కేంద్రంలో మోదీ ప్రధానిగా మూడోసారి కొలువు దీరారు. అయితే దీన్ని మోదీ సర్కారు అని గట్టిగా అనడానికి లేదు. మోదీ గ్యారంటీ, మోదీహై- ముమ్కిన్ హై (మోదీ ఉంటే ఏదీ అసాధ్యం కాదు) లాటి స్లోగన్స్ యిచ్చి ప్రచారమంతా తన చుట్టూనే తిప్పుకున్నా ప్రజలు మోదీది కాదుకదా బిజెపి సర్కారునైనా అధికారంలోకి రానీయలేదు. ఎన్డీఏకు మాత్రమే ఆ ఛాన్సిచ్చారు. గతంలోనూ ఎన్డీఏ అని ఉన్న అది పేరుకు మాత్రమే. భాగస్వాములపై ఆధార పడనక్కరలేని పదేళ్ల ఏక‘పక్ష’ పాలనకు స్వస్తి పలికి, ప్రజలు సంకీర్ణ పాలనను తిరిగి ఆహ్వానించారు. పదేళ్ల క్రితం దాకా దశాబ్దాల పాటు నడిచిన సంకీర్ణ పాలనే మెరుగనే భావన వారికి కలిగించిన ఘనత మాత్రం మోదీదే! ఈ ఫలితాన్ని అంతవరకు మాత్రమే గ్రహించాలి. బిజెపి పని అయిపోయిందని, కాంగ్రెసుకి యిక తిరుగు లేదని, పైపైకి వెళ్లిపోతుందని, యికపై ప్రాంతీయ పార్టీలు చెడుగుడు ఆడేస్తాయని.. యిలాటి ఉద్ఘాటనలు, ఊహాగానాలు అనవసరం.
పోలిక చెప్పాలంటే డిస్ఠింక్షన్ వస్తుందనుకున్న మోదీకి ఫస్ట్ క్లాస్ వచ్చి ఆగింది. పరీక్ష తప్పిపోతాడేమో ననుకున్న రాహుల్‌కు పాస్ మార్కులు వచ్చాయి. ‘చార్ సౌ పార్’ నినాదం యివ్వకుండా ఎన్నికలకు వెళ్లి ఉంటే 240 సీట్లు తెచ్చుకున్న బిజెపిని ‘పదేళ్ల పాలన తర్వాత కూడా అన్ని సీట్లు తెచ్చుకోవడం గొప్పే’ అంటూ అభినందించేవారు. కానీ ఒకటి గమనించాలి. 11 ఏళ్ల పాలన తర్వాత మోదీ 2012లో మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు గతంలో కంటె 2 తగ్గి 115 సీట్లు తెచ్చుకున్నారు. 2017తో పోలిస్తే 1.1% సీట్లు తగ్గాయి. మోదీ మూడోసారి ప్రధాని అయిన యీ వేళ 2019తో పోలిస్తే పార్లమెంటులో 20% సీట్లు తగ్గాయి. 400 దాటి యివ్వండి అని మోదీ అడిగితే.. ‘అంతొద్దు, యింత చాలు’ అంటూ 240 చేతిలో పెట్టారు ప్రజలు.
ఏనుగు పడుక్కున్నా గుఱ్ఱమెత్తు అని సామెత. 20 పార్టీల ఇండియా కూటమిలో పక్షాలన్నీ కలిసి 234 మాత్రమే (సీట్లలో 43.1%) గెలుచుకోగలిగాయి. బిజెపి ఒక్కదానికే 44.2% సీట్లు, 15 పార్టీల ఎన్డీఏ కూటమి మొత్తానికి చూసుకుంటే 54% సీట్లు వచ్చాయి. స్వతంత్రుల్లో 7గురు నెగ్గారు. వాళ్లు ఎంతకాలం స్వతంత్రంగా ఉంటారో తెలియదు. ఇతర పార్టీలు తెచ్చుకున్నవి 9. వాటిలో 4 సీట్ల వైసిపి, ఒక సీటున్న మజ్లిస్ బిజెపికి ప్రచ్ఛన్న మిత్రులు. ఒక సీటున్న అకాలీ దళ్ పాత మిత్రుడు. కాంగ్రెసు వరుసగా మూడోసారి 100కి లోపు సీట్లు తెచ్చుకుంది. మహారాష్ట్రలో స్వతంత్రుడిగా నెగ్గిన కాంగ్రెస్ రెబెల్ కాంగ్రెసుకి మద్దతిస్తానంటున్నాడట. పార్టీలో చేరితే అది మూడంకెలకు చేరుతుంది. రాహుల్ వాయనాడ్ సీటు రాజీనామా చేస్తే, అక్కడ కాంగ్రెసు మళ్లీ గెలిస్తే ప్రస్తుతం ఉన్న 99 నిలుస్తుంది. లేకపోతే యింకా దిగజారుతుంది.
100 అంటే 543లో 18% సీట్లు. అవి కూడా తెచ్చుకోలేక అవస్థ పడుతున్న పార్టీ 44% సీట్లు తెచ్చుకున్న పార్టీని చూసి మీసం మెలేయడం హాస్యాస్పదం. ఏమైనా అంటే మాది నైతిక విజయం. మోదీని ప్రజలు తిరస్కరించారు అంటారు. పదేళ్ల తర్వాత మోదీ పీఠం అదిరింది తప్ప కదలలేదు. అదే పార్టీ, అదే కాబినెట్, కేంద్ర సంస్థలన్నీ వారి చేతిలోనే! ఆర్నెల్లు తిరిగేసరికి ఎంతమంది కాంగ్రెసు వారిని కలుపుకుంటారో రాహుల్ కూడా చెప్పలేడు. పరిస్థితిలో తేడా అల్లా ఏమిట్రా అంటే మోదీ ఎక్కిన హై హార్స్ ఎత్తును ప్రజలు తగ్గించారు.
‘మాకు మీలాటి బలమైన నాయకుడే కావాలి, కానీ మీరు యితరుల మాట కాస్త వినాలి. పార్లమెంటులో ఏ చర్చలూ జరపకుండా తామనుకున్నవి చేసేసి, యిదీ మా నిర్ణయం అని ప్రకటించడానికి మాత్రం వాడుకునే నోటీసు బోర్డులా చూడకుండా కాస్త అవతలి వాళ్ల ఆలోచనలు కూడా వింటూ, పట్టించుకుంటూ, బండి ముందుకు సాగించాలి. ప్రతిపక్షాలనే కాదు, భాగస్వామ్య పక్షాలనే కాదు, సొంత పార్టీలో యితర నాయకులను కూడా లక్ష్యపెట్టడం మానేయడం తప్పు.’ అని సందేశం యిచ్చినట్లయింది. 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లు ప్రధానిగా పని చేసినప్పుడు మోదీ ఏకచ్ఛత్రంగా పాలించారు కాబట్టి యిప్పుడు సంకీర్ణం నడపడానికి యిబ్బంది పడతాడు అని కొందరు ఊహిస్తున్నారు. అదేమీ ఉండదు.
మోదీ ప్రధానంగా రాజకీయ నాయకుడు. కొత్త విద్యలు నేర్చుకోవడంలో, వాతావరణానికి తగ్గట్టు రంగు, వేషం మార్చగలగడంలో ఘనుడు. పూలరంగడిలా కనబడగలడు, పరమయోగిలా దర్శనమీయగలడు. అవసరం లేకపోతే ఆతిథ్యమిచ్చిన భాగస్వామి పేరెత్తకుండా అరగంట ఉపన్యసించ గలడు. అవసరం పడితే వాటేసుకుని, వీపు చరుస్తూ పకపకా నవ్వగలడు. అవసరం తీరిపోతే అపాయింట్మెంట్ యివ్వకుండా నెలలు గడపగలడు. ఎన్నికల ప్రచారంలో నెలల తరబడి మోదీ, మోదీ అని తన పేరే తను జపిస్తూ వచ్చి, బిజెపి పరివార్‌ని కాకుండా ‘మోదీ పరివార్’ను ప్రమోట్ చేసి ఫలితాలు రాగానే ‘ఇది ఎన్డీఏ విజయం’గా అభివర్ణించడంలోనే మార్పు కనబడుతోంది.
కాబినెట్ కూర్పులో మోదీ తీసుకున్న జాగ్రత్తలు కనబడ్డాయి. వాటితో బాటే అసమ్మతి రాగాలూ వినబడ్డాయి. 10 ఏళ్ల తర్వాత మన దేశం కొత్త సంకీర్ణ శకంలోకి అడుగు పెట్టిందని అందరికీ అర్థమైంది. కాబినెట్లో 81 మందికి చోటుంటే 24 రాష్ట్రాలకు ప్రాతినిథ్యం యిస్తూ 71 మందిని తీసుకున్నారు. ఎన్డీఏలోకి వచ్చే కొత్త భాగస్వాములకు చోటు వదిలారని అనుకోవాలి. మతం ఒక్కటే ఓట్లు రాల్చదని, పాత కాలంలోలా కులానికి ప్రాధాన్యత పెరిగిందని గుర్తిస్తూ జనరల్‌కు 24, బిసికి 27, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5, మైనారిటీలకు 5 పదవులిచ్చారు. 33 మంది కొత్తవారు. ఇక అసమ్మతి ధ్వనుల విషయానికి వస్తే – 7గురు ఎంపీలున్నా కాబినెట్ ర్యాంకు యివ్వకుండా స్వతంత్ర హోదా ఉన్న సహాయమంత్రి పదవి యివ్వడం శిందే శివసేనను బాధించింది. అజిత్ ఎన్సీపీ తరఫున ప్రఫుల్ పటేల్‌కు సహాయ పదవి ఆఫర్ చేస్తే యిన్సల్ట్గా ఫీలై తీసుకోనన్నాడు. కేరళ చరిత్రలో మొట్టమొదటిసారి బిజెపి నుంచి ఎన్నికై వస్తే సహాయ మంత్రి యిస్తారా అని సురేశ్ గోపీ అలిగి, ఆ పై సర్దుకున్నాడు. మూడో టెర్మ్ మోదీకి నల్లేరు మీద బండి నడక కాదని ప్రస్తుతానికి అనిపిస్తోంది.
2004లో ఆడ్వాణీ ‘‘ఇండియా షైనింగ్’’ నినాదంతో ఎన్నికలకు వెళ్లి బోర్లా పడ్డాక, అంత చేటు ప్రాపగాండా మంచిది కాదు అంటూ బిజెపి వారే విమర్శించారు. ఇప్పుడు ‘చార్ సౌ పార్’ నినాదం కూడా అలాటి అభిశంసనకు గురౌతోంది. బిజెపి నాయకులకు అహంకారం పెరిగిపోయిందని, ఆరెస్సెస్‌తో పని లేదని ప్రధాన నాయకులే అనడం ఆత్మహత్యా సదృశమైందని ఆరెస్సెస్ వారు విమర్శిస్తున్నారు. 25% మంది అభ్యర్థులు ఫిరాయింపు దారులని, యిక సంఘ్ స్ఫూర్తి ఎక్కడ మిగిలిందని వారి ఘోష. అభ్యర్థుల పని తీరు బాగా లేకపోయినా, ప్రజామోదం పోగొట్టుకున్న సిటింగు ఎంపీలనే రిపీట్ చేసినా ఏమీ ఫర్వాలేదనీ, మోదీ యిమేజే 400 మందినీ గెలిపిస్తుందన్న అతి విశ్వాసంతో బిజెపి నాయకుల అలసత్వం వహించారని, అదే కొంప ముంచిందని బిజెపి కార్యకర్తలు వాపోతున్నారు.
బాగా నడిచినంత కాలం, గెలుస్తూ వచ్చినంతకాలం లోపాలేవీ కనబడవు. పాత అభ్యర్థులైనా, కొత్త వాళ్లయినా ఫిరాయింపుదారులైనా, తమ పార్టీలో చేరేటంత వరకు పక్కా అవినీతిపరులని బిజెపియే ముద్ర వేసి ఉన్నా.. అన్నీ చెల్లిపోతాయి. ఇప్పుడు అనుకున్న వాటి కంటె 100 తగ్గడంతో విమర్శలు జోరందుకున్నాయి. ఫుల్వామా ఎఫెక్టు లేకపోతే 2019లో కూడా బిజెపికి యిన్నే వచ్చేవి అని పర్శంటేజిలతో సహా యిప్పుడు విశ్లేషణలు వస్తున్నాయి. కానీ మోదీ-షాలకు అదేమీ తోచలేదు. గెలుపుతో ఒక మాయ కళ్లకు కప్పేస్తుంది. ముళ్లపూడి రమణ గారు ‘‘కోతి కొమ్మచ్చి’’లో ఒక నిర్మాత గురించి రాశారు. ఓ రెండు సినిమాలు వరుసగా సక్సెసవగానే పొగరెక్కి, ఆయన రమణ గారితో ‘అసలీ ఫ్లాప్ సినిమాలు తక్కినవాళ్లు ఎలా తీస్తారండీ!? ముందే అన్నీ చూసుకోరా!?’ అంటూ ఆశ్చర్యపడ్డాడట. రమణగారు అది చెపుతూ పర్యవసానం కూడా చేర్చారు – ‘భగవంతుడు కరుణామయుడు. ఆయనకా విద్య నేర్పాడు… ఆ పై మప్పాడు..’ అని!
మోదీ కరిజ్మా చూసుకుని ఛోటామోటా బిజెపి నాయకులు కూడా విర్రవీగారు. ‘అసలు మనకు ఓటమే లేదు. మరో రెండు దశాబ్దాల పాటు ఎదురే లేదు. రకరకాల మార్గాలలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి పడేశాం. మీడియాను గుప్పిట్లో పెట్టుకున్నాం. అలా, అలా దూసుకు పోతూ, కొత్త ప్రాంతాలను జయిస్తూ పోవడమే మన పని. మనని విమర్శిస్తే దేశద్రోహులని ముద్ర కొడితే చాలు. నందిని పందిగా చూపించగల సత్తా ఉన్న లక్షలాది వాట్సాప్ గ్రూపులుండగా మనకేల చింత?’ అనుకున్నారు. ప్రతిపక్షం సరిగ్గా లేని చోట ప్రజలే ప్రతిపక్షంగా మారతారని 1977లో నిరూపితమైంది. జనతా పార్టీ భాగస్వామ్య పార్టీలు అప్పట్లో బలంగా ఏమీ లేవు. నాయకులు జైళ్లల్లో ఉన్నారు. అయినా ఉత్తరాదిన ప్రజలు కాంగ్రెసును ఊడ్చేశారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులకు, మీడియాకు ఈడీ భయం ఉంది కానీ ప్రజలకేముంది? తమ ‘మన్‌కీ బాత్’ ఏమిటో మోదీకి ధైర్యంగా చెప్పేశారు.
ఇకపై వ్యక్తిపూజ తగ్గించి, అందర్నీ సంప్రదిస్తూ, అచ్చమైన సంకీర్ణ ప్రభుత్వం నడిపితే వాజపేయి నాటి రోజులు తిరిగి వస్తాయని కొందరు ఆశిస్తున్నారు. ‘ఆర్థికాభివృద్ధి, పేదరికం తగ్గింపు, ఉపాధి పెరుగుదల, దేశీయ సామాజిక స్థిరత్వం వంటి అంశాల పరంగా దేశానికి అత్యుత్తమ కాలం 1991-2014. ఆ కాలంలో పివి, ఫ్రంట్, వాజపేయి, మన్మోహన్‌ల హయాంలలో నడిచినవి సంకీర్ణ ప్రభుత్వాలే. మళ్లీ ఆ యుగం వచ్చింది. మోదీ వారిలా వ్యవహరిస్తే దేశానికి మేలు.’ అంటూ సంజయ్ బారు రాశారు. వీళ్లంతా ఏమైనా చెప్పవచ్చు. ఈ ఫలితాల గురించి మోదీ ఏమనుకుంటున్నారు? అనే దానిపైననే బిజెపి యికపై పట్టే మార్గం ఆధారపడుతుంది. తన శైలి మార్చుకోవలసిన అవసరం పడిందను కుంటున్నారా? అక్కరలేదను కుంటున్నారా? అనేది ఆయన ఫలితాలను చూసే దృక్కోణం నిర్ణయిస్తుంది. ఎందుకంటే యీ ఫలితాలను రెండు రకాలుగా చూడవచ్చు.
పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రధాని పట్ల ప్రజల అలసటను (ఫెటీగ్) అధిగమించి, మూడోసారి వరుసగా ప్రధాని కావడం నెహ్రూ గారి తర్వాత మోదీకే సాధ్యపడింది. ఇక్కడో చిన్న మెలిక ఉంది. నెహ్రూ గారు మూడు సార్లూ సొంత బలం మీదనే ప్రధాని అయ్యారు. మోదీ మూడోసారి చంకకర్రల మీద ఆధారపడుతున్నారు. రెండో భాగం మనకు గుర్తుకి రాకుండా, నెహ్రూ తర్వాత మోదీయే అనే భాగమే బిజెపి హోరెత్తిస్తోంది. మోదీ గారికి రెండు భాగాలూ గుర్తున్నాయో లేక మొదటి భాగాన్నే పట్టుకుని రెండోది మర్చిపోయారో తెలియదు. అలాగే వివిధ రాష్ట్రాల ఫలితాల విషయంలో కూడా రెండేసి భాగాలున్నాయి. బిజెపికి యీసారి తమ కంచుకోటలైన నార్త్, వెస్ట్‌లలో దెబ్బ తగులుతుందని, అందుకే సౌత్‌పై దృష్టి పెట్టిందని బాగా ప్రచారం జరిగింది. అది ఏ మేరకు నిజమైంది?
2019 అంకెలు బ్రాకెట్లలో యిస్తున్నాను. 2024లో ఇండియా, 2019లో యుపిఏ దాదాపు సమానం అనే లెక్కలో అంకెలు వేస్తున్నాను. సౌత్‌లో 132 సీట్లు ఉన్నాయి. ఎన్‌డిఏకు 50 (30) ఇండియాకు 77 (65), యితరులకు 5(37) వచ్చాయి. అప్పటి 30లో కానీ, యిప్పటి 50లో కానీ బిజెపి సొంత సీట్లు 29 మాత్రమే. ఎదుగూబొదుగూ లేదు. 2019లో భాగస్వామి ఎడిఎంకెకు 1 సీటు రావడంతో 30 అయింది. ఇప్పుడు భాగస్వాములైన టిడిపివి 16, జనసేనవి 2, జెడిఎస్వి 2 కలుపుకుని ఎన్డీఏకు 50 వచ్చాయి. బిజెపికి సొంతంగా వచ్చినవి ఆంధ్రలో 3 (0), తెలంగాణలో 8(4), కర్ణాటకలో 17 (25), కేరళలో 1(0), మొత్తం 29. కర్ణాటకలో 8 సీట్లు పోగొట్టుకున్నా, ఆంధ్రలో 3, తెలంగాణలో 4, కేరళలో 1 గెలుచుకోవడంతో ఆ 29 అంకె నిలబడింది.
ఆంధ్రలో టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకోవడం వలననే ఎన్డీఏకు 18 కలిసి వచ్చాయి. కర్ణాటకలో జెడిఎస్‌తో పొత్తు కూడా లాభదాయకమైంది. అసెంబ్లీ ఎన్నికలలో బాగా దెబ్బ తిన్నా, పుంజుకో గలిగింది. పరిస్థితి యిలా ఉండగా టిడిపితో పొత్తు కట్టడానికి ఎంత తాత్సారం చేశారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పొత్తే లేకపోతే ఆంధ్రలో బిజెపి 3 సీట్లు గెలిచేది కాదు. సౌత్‌లో 26 సీట్లతో ఆగేది. ఆంధ్ర గెలుపు చంద్రబాబు ఘనతే తప్ప బిజెపిది కాదు. తెలంగాణలో తెరాస ఓట్లు బదిలీ కాకపోతే (దీనిలో తెరాస పాత్ర ఎంత ఉందో భవిష్యత్తులో తెలియాలి) 8 గెలిచేదో లేదో తెలియదు. కేరళలో ఓట్ల శాతం పెరిగింది కానీ సురేశ్ గోపీ గెలుపుకి అతని స్టార్ యిమేజి కొంతైనా దోహదపడిందని అనుకోవాలి.
తమిళనాడులో అన్నామలై చేసిన ఆర్భాటం చూసి, ఏదో ఊడబొడుస్తా డనుకుంటేటే తనే గెలవలేక పోయాడు. ‘ఈసారి ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహించాం, మా ఓట్ల శాతం పెరిగింది’ అని చెప్పుకోవడమే బిజెపికి మిగిలింది. కానీ పిఎంకె బెల్ట్‌లో వణ్నియార్ ఓట్లు పడ్డాయి కాబట్టే ఓట్ల శాతం పెరగడానికి సహకరించిందని కూడా గమనించాలి. దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటకలో మాత్రమే బిజెపి తన బలాన్ని చూపించింది. అక్కడ కూడా జెడిఎస్‌తో పొత్తు కారణంగా దక్షిణ కర్ణాటకలో వొక్కళిగ ఓట్ల బదిలీ కారణంగా ఓట్లు, సీట్లు పెరిగాయని కూడా గమనించాలి. కానీ జెడిఎస్‌ను అస్సలు నమ్మడానికి లేదు. ఎప్పుడు ఎటు తిరుగుతారో ఎవరికీ తెలియదు. సొంతబలం పెంచుకోవడానికి బిజెపి యింకా శ్రమించాలనే అర్థమౌతోంది. ఇవన్నీ విహంగవీక్షణంగా పరామర్శిస్తున్నాను. రాష్ట్రాల వారీ రాసినప్పుడు, యింకా విపులంగా చెప్తాను.
చూడబోతే సౌత్‌లో బిజెపి బలం పెరగలేదు. దాని భాగస్వాముల అండతో నిలబడింది. పెరగనందుకు మోదీ పశ్చాత్తాప పడాలా, పొత్తు పెట్టుకోవడంలో విజ్ఞత ప్రదర్శించామని గర్వించాలా అన్న దాని బట్టి ఆయన భవిష్యత్ వైఖరి ఉండబోతుంది. ప్రభుత్వ మనుగడకై దక్షిణాదిపై ఆధారపడే పరిస్థితి వచ్చింది కాబట్టి, దక్షిణాదికి నిధులు కురిపిస్తాడని కొందరు అంచనాలు వేస్తున్నారు. కానీ దక్షిణాది ప్రజలు తమ పార్టీని ఆదరించలేదని, తమ భాగస్వాములను మాత్రమే ప్రోత్సహించారనే కోణంలో కూడా మోదీ ఆలోచించ వచ్చు. తాము సొంతంగా ఎదగాలంటే భాగస్వాములను బలహీన పర్చాలని, వారికి పాప్యులారిటీ పెరగకుండా చేయాలని కూడా అనుకోవచ్చు. నిజానికి దక్షిణాదిన ఆంధ్రలో ఒక్కటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. తక్కిన రాష్ట్రాలన్నిటిలో విపక్ష ప్రభుత్వాలే! నిధులిచ్చి వారిని పటిష్టపరుస్తారా? అబ్బే!
ఇక బలహీనపడుతుందని భయపడిన నార్త్, వెస్ట్‌లలో పరిస్థితి ఏమిటి? నార్త్‌లోని 191 సీట్లలో ఎన్డీఏకు 112 (160) ఇండియాకు 73 (12), ఇతరులు 6 (19) వచ్చాయి. నార్త్‌లో పేరుకి ఎన్డీఏ అన్నా, ప్రధానంగా బిజెపి సీట్లే అవి. అక్కడ 52 సీట్లు పోగొట్టుకుని దెబ్బ తినడానికి కారణం యుపిలో 29 (62-33), రాజస్థాన్ 10 (24-14), హరియాణాలో 5 (10-5) సీట్లు తగ్గాయి. నార్త్‌లో పరువు దక్కడానికి కారణం మధ్యప్రదేశ్. 29 సీట్లూ నిలబెట్టుకుంది. ఇక వెస్ట్‌కి వస్తే మహారాష్ట్ర బాగా దెబ్బ తీసింది. బిజెపికి 14 (23-9)కి తగ్గగా, దాని భాగస్వాములు శిందే శివసేనకు7, అజిత్ పవార్ ఎన్సీపీకి 1 వచ్చాయి. మొత్తం 48 సీట్లలో బిజెపికి 30కి మించి రావని అంచనా వేస్తే అదేమిటన్నారు కొందరు. తీరా చూస్తే ఆ 30 ఇండియా కూటమికి వచ్చాయి. ఒకటి స్వతంత్రుడికి పోగా వీళ్లకు 17 మిగిలాయి. గుజరాత్లో ఒక్కటే తగ్గింది.
ఈస్ట్‌లోని 142 సీట్లలో ఎన్డీఏకు 87 (92), ఇండియాకు 52 (10), ఇతరులకు 3 (40) వచ్చాయి 2019లో యితరులు 40 ఉండానికి కారణం తృణమూల్, బిజెడి. ఇప్పుడు బిజెడి ఎన్డీఏలోకి వచ్చింది, తృణమూల్ విడిగా ఉంది. బెంగాల్లో గతంలో కంటె 6 (18-12) తగ్గితే ఒడిశాలో 12 (8-20) పెరిగాయి. బిహార్‌లో 5 (17-12) తగ్గాయి. మొత్తం మీద పెరిగినవి 12, తగ్గినవి 11. గతంలో కంటె మైనస్సయినా భాగస్వాములు కొమ్ము కాశారు. నీతీశ్ మరో గాలి కోడి. ఈస్ట్‌లోనే భాగంగా తీసుకున్న నార్త్ ఈస్ట్‌ని విడిగా చూస్తే అక్కడి 25 సీట్లలో ఎన్డీఏకు 16, ఇండియాకు 7, యితరులకు 2 వచ్చాయి.
ఇవన్నీ ఒక రకంగా మిశ్రమ ఫలితాలు. దేశమంతా ఒకే రకమైన వేవ్ ఉందని చెప్పజాలని ఫలితాలు. మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గట్టిగా అనలేము కానీ, జాగ్రత్త పడాలి అనే హెచ్చరిక మాత్రం యిచ్చాయివి. మోదీ అజేయుడు అనే భావనకు విఘాతం తగిలింది. అంత మాత్రం చేత బిజెపి తన హిందూత్వను కానీ, రైటిస్టు విధానాలను కానీ మార్చుకుంటుందని, అధికారాలను వికేంద్రం చేసి, రాష్ట్రాలను బలోపేతం చేస్తుందని అనుకోవడానికి వీల్లేదు. అలాటిదేదైనా జరగాలంటే ఆర్నెల్లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎదురు దెబ్బ తగలాలి. అది తగిలితే యీ ప్రతికూలతను కన్ఫమ్ చేసినట్లవుతుంది. ఈలోగా తన కోర్స్ కరక్షన్ చేసుకుని, పుంజుకుంటే బిజెపి దృఢంగా ముందుకు వెళుతుంది. ఎన్డీఏలో తన భాగస్వాములను కూడా అదుపులో ఉంచగలుగుతుంది. అది జరగకపోతే యీ భాగస్వాములు తోక ఝాడించే ప్రమాదం ఉంది.
ముందే చెప్పినట్లు, అంతా చూసే చూపులో ఉంది. ఉదాహరణకి మోదీ దిల్లీలో ఏడుకి ఏడు సీట్లూ హాట్రిక్ కొట్టారు. అది గొప్పే కదా. బిజెపికి 54.3% ఓట్లు రాగా ఆప్, కాంగ్రెసు కూటమికి 43% మాత్రమే వచ్చాయి. కానీ బిజెపి ఓట్ల శాతం 2019తో పోలిస్తే 2.5% తగ్గింది. ఆప్ నాయకులందరిపై కేసులు పెట్టి, జైళ్లలోకి తోసినా వారి ఓట్లు 6% పెరిగాయి. బిజెపి అభ్యర్థుల విన్నింగ్ మార్జిన్లు బాగా పడిపోయాయి. ఫలితాలను చూసి బిజెపి ఒకలా తృప్తి పడవచ్చు. మరోలా చూస్తే అసంతృప్తి కలగవచ్చు. అసంతృప్తి నుంచే ఆలోచన, ఆత్మావలోకనం కలుగుతాయి. అవతలివైపు కాంగ్రెసు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ ఏదో దంచేశామని, ఊడబొడిచేశామని ఫీలై బోర విరుచుకుంటే బోల్తా పడతారు. ఏదో సామెత చెప్పినట్లు – ‘దిల్లీ దూర్ ఆస్త్’ !
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2024)