Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : పానుగంటి వారి ''సాక్షి'' - 1

పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు నా అభిమాన రచయిత. ఆయన మంచి కవి. నాటక రచయిత. హాస్య రచయిత. మన సమాజాన్ని ప్రేమిస్తూనే దానిలోని లోపాలను వ్యంగ్యంగా ఎత్తి చూపుతూ ''సాక్షి'' వ్యాసాలు రాశారు. ఈ ఫిబ్రవరి 11 ఆయన 150 వ జయంతి. ఆయన ''సాక్షి'' వ్యాసాలు పుస్తకరూపంలో వచ్చిన చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత సంపుటాలుగా వెలువడ్డాయి. ''హాసం'' నడిపే రోజుల్లో ''క్లాసిక్స్‌ రీటోల్డ్‌'' పేర ఆ వ్యాసాల్లో కొన్నిటిని పాఠకులకు పరిచయం చేశాను. వాటిలో కొన్నిటిని మీకు రుచి చూపిస్తాను. నచ్చిందంటే యింకా కొన్ని చూపిస్తాను. చివర్లో ఆయన జీవిత విశేషాలను యిస్తాను. ''క్లాసిక్స్‌ రీటోల్డ్‌'' కాన్సెప్ట్‌ను వివరించిన తీరు యిది - 

నాటక  ప్రదర్శనం

సాక్షి సంఘ సభ్యులలో ఒకడైన జంఘాల శాస్త్రి క్రితం రాత్రి ''సారంగధర'' నాటకం చూసి వచ్చి తన అనుభవాలు చెప్తున్నాడు - ''నిన్న రాత్రి తొమ్మిది గంటలకే  నాటకం వేసే హాలు  వద్దకి వెళ్లాను. అక్కడ ఇంకా  ఏదీ రెడీ కాలేదు.  పాడయిపోయిన నాటక సామగ్రిని రిపేరు చేస్తూ సిబ్బంది కనబడితే, మేకప్‌  సామాను కోసం తడుముకుంటున్న వేషధారులు కనబడ్డారు. కొంతమందికి  డ్రస్‌ రాలేదు,  మరి కొంత మందికి తెచ్చిన పెట్టుడు గడ్డాలు  నచ్చలేదు. పూసల కోటు ఎవరు వేసుకోవాలన్న విషయంపై ఇద్దరు నటులు తిట్టుకుంటున్నారు.  కృత్రిమస్తనాలు  పెట్టుకుని చుట్ట కాలుస్తున్న నటుడొకడు నేను గ్రీన్‌రూమ్‌లో చొరబడం చూసి పక్కకు పారిపోయి ''టిక్కెట్లు అమ్మకం అప్పుడే ఆరంభించిన గాడిద ఎవడ్రా'' అని అరిచేడు.

ప్రేక్షకులు  చూడబోతే - ఆ రోజు సంత కాబట్టి రైతులు చాలామంది వచ్చారు. స్కూలు పిల్లలు కూడా వచ్చి వాళ్ల టీచర్ల  గురించి  కామెంట్స్‌ చేసుకుంటున్నారు. ఆడవాళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలం డోరు దగ్గర నేను కూచుంటానరటే నేను కూచుంటానని ఇద్దరు యాక్టర్లు  కొట్టుకోవడం,  చివరికి మూడోవాణ్ని కూచోబెట్టడం జరిగింది. కానీ ప్రతీ నిమిషానికీ  ఎవడో ఒక యాక్టరు రావడం ఆడవాళ్లను- 'మీ కేమీ ఇబ్బందిలేదు కదా!' అంటూ పరామర్శించడం, అమిత ఉత్సాహి అయిన ఓ నటుడు ఒక సానిపాప కోసం విసిరిన సెంటు బాటిలు ఖర్మ కాలి  అది ఓ పోలీసు ఆఫీసరు కూతురు నెత్తిమీద పడడం, దాంతో గోల  జరిగి ఆ ఆఫీసరు నాటకాల వాళ్లకు వార్నింగ్‌ ఇవ్వడం జరిగింది.

ఈ గోల ఇలా ఉండగా తెర వెనకాల తలకాయ పగిలినట్టు శబ్ధం, మొర్రోమని  కేక వినబడ్డాయి. మరేం లేదు, నాటక సమాజం వాళ్లు కొబ్బరికాయ పగలకొట్టి  ప్రార్థనలు మొదలెట్టారు. ప్రార్థన అయిన తర్వాత తెర పైకి లేవబోయింది కానీ కప్పీ(పుల్లీ)లు సరిగా లేక మధ్యలో ఆగిపోయింది. దాంతో ఆ యాక్టర్లే జబ్బపుష్టి కొద్దీ పైకి లేవనెత్తారు.

రెండవ రంగంలో రాజరాజనరేంద్రుడికి, చిత్రాంగికి వివాహం జరిగాక మూడవ రంగంలో వారి శోభనం. రాజుగారు పాటలు పాడడం, విరహంతో రాగయుక్తంగా ఏడవడం అతి దుర్భరంగా ఉంది.

రెండవ అంకంలో సారంగధరుడు, మంత్రి కొడుకు, ఇంకా కొంతమంది  పిల్లలు వచ్చి ఫుట్‌బాల్‌ ఆడారు. ప్రమాదవశాత్తూ  ఆ బంతి ఎగిరి పైన వేలాడుతున్న దీపాన్ని పగలకొట్టింది. తర్వాతి మంత్రి కొడుకు చేతిలోంచి గోటిబిళ్ల ఎగిరి సభలో ఉన్న ఒక పిల్లవాడి కణతకు తగలడంతో వాడు సృహ తప్పి పడిపోయాడు. ఆ పిల్లవాడి తండ్రి, నాటకపద్ధతికి విరుద్ధంగా రాగయుక్తమైన పాటలతో కాకుండా, వట్టిమాటలతోనే ఏడుస్తూ పిల్లవాణ్ని ఇంటికి తీసుకుపోయాడు. అంతలో  కోతికొమ్మచ్చు లాడుతున్న సారంగధరుడు  చెట్టు మీద నుండి  కింద పడ్డాడు. దాంతో తెర కూడా పడింది.

రెండవ రంగంలో సారంగధరుడు, మంత్రికొడుకు పావురాలు ఎగరవేస్తూ ప్రవేశించారు మళ్లీ  పాడుతూ, నాటకంలో కథ ప్రకారం ఆ పావురం చిత్రాంగి మేడ పిట్టగోడపై వాలాలి. కానీ పావురానికి కథ తెలియదేమో,  ప్రేక్షకులలో ఉన్న  మేజిస్ట్రేటు గారి నెత్తిమీద వాలి రెట్ట వేసింది.  కానీ సారంగధరుడు అది చిత్రాంగి మేడలో వాలినట్టే ఊహించుకుని మంత్రి కొడుకు వద్దంటున్నా మేడలోకి వెళ్లాడు. 

మూడవ రంగంలో సారంగధరుడు  చిత్రాంగి మేడలో ప్రవేశం. చిత్రాంగి అతన్ని చూడగానే ఫిడేలు వాడికి సైగ చేసి 'ఒకసారి  కౌగిట నొత్తిన నేలరా' అనే పాట లంకించుంది. దానికి  సారంగధరుడు  నడుము  బిగించుకుని, 'చెలియ నీదు పలుకులు...మగువ  నీదు మాటలు'  (పిన్నీ  అని మాత్రం అనలేదు) అని పాడి, పాడి ఒగరుస్తూ  కూర్చున్నాడు. చిత్రాంగి  అతని మీద  పడింది.  అతను 'రమణీ రాకు రాకు' అంటూ గిరగిరా స్టేజంతా తిరగడం, 'రారా పోకుపోకు' అంటూ చిత్రాంగి - పందిని బట్టే ఎరుకులదానిలా - వెంట తిరగడం జరిగింది. ఈ విధంగా  కొంత  సేపు తాళం తప్పకుండా గంతులు వేసాక సారంగధరుడు పారిపోవడం, చిత్రాంగి భూపాలరాగంతో భూపాల పుత్రుణ్ని  (రాకుమారుడు) తిడుతూ ఉంటే తెర దిగింది.

మూడవ అంకం రాజరాజ నరేంద్రుడు చిత్రాంగికి సర్దిచెప్పే రంగంతో  ప్రారంభమయ్యింది.  భార్య నేలమీద పడుకుని ఉండగా రాజు 'చిత్రాంగీ, మనోహరాంగీ, మదసారంగీ, ఫిరంగీ' అంటూ అంత్య ప్రాసలతో వేడుకోనడం చూసి నేను నివ్వెరపోయాను.  'మన భార్యలకు కోపం  వచ్చిప్పుడు  మనం ఇలాగే  సంబోధిస్తున్నామా?'  అని. ఈలోగా  రాజు పాట మొదలుపెట్టాడు.  మాటలకు లొంగని చిత్రాంగి పాటలకు లొంగి గొంతు కలిపింది - మాటకు మాట  చెబుతూ, వాహకులు తక్కువైన శవాన్ని ఇద్దరు సాయం పట్టి శ్మశానికి  చేరవేసినట్టు వీళిద్దరూ కలిసి ఆ పాటను నానా స్వరసాంకర్యంతో ఓ దరికి చేర్చారు. ఆ పాట ద్వారా  చిత్రాంగి తన గోడు చెప్పుకుంది - సారంగధరుడు  తనను చెరచాడని.

 ఇక రెండ అంకం కోర్టు సీను. సర్కారు వకీలు నాదానమ క్రియతో నేరం గురించి ఉపన్యసించాడు. ముద్దాయి తన నిర్దోషిత్వాన్ని భైరవి రాగంలో, హార్మోనియం, చిప్పతాళం సహాయంతో తెలియచెప్పాడు. సాకక్షులందరు, ముద్దాయి వైపు న్యాయవాది కూడా - రకరకాల  పాటలతో తన వాదనను వినిపించాడు.  పాతరోజులు  పోయాయి. న్యాయస్థానమంతా సంగీతమయమే! అందరూ గాయకులే !  బిళ్ల బంట్రోతు కనీసం పిళ్లారి రాగమైనా పాడగలగాలి. న్యాయాధిపతి సారంగధరుడికి కాళ్లు చేతులు ఖండించాలని నాటకురంజిరాగంతో  తీర్పు చెప్పాడు. ఆపై శంకరాభరణంతో సంకరపరచి సభ చాలించాడు.

 తరువాతి అంకంలో కారాగారంలో ఉన్న సారంగధరుడిని చూడడానికి తల్లి వచ్చింది. కౌగిలించుకుని ఏడుస్తుందనుకున్నాను కానీ ఏడవ లేదు. పాడింది - 'నాయానా, నాయానా.. 'అంటూ! దానికి తోడు తెరచాటు నుండి 'తథిగిణతో తకతధి గణితోం' అంటూ ముక్తాయింపు ఒకటి. ప్రజలంతా  హుషారెక్కిపోయి ఒళ్లు మర్చిపోయారు. సారంగధరుడి కష్టాలు చూసి వారు దుఃఖించలేదని మనం ఫిర్యాదు చేయరాదు.  కన్నతల్లే బాధ కనబరచలేదు. తన పాటకు వచ్చిన రెస్పాన్సు చూసి ఆ పాత్రధారి మొగం కళకళలాడిపోయింది. తన సవతి పన్నిన కుట్రకు బలికాబోతున్న కొడుకు అవస్థ చూసి ఆమె రియాక్టయిన తీరది!

 నాలుగో అంకంలో  మొదటి రంగంలో సారంగధరుణ్ని మంచం మీద పడుకోబెట్టి  తలారులు కాళ్లు,  చేతులు నరుకుతున్నారు. ఆ సమయంలో కూడా ఆ కుర్రవాడు పాట లంకించుకోవడమే కాదు, తాళం  ఎక్కడ చెడిపోతుందో నన్న భయంతో కాలి మడమతో మంచం పట్టె మీద తాటిస్తూనే ఉన్నాడు. ఆఖరి అంకంలో దేవుడు ప్రవేశించి సారంగధరుణ్ని బతికించి తల్లిదండ్రులతో కలపడంతో నాటక  ప్రదర్శనం ముగిసిపోయింది.  పొలోమని  జనాలు  లేచిపోయారు. 

ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఎంతటి  దుర్భర దృశ్యాన్నైనా చూడవచ్చు కానీ ఔచిత్యం తెలియని  కవి తన కలంమొనతో  ప్రకృతికాంత  (నేచురాలిటీ)ని చీల్చి చెండాడుతూంటే చూసి భరించడం కష్టం. నిత్యజీవితంలో  మనం సంగీతం ఉపయోగిస్తున్నామా? భార్యతో 'బీఱకాయ వేఁ  గూరఁ జేయవే - సరిగమగరి ||బీఱ|| రవపులుసు, వేసి ||బీఱ' అని పాట పాడుతున్నామా? పాడితే  పిచ్చివాళ్ల మనుకోరూ? ఆదర్శ జీవితాన్ని చూపించవలసిన  నాటకాలలో యీ దరువు  లేమిటి? ఈ తాండవాలేమిటి? రోగశయ్యపై  రాగాల పాటేమిటి?'' 

- అంటూ జంఘాల శాస్త్రి తన ఉపన్యాసాన్ని ముగించేడు. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?