బిజెపి నాయకుల అహంకారానికి ఢిల్లీ ఓటరు చెంపపెట్టు పెట్టాడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇది చెంపదెబ్బ కాదు. ఏకంగా పొట్టలో గుద్దినట్లే. బుద్ధి చెప్పేవాళ్లయితే వీపుమీద దెబ్బ వేస్తారు. ఢిల్లీ వాళ్లు సెంటర్ చూసి కొట్టినట్లు కొట్టారు. బిజెపికి మూడా? సింగిల్ డిజిట్ అంటేనే అవమానం. కేంద్రంలో సొంతబలంతో ప్రభుత్వం ఏర్పరచి 8 నెలలు కాలేదు. అప్పుడే యింతటి ఎదురుదెబ్బా? సర్వేలు చాలా రకాలుగా చెప్పాయి, మొదట్లో ఆప్ అన్నాయి, తర్వాత బిజెపి అన్నాయి, ఆ తర్వాత సగంసగం అన్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లో అందరూ ఆప్‌కే గెలుపు అన్నారు. సాధారణంగా కరక్టుగా గెస్ చేసే టుడేస్ చాణక్య కూడా ఆప్‌కు 40 ప్లస్ యిచ్చింది. యోగేంద్ర యాదవ్ 50 దాకా వస్తాయంటే నవ్వుకున్నాను. బిజెపికి వున్న కోర్ ఓట్‌ను ఎలా విస్మరిస్తున్నారు వీళ్లు అని. తీరా చూస్తే ఆప్‌కు 67, ఏ అంచనాలకూ అందనట్లుగా! ఇలాటి గెలుపు యిప్పటిదాకా ఎవరూ కనీవినీ ఎరిగి వుండరు. 95% సీట్లు ఒక్క పార్టీకా? మై గాడ్. అంత గొప్ప పార్టీయా అది? కాంగ్రెసు తన ఓటు పూర్తిగా ఆప్‌కు బదలాయించేసిందేమో అనుకుంటే దానికీ 10% వచ్చాయి. బియస్పీ యిత్యాది ఇతరుల ఓట్లు మాత్రం ఆప్‌కి వచ్చి చేరాయి. అది కచ్చితం.
బిజెపి ఓట్లన్నీ ఎటు పోయాయి అంటే ఎటూ పోలేదు. 2013 కంటె 1% మాత్రమే తక్కువ వచ్చాయి. కానీ సీట్లుచూడబోతే గతంలో 32 వస్తే చిన్న అంకె ఎగిరిపోయి 3 మిగిలింది. ఎందుకీ తేడా అంటే గతంలో త్రిముఖ పోటీ, యిప్పుడు ముఖాముఖీ పోటీ. పార్లమెంటు ఎన్నికలలో 60 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించిన బిజెపికి యింతటి పరాభవమా!? ఆప్‌కు గతంలో 30% ఓట్లు వస్తే యీసారి 55% వచ్చాయి. 40% కంటె ఎక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల మ్యాప్ చూస్తే ఢిల్లీలోని దాదాపు అన్ని ప్రాంతాలలోను ఆప్ బలపడిందని అర్థమౌతుంది. అన్ని వర్గాలలో, అన్ని ప్రాంతాలలో అది చొచ్చుకుపోయింది. కాంగ్రెసు నుండి 15% ఓట్లుతో పాటు బిజెపికి పార్లమెంటు ఎన్నికలలో అదనంగా వచ్చిన ఓట్లను కూడా అది పట్టుకుపోయింది. విజేతల విన్నింగ్ మార్జిన్స్‌ను పరికించి చూసినపుడు మనకు యింకా కాస్త స్పష్టత వస్తుంది. ఈలోగా మనం వ్యాఖ్యానించుకోదగిన విషయాలేమిటంటే –
ఇంత ఘనవిజయం ఆప్‌కు కూడా మంచిది కాదు. గతంలో దీనిలో సగం కంటె తక్కువ సీట్లు వచ్చినపుడే కాబినెట్ నిర్మాణంలో తబ్బిబ్బు పడ్డారు. మంత్రి పదవి రానివారు అలిగారు. దక్కినవారు తాము ఏ నియమాలూ పాటించ నక్కరలేదన్నట్లు ప్రవర్తించారు. ఇప్పుడు యీ ఘనవిజయం మా వల్లనే అంటే మా వల్లనే అంటూ అన్ని వర్గాలవారూ వచ్చి తమతమ డిమాండ్లు ముందు పెడితే పాలకులు ఏం చేస్తారో తెలియదు. ప్రజల ఆశలు లిటరల్‌గా మిన్ను ముట్టాయి. వాటిని అందుకోవడం ఎవరి తరం కాదు. అరవింద్ దగ్గర సంజాయిషీలు లేవు. పాంచ్‌సాల్ అడిగితే ఎదురు లేకుండా, ప్రతిపక్ష నాయకుడు కూడా లేకుండా పాలించు అని అధికారాన్ని అప్పగించారు. నిధులు యివ్వకుండా మోదీ బిగబెడితే ధర్నా చేస్తాను అంటే జనాలు పట్టుకుని తంతారు. ఇంత ప్రజాభిమానం తట్టుకోవడం మానవమాత్రులకు సాధ్యం కాదు. అరవింద్ ఎలా నెగ్గుకు వస్తాడో వేచి చూడాలి. ఇక బిజెపికి యింత ఘోరపరాజయం అక్కరలేదు. మోదీ, అమిత్ షా అహంకారం తగ్గాలంటే ఢిల్లీలో ఓడాలని చాలామంది కోరుకున్నారు. కానీ మరీ యింతలా ఓడితే ఎలా? బిజెపి కార్యకర్తలు, నాయకులు పూర్తిగా డీమోరలైజ్ అయిపోతారు. కిరణ్ బేదీ యిప్పటికే ముఖం వేలాడేసింది. తనే నెగ్గలేకపోవడం దుర్భరమైన అవమానం. ఆవిడ రాజకీయాల్లోంచి తొలగిపోయి, ఢిల్లీ విడిచి భర్త దగ్గరకి పంజాబ్ వెళ్లిపోతుందేమో!
బిజెపికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో, మోదీ జగన్నాథరథానికి బ్రేకులు వేద్దామని ఉద్దేశంతో దేశంలోని రాజకీయపక్షాలన్నీ ఏకమై ఢిల్లీలో తమ ఓటర్లను ఆప్‌కు వేయమని చెప్తారని అనుకుంటూనే వున్నాం. కానీ బిజెపి కోర్ ఓటర్లు తప్ప మామూలు ఓటర్లు కూడా బుద్ధి చెప్పడానికి నిశ్చయించుకున్నట్లు అర్థమైంది. ఎందుకు బుద్ధి చెప్పాలి? 8 నెలల్లోనే మోదీ చేసిన పాపం అంత పేరుకుపోయిందా? మరి యిప్పటిదాకా వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గుతూనే వచ్చారే! కశ్మీర్‌లో తొలిసారి రెండవ పెద్దపార్టీగా అవతరించారే! వాళ్లెవరికీ లేని కసి ఢిల్లీ ప్రజలకు మాత్రమే వుందా? ఇవన్నీ లోతుగా ఆలోచించవలసిన విషయాలే. గణాంకాలు, విశ్లేషణలు యింకా వస్తున్నకొద్దీ చిత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు కనబడినదాన్ని బట్టి యిది మోదీ-అమిత్ ద్వయానికి జరిగినది శృంగభంగమే. వారు చేసిన పొరపాట్లు కొన్ని కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆప్‌కు యింత ఆదరణ వుందని కొంచెమైనా పసిగట్టలేకపోయారా అన్నదే ఆశ్చర్యం కలిగిస్తోంది. రామ్‌లీలా మైదానం నాలుగోవంతు నిండినప్పుడే అర్థం కావలసింది. ఇదేదో తక్కిన అసెంబ్లీలా కాదురా బాబూ అని. అప్పుడు మోదీ పక్కకు తప్పుకుని వుండాల్సింది. ఓడిపోయినా, 'మేం పట్టించుకోలేదు, ఆఫ్టరాల్ ఢిల్లీ అంటే కార్పోరేషన్ కంటె ఎక్కువ, రాష్ట్రం కంటె తక్కువ' అని చెప్పుకోవలసింది. తను స్వయంగా ప్రచారం చేయడమే కాక 120 మంది ఎంపీలను, మంత్రులను వాడవాడలా తిప్పి యింత హంగు చేసి భంగపడడమేల? అరవింద్‌పై నోరు పారేసుకుని అతనికి సింపతీ తెచ్చిపెట్టడమేల? అధికారంలో వున్నవాళ్లపై ప్రశ్నలు సంధిస్తారు, లేఖలు రాస్తారు. ఇక్కడ మోదీ అరవింద్‌కి ప్రశ్నలేశారు. గత ఎన్నికలన్నీ మోదీ వెర్సస్ అదర్స్‌గా నడిస్తే, ఢిల్లీ ఎన్నికలు అరవింద్ వెర్సస్ అదర్స్‌గా నడిచాయి. ఆప్ వాళ్లు వ్యక్తిగతంగా ఎవర్నీ ఏమీ అనలేదు. వీళ్లు చూడబోతే తెల్లారి లేస్తే అరవింద్‌ను భగోడా అనీ, ఉపద్రవగోత్రీ అనీ, పర్శనల్ ఎటాక్స్ చేశారు.
అమిత్ షా బయటినుంచి మనుష్యులను తెస్తే తెచ్చాడు కానీ దానికి ప్రచారం రాకుండా చూసుకోవాల్సింది. దానితో స్థానిక కార్యకర్తలకు మండినట్లుంది. బయటివాళ్లనే చేసుకోనీ, మనకెందుకు? అనుకున్నారు లాగుంది. ఫలితాలు వచ్చాక కొందరు కార్యకర్తలు చెప్తున్నారు – మాకు ఎవరూ ఏ పనీ చెప్పలేదు అని. మోదీ, అమిత్ యిద్దరూ ఢిల్లీవాళ్లు కాదు. పంజాబీ, హరియాణీ, యుపి కాకపోతే ఢిల్లీ వాళ్లకు పరాయివాళ్ల కిందే లెక్క. దానికి తోడు వాళ్లు బయటివాళ్లను తెచ్చి వాళ్ల ద్వారానే ఖర్చులు పెట్టిస్తే యిక ఢిల్లీ బిజెపి కార్యకర్తలు ఉసూరుమనరా? కిరణ్ బేదీని వాళ్లల్లో ఉత్సాహం నింపిదనుకోవడానికి ఏమీ లేదు. ఆవిడా వాళ్లకు పరాయిదే. ఇప్పుడు ఓటమి కిరణ్ నెత్తిన రుద్దేస్తున్నారు. అలా రుద్దుతారని తెలిసే ఆవిడ నేనే బాధ్యత వహిస్తున్నాను అంది. కిరణ్‌ను సిఎం అభ్యర్థిగా ప్రకటించడం ఘోరతప్పిదం అని బిజెపి నాయకులందరూ అనుకుంటున్నా పైకి అనలేని పరిస్థితి. ఇంత ముఖ్యమైన నిర్ణయం పార్టీ అంతర్గత సమావేశం ఏర్పరచి, అందరితో చర్చించి తీసుకున్నది కాదు. ముగ్గురు నలుగురు కూర్చుని అప్పటికప్పుడు తీసుకున్నది. మేం చేసినా చెల్లుతుంది అనే నియంతృత్వ ధోరణే కనబడింది. అందుకోసమే ఢిల్లీ ఓటరే కాదు, బిజెపి కార్యకర్తా బుద్ధి చెప్పాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)