''చిట్టి తమ్ముడు'' అనే 1962 నాటి సినిమాకి మూలం ''ఆలివర్ ట్విస్టు'' అనే 1948 నాటి యింగ్లీషు సినిమా. దానికి మూలం – 1837లో చార్లెస్ డికెన్స్ అదే పేరుతో రాసిన నవల! ఒక మంచి వంశానికి చెందిన బాలుడు విధివైపరీత్యం వలన అనాథాశ్రమంలో పెరిగి, అష్టకష్టాలు పడి చివరకు అయినవారిని చేరుకోవడం కథాంశం. ఆనాటి లండన్‌లో వుండే అండర్ వరల్డ్, దానికి దన్నుగా నిలబడే సంపన్నులు – అందరూ వస్తారు యీ నవలలో. నవలను ఇంగ్లీషు సినిమాగా తీసినపుడు మార్పులు చేశారు. మనవాళ్లు తెలుగులో తీసినప్పుడు మరిన్ని మార్పులు చేశారు. ఆ మార్పులేమిటో, వాటి కథేమిటో చూద్దాం.
యాగ్నెస్ ఒక నేవల్ ఆఫీసర్ కూతురు. లీఫోర్డ్ అనే డబ్బున్నతని ప్రేమించింది. అతను అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్నాడు. మొదటిభార్య వలన మాంక్స్ అనే ఒక కొడుకు కూడా వున్నాడు. లీఫోర్డ్ ఆస్తి వ్యవహారాల్లో రోమ్‌కి వెళ్లి అక్కడ మరణించాడు. ఈమె అప్పటికే గర్భవతి. అతన్ని వెతుకుతూ బయలుదేరి ఇంగ్లండులోని ఒక వూరిలో ఓ వర్క్‌హౌస్ దగ్గరకు చేరింది. అక్కడే ఓ బిడ్డను ప్రసవించి మరణించింది. ఆమె చనిపోతూ తన బిడ్డెవరో తెలుసుకోవడానికి గుర్తుగా లాకెట్ ఒకటి నర్సు చేతిలో పెట్టి పోయింది. దానిలో ఆమె ఫోటో, భర్త ఫోటో వున్నాయి. అయితే ఆ నర్సు దురాశతో ఆ లాకెట్ దాచేసుకుంది. డాక్టర్‌తో వివరాలు ఏమీ చెప్పలేదు. దాంతో ఆ పిల్లవాడు అనాథగా ముద్రపడ్డాడు. 9 ఏళ్లు వచ్చేదాకా జువినైల్ హోమ్‌లో పెరిగి ఆ తర్వాత వర్క్‌హౌస్‌కి వచ్చాడు. వర్క్‌హౌస్ అంటే పిల్లల చేత పనిచేయించి దానికి గాను తిండీ, బట్టా సమకూర్చడం. అన్ని ప్రభుత్వ పథకాలలాగానే వీటిలోనూ అవినీతి, నిర్లక్ష్యం ఆవరించి, అక్కడ పిల్లలు నానా అగచాట్లూ పడుతున్నారు. తిండి లేక మాడి మాడి… ఒకసారి ధైర్యం చేసి యీ పిల్లవాడు తిండి కాస్త ఎక్కువ పెట్టమని అడిగాడు. ఇలాటి పొగరుబోతు యిక్కడుంటే ప్రమాదం అనుకుని నిర్వాహకుడు యితన్ని ఒక అండర్‌టేకర్ వద్దకు పనివాడిగా పంపించేశారు.
మన తెలుగు సినిమా రంగంలోని దర్శకనిర్మాతలలో కె బి తిలక్‌గారికి ఓ ప్రత్యేకస్థానం వుంది. ''ముద్దుబిడ్డ'' అనే సెంటిమెంటల్ సినిమా ఆయన మొదటి సినిమా. ''ఎంఎల్‌ఏ'' వంటి రాజకీయ ప్రబోధాత్మక సినిమా రెండో సినిమా. సామాజిక చైతన్యం కోసం కలవరించే ఆయన్ని ఈ ఆలివర్ ట్విస్ట్ కథ ఆకర్షించింది. మన రాష్ట్రంలోనే వున్న స్టువర్ట్‌పురం సెటిల్‌మెంట్ నేపథ్యాన్ని దానికి జోడించి ''చిట్టి తమ్ముడు'' సినిమా తీశారు. ఈ సినిమా కథకు క్రెడిట్ కొండేపూడి లక్ష్మీనారాయణ అనే ఆయనకు యిచ్చారు. నిజానికి నవలలో కాని, ఇంగ్లీషు సినిమాలో కానీ యాగ్నెస్ విషయం, పిల్లవాడి మూలాల సంగతి ఆ దశలో తెలియదు. చాలా కథ నడిచిన తర్వాత ఒక్కొక్కటీ బయటకు వస్తుంది. కానీ తెలుగులో అలాటి సస్పెన్సు పెట్టకుండా క్రమపద్ధతిలో చెప్పుకుంటూ పోయారు.
జగ్గయ్య ఓ డబ్బున్నవాడు. దేవికను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి కశ్మీర్ వెళ్లి అక్కడ జబ్బు పడడం వలన సకాలంలో రాలేకపోయాడు. ఇతను మోసం చేశాడనుకుని ఆమె యిల్లు విడిచి వెళ్లిపోయింది. అతనికి ఓ అక్కయ్య సంధ్యా, బావగారు రమణారెడ్డ్డీ వున్నారు. అతని ప్రేమను ఆమోదించారు. అతను భార్యకోసం వెతికి, తిరిగి వచ్చి ఆమె దొరకలేదని చెపితే నిరాశపడ్డారు. ఈలోగా దేవిక హాస్పటల్లో మరణించింది. మరణిస్తూ తన లాకెట్‌ను నర్సు కిచ్చి చనిపోయింది. జగ్గయ్యకు ఓ తమ్ముడు వున్నాడు. కాంతారావ్. అతనికి వ్యసనాలు హెచ్చు. చెడ్డవాడు. జగ్గయ్య చనిపోతూ విల్లు రాశాడు. తన కొడుకుని వెతికి పట్టుకుని అతనికి ఆస్తి అందించే భారం బావగారికి అప్పజెప్పాడు. ఆ ఆస్తికూడా కాజేయాలని బుద్ధి పుట్టింది కాంతారావుకి. పుట్టాడో లేదో తెలియని ఆ బిడ్డకోసం బావగారు చాదస్తంగా వెతకడమేమిటని అతనికి విసుగు. ఇంగ్లీషులో విలన్ ఆ పిల్లవాడి సవతి అన్నగారైతే, తెలుగులో విలన్ చిన్నాన్న.
అనాథగా పెరిగిన కుర్రవాడికి ఏడేళ్లు వచ్చాయి. పేరు చిరంజీవి. అనాథాశ్రమంలో పెరుగుతున్నాడు. అక్కడ సూర్యకాంతం యిన్‌ఛార్జి అంటే యింక ఎలా వుంటుందో వూహించుకోవచ్చు. ఆమెకు తోడు చదలవాడ! తిండికోసం మలమలమాడే పిల్లలు మరికాస్త తిండి కావాలని అడగాలనుకున్నారు. అక్కడ ఓ పాట పెట్టారు తిలక్. 'అడగాలి, అందరు సమానమంటూనే ఈ తేడాలెందుకు? అని అడగాలి' అంటూ చైతన్యాన్ని ప్రబోధిస్తూ పాట రాయించారు. అడిగితే ఏమవుతుందో తెలుసుగా? తీసుకెళ్లి ఓ కమ్మరి కొట్టులో పడేశారు. అక్కడ పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ అబ్బాయి పట్నానికి పారిపోయాడు.
ఒరిజినల్ సినిమాలో ఆలివర్‌ను అండర్ టేకర్ వద్ద పనికి కుదురుస్తారు. అతని ముఖవర్చస్సు చూసి యజమాని అతనికి ప్రాధాన్యత యిస్తాడు. దాంతో సాటి పనివాడు నోవాకి అసూయ పుట్టి యితని తల్లిగురించి చెడ్డగా మాట్లాడి రెచ్చగొడతాడు. ఇతను తిరగబడి అతన్ని తన్ని, తను దెబ్బలు తింటాడు. ఓ రాత్రివేళ పారిపోయి లండన్ చేరతాడు. నవలలో ఉత్తరోత్రా ఈ నోవాకు చాలా పాత్ర వుంది. అతనూ, అతని ప్రేయసీ లండన్ చేరడం, దొంగల ముఠానాయకుడితో చేతులు కలపడం, తర్వాత అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం – యిదంతా వుంది. కానీ సినిమాలో అదంతా తీసిపారేశారు దర్శకుడు డేవిడ్ లీన్. డేవిడ్ లీన్ విశ్వవిఖ్యాతుడైన డైరక్టర్. అతను తీసిన సినిమాల్లో చెప్పుకోదగ్గవి- బ్రీఫ్ ఎన్‌కౌంటర్, గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్, ఆలివర్ ట్విస్ట్, సమ్మర్‌టైమ్, బ్రిజ్ ఆన్ ది రివర్ క్వాయ్, లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ జివాగో, ఎ పాసేజ్ టు ఇండియా..యిలా చాలా వున్నాయి. అనేక ఆస్కార్లు వచ్చాయి. ఈ సినిమాలో సీన్ల కంపోజిషన్ చూస్తే ఆయన ఎంత పెర్‌ఫక్షనిస్టో మీకే తెలుస్తుంది. ఆయన అభిమాన నటుడు అలెక్ గిన్నెస్ ఈ సినిమాలో ఫాగిన్ పాత్రపోషణ ద్వారా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ ఫాగిన్ లండన్‌లో చిల్లర దొంగల నాయకుడు. కుర్రాళ్లను పోగేసి, వాళ్లను జేబుదొంగలుగా మార్చడం అతని పని. చూడగానే రోత పుట్టే యీ ముసలి పాత్రను గద్ద ముక్కు పెట్టుకుని అలెక్ గిన్నెస్ అద్భుతంగా పోషించాడు. అప్పటికి అతని వయసు 34 ఏళ్లు.
ఆలివర్ లండన్‌లో దిగగానే ఓ కుర్రాడు యితని వాలకం చూసి తిండి పెట్టిస్తాను రా అని ఫాగిన్ వద్దకు తీసుకుని వచ్చాడు. ఇతను తిండి పెడతాడు కానీ దానికి ప్రతిగా దొంగతనాలు చేయిస్తాడు. ఈ ముఠాలో అందరూ చిన్నవాళ్లే కానీ యితని ముఖ్య అనుచరుడు బిల్ మాత్రం పెద్దవాడు. అతను పెద్ద దొంగతనాలు చేస్తాడు. అతని ప్రేయసి నాన్సీ. ఆమె ఒక వేశ్య. బిల్ అంటే పడిఛస్తుంది. ఆమె ఈ ఆలివర్‌ను చూడగానే ముచ్చటపడింది. తన తమ్ముడిలా చూసుకుంటానంది. తెలుగులో ఫాగిన్ పాత్రను తాత అన్నారు. అది కెవియస్ శర్మ వేశారు. బిల్ పాత్ర రాజనాల. నాన్సీ పాత్ర రాజసులోచన. ఆమెను వేశ్య చేయకుండా రాజనాలకు భార్యగా చేశారు. బజార్లో పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ దొంగలముఠాకు సహాయపడుతూ వుంటుంది.
ఫాగిన్ తన కుర్రాళ్లతో బాటు ఆలివర్‌ను దొంగతనానికి పంపించాడు. వాళ్ల్లు దొంగతనం చేసి పారిపోయారు కానీ యితను దొరికిపోయాడు. చావుదెబ్బలు తిన్నాడు. కోర్టుకి లాక్కుని వచ్చారు. జడ్జిగారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కుప్పకూలాడు. అసలు దొంగ యితను కాదని షాపువాడు సాక్ష్యం చెప్పడంతో యితనిమీద ధనికుడైన ఓ లాయరుకి జాలి కలిగింది. ఇతన్ని తన యింటికి తీసుకెళ్లాడు. ఆ లాయర్ పేరు బ్రౌన్‌లో. ఈ బ్రౌన్‌లో నవల ప్రకారం ఆలివర్ తండ్రికి ఫ్రెండ్. కానీ సినిమాలో అతన్ని ఆలివర్ తాతగా, అంటే తల్లికి తండ్రిగా చేశారు. ఆలివర్ మొహంలో కూతురి పోలికలు చూసి ముచ్చటపడి, యితనికి మంచిజీవితం కలిగిద్దామని ప్రయత్నించాడు. అయితే అతని స్నేహితుడు 'ఈ కుర్రాడు వట్టి దొంగ, పారిపోతాడు చూడు' అని ఛాలెంజ్ చేశాడు. పరీక్ష పెడదామని కాస్త డబ్బిచ్చి బయటకు పంపించారు. అప్పుడు నాన్సీ, బిల్ బజార్లో తారసపడి అతన్ని ఎత్తుకుపోయారు. లాయరు నిరాశపడ్డాడు.
తెలుగులో లాయరు, కుర్రాడు తారసపడ్డ ఘట్టాన్ని కాస్త మార్చారు. కోర్టు సీను తీసేశారు. కుర్రాళ్లు దొంగిలించినది లాయరు వద్దనే! ఆ లాయరు రమణారెడ్డి… అంటే పిల్లాడి మేనత్త భర్త అన్నమాట. అతనితోనే యీ కుర్రాడు తాను దొంగను కానని మొత్తుకున్నాడు. రమణారెడ్డి కుర్రాణ్ని యింటికి తీసుకుని వచ్చాడు. సంధ్య కూడా అతన్ని ఆదరించింది. తండ్రి జగ్గయ్యలాగానే ఈ అబ్బాయికి కూడా చిత్రకళ అంటే యిష్టం. తల్లి చిత్రం చూసి బొమ్మ వేస్తూండగా అతని మేనత్త పోలికలు పట్టింది. మీరు వెతికే కుర్రవాడు వీడే అంది భర్తతో! భార్య మాట నమ్మాడు రమణారెడ్డి. కుర్రవాడి పుట్టుపూర్వోత్తరాలు కనిపెడదామని ఆ అనాథ శరణాలయానికి ప్రయాణం కట్టాడు. అయితే ఆ విషయం తన బావమరిది కాంతారావుకి చెప్పాడు. కాంతారావు, పిల్లవాడు ఒకరికొకరు తారసపడ్డారు. (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)