున్నాం.
ఇప్పుడు షయారో బానో కేసు కథ కూడా షా బానో కథలాగానే అవుతుందా అనే సందేహం రావచ్చు. ముస్లిం పర్శనల్ బోర్డుకి యిప్పటికీ సంప్రదాయ, ఛాందస ముస్లిముల్లో పట్టు వుంది. కానీ 30 ఏళ్లలో ముస్లిం మహిళలు చాలా మారారు. లక్షలాది ముస్లిం మహిళలు గళం విప్పుతున్నారు. ముస్లిమేతర సభ్యసమాజం కూడా దీనిపై చర్చిస్తోంది. మార్పు తెచ్చేందుకు అనుకూల సమయం వచ్చినట్లే వుంది.
ఇది శుభపరిణామం. ఏ మార్పయినా సరే ఆ వర్గంలోని అధిక సంఖ్యాకులు ఆమోదించాలి. అప్పుడే దానికి ప్రభుత్వం వత్తాసు పలకగలుగుతుంది. వితంతు పునర్వివాహం, హరిజన ఆలయప్రవేశం.. వంటి సంస్కరణలు, సతీసహగమనం, కన్యాశుల్కం, బాల్యవివాహాలు – వంటి వాటిపై నిరసన… యిలాటివన్నీ ఆ యా వర్గాలలోని సంస్కరణవాదులు ఛాందసవాదులపై పోరాడి గెలిచినవే. ఆ పోరాటం జరగకుండా ప్రభుత్వం తనంతట తానుగా చట్టం చేస్తే అది అమలు కాదు.
ఇప్పుడు ముస్లిం సమాజం తమ బాగు కోసం కృషి చేస్తే ప్రస్తుతం వున్న మోదీ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందనుకోవచ్చు. ఎందుకంటే వారు హిందూ ఛాందసవాదానికి తలవొగ్గవచ్చు కానీ ముస్లిం ఛాందసవాదానికి తలవొగ్గే ప్రశ్నే లేదు. ముస్లిం ఓట్లు లేకపోయినా ఖాతరు చేయం అని జబర్దస్తీగా చేతల్లో కూడా చూపిస్తున్నారు వారు.
అందువలన కోర్టు తలాక్‌కు వ్యతిరేకంగా తీర్పు చెపితే అది అమలు కావడం ఖాయమనిపిస్తోంది. మే 15న కేంద్రం తరఫున నివేదిస్తూ ఎటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి 'కోర్టు తీర్పు తలాక్‌కు వ్యతిరేకంగా వస్తే కేంద్రం దానికి అనుగుణంగా చట్టం చేస్తుంద'ని హామీ యిచ్చారు. తీర్పుతో సంబంధం లేకుండానే మీరు చట్టం చేయాల్సింది అని చీఫ్ జస్టిస్ అంటే 'అప్పుడు పార్లమెంటులో అది పాస్ అవుతుందో లేదో చెప్పలేం' అన్నాడు రోహ్తగి. భారతీయ ముస్లిము మహిళా ఆందోళన్ ముస్లిము ఫ్యామిలీ చట్టం ఎలా వుండాలో ఒక నమూనా తయారుచేసి రెండేళ్ల క్రితమే ప్రధానికి సమర్పించింది.
అది చట్టంగా మారుతుందేమోనని ముస్లిం పర్శనల్ బోర్డు కంగారు పడుతోంది. అది 1973లో ఏర్పడిన ఒక ప్రయివేటు బాడీ. దానిలో 51 మంది ఉలేమాలు (మతసూత్రాలను అన్వయించేవారు), 201 మంది మామూలు సభ్యులతో జనరల్ బాడీ వుంది. వారిలో సాధారణ పౌరులు, 25 మంది స్త్రీలు కూడా వున్నారు. బోర్డులో అహ్మదియా పంథా ముస్లిములను చేర్చుకోరు.
మన దేశంలోని వివిధ ప్రాంతాలలోని ముస్లిములలో స్థానిక ఆచారాల బట్టి రకరకాల చట్టాలు అమల్లో వున్నాయి. వారిపై హిందూ సివిల్ కోడ్ ప్రభావం కూడా వుంది. వారందరినీ షరియాకు అనుకూలంగా మార్చాలని బోర్డు ప్రయత్నిస్తూంటుంది. పిల్లలకు నిర్బంధ విద్యా చట్టాన్ని వ్యతిరేకిస్తుంది. బాల్యవివాహాలను ప్రోత్సహిస్తుంది. వాటిని నియంత్రించడాన్ని వ్యతిరేకిస్తుంది. దీని పెత్తనం భరించలేని షియాలు, మహిళా ఉద్యమకారులు వేర్వేరు బోర్డులు పెట్టుకున్నాయి కానీ వాటికి పెద్దగా గుర్తింపు లేదు.
తమ తరఫున సుప్రీం కోర్టులో వాదిస్తున్న కపిల్ సిబ్బల్ ద్వారా ముస్లిము పర్శనల్ బోర్డు ''మేమే సంస్కరణలు చేపడుతున్నాం. మాక్కాస్త టైమివ్వండి. ఈ లోపున మీ సంస్కరణలు మాపై రుద్దకండి.'' అని చెప్పించారు. సిబ్బల్ దేనికిదేనికో ముడిపెట్టి చాలా విచిత్రమైన వాదనలు వినిపించాడు. ''జననం, మరణం, వివాహం వ్యక్తి మతానికి సంబంధించిన విషయాలు. రాజ్యాంగ పరిధిలోకి రావు.
అయోధ్యలో ఫలానా చోటే రాముడు పుట్టాడని మేం నమ్ముతున్నాం, దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదని హిందువులు అంటున్నట్లే, ముమ్మారు తలాక్ విషయంలో కూడా తమను ప్రశ్నించకూడదని ముస్లిములు భావిస్తున్నారు.'' అంటూ అసందర్భంగా మాట్లాడాడు. ''సతీ సహగమనం, బాల్యవివాహాలు వంటివి చట్టాల ద్వారానే మాన్పించారు, మిస్టర్ సిబ్బల్'' అని జస్టిస్ కురియన్ జోసెఫ్ గుర్తు చేసి నోరు మూయించారు.
''ముమ్మారు తలాక్ మంచి పద్ధతి కాదని మగవాళ్లకు మేం నచ్చచెప్పి మారుస్తాం. ముమ్మారు తలాక్‌కు ఒప్పుకోని మహిళ నికానామా (వివాహపత్రం)లో ఆ మేరకు షరతు చేర్పించాలి అని కాజీలకు చెప్తాం. అసలు ముమ్మారు తలాక్ పద్ధతిని ప్రోత్సహించవద్దని, దాన్ని ఉపయోగించము అని భర్తల నుంచి పెళ్లి సమయంలోనే హామీలు తీసుకోమనీ కాజీలకు సర్క్యులర్ జారీ చేస్తాం.'' అని ముస్లిము బోర్డు సిబ్బల్ ద్వారా కోర్టుకు చెప్పింది. 'ఇదంతా కంటితుడుపు వ్యవహారం. పెళ్లనేది కాజీలు చేయాలని రూలు ఏమీ లేదు, ఎవరైనా చేయవచ్చు.
పోనీ కాజీల వద్దనే చేసుకున్నారనుకున్నా, కాజీలకు చట్టపరంగా ఏ అధికారమూ లేదు. వారి మాట వరుడు ఖాతరు చేయవలసిన అవసరమూ లేదు. పైగా పర్శనల్ బోర్డు ఆదేశాలు మన్నించాల్సిన అగత్యం కాజీలకు లేదు. మహా అయితే దారుల్్ ఉలూమ్ నుంచి పట్టా పుచ్చుకున్న కాజీలు మాత్రమే పర్శనల్ బోర్డు మాట వినవచ్చు. ఇతర సంస్థల నుంచి పట్టా పుచ్చుకున్నవారు ఈ ఆదేశాలు ఖాతరు చేయకపోవచ్చు. ఖాతరు చేద్దామనుకున్నా నికానామాలో అలాటి షరతు కోసం పట్టుబడితే యిదేదో పేచీకోరు పిల్లలా వుంది అనుకుంటారని వధువు పట్టుబట్టకపోవచ్చు. అయినా కాబోయే వివాహాల గురించిన విషయం. ఇప్పటికే పెళ్లయినవాళ్ల సంగతేమిటో చెప్పమనండి.'' అని అడుగుతున్నారు మహిళా సంఘాల తరఫున వాదిస్తున్న లాయర్లు. పురుషాహంకార పక్షపాతిగా తనను తాను చూపించుకుంటున్న ముస్లిం పర్శనల్ బోర్డు వద్ద దీనికి సమాధానం లేదు.
(ఫోటో – షయారా బానో, షా బానో)
ఎమ్బీయస్: ముమ్మారు తలాకుల పద్ధతి ముగుస్తుందా? -1/2
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]