ఎమ్బీయస్‍: పాపపరిహారార్థం కళోద్ధరణ

చిత్రకారుడికి సృష్టిలో అందమైనది ప్రతీదీ ఆరాధనీయమే. కానీ మోరల్ పోలీసింగ్‌తో, మత విశ్వాసాల పేరు చెప్పి అతన్ని భయభ్రాంతుణ్ని చేస్తే కళ దెబ్బ తింటుంది.

చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా దానాలు చేయడాలు, గుళ్లూ గోపురాలు కట్టించడాలూ మన దేశంలో చూస్తూ వచ్చాం. 15వ శతాబ్దపు యూరోప్‌లో పాపపరిహారార్థం పురాణగాథల చిత్రాలు వేయించడం జరిగిందని, అదే రినైజాన్స్ (కళల్లో పునరుజ్జీవన కాలం)కు బాగా ఉపకరించిందని, అనేక కళాఖండాలు ఆ విధంగా రూపు దిద్దుకున్నాయని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అప్పటి ఆర్థిక పరిస్థితులు, ఐశ్వర్యాభివృద్ధి, మత విశ్వాసాలు కళాకారులను ఎలా ప్రేరేపించాయో, పాప పరిహారం కోసం కళను ఎలా ఉపయోగించారో, కొంతకాలానికి అవే మత విశ్వాసాలు కళావికాసానికి ఎలా అవరోధంగా మారాయో కూడా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

వడ్డీ వ్యాపారం చేయడాన్ని బైబిల్, ఖురాన్ వంటి గ్రంథాలు స్పష్టంగా ఖండించాయి. అయితే డబ్బు యిచ్చిపుచ్చుకోకుండా, ఋణం ఆలస్యంగా తీర్చినప్పుడు ఏదో విధమైన నష్ట పరిహారాన్ని తీసుకోకుండా వ్యవహారాలు సాగవు. ఇప్పటి బ్యాంకింగ్ వ్యవస్థ 14వ శతాబ్దం చివర్లో యూరోప్‌లో రూపు దిద్దుకోవడం ప్రారంభించి 15వ శతాబ్దంలో విస్తరించడం ప్రారంభమైంది. 1401లో స్పెయిన్‌ లోని బార్సిలోనాలో ప్రథమ బ్యాంకు ఏర్పడిందనవచ్చు. అది వెంటనే ఇటాలియన్ సిటీ స్టేట్స్ అయిన ఫ్లారెన్స్, వెనిస్, జినోవాలలో వ్యాపించింది.

1400ల నాటికి వడ్డీ వ్యాపారమనేది క్రైస్తవులకు మత విశ్వాసానికి విరుద్ధమైన విషయం. అందువల్ల అప్పటిదాకా క్రైస్తవ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారాన్ని యూదులకు వదిలివేశారు. అయితే, ఉత్తర ఇటలీ లోని కొన్ని నగరాల్లో, తెలివైన క్రైస్తవులు బ్యాంకింగ్ నిషేధాన్ని తప్పించు కోవడానికి మార్గాలు కనుక్కోవడం ప్రారంభించారు. అవి చట్టవిరుద్ధం కానప్పటికీ, చర్చి వాటిని అంగీకరించ లేదు. వస్తువులను వ్యాపారం చేయడం వరకు ఓకే కానీ, వడ్డీ వ్యాపారులు ఋణం తీర్చడానికి పట్టే కాలానికి విలువ కట్టి వడ్డీగా వసూలు చేస్తున్నారని, సమయమనేది దేవుడి అధీనంలో ఉంటుంది కాబట్టి వడ్డీ వసూలు చేయడం పాపమని, వడ్డీ వ్యాపారస్తులు నరకానికి వెళ్లడం ఖాయమని చర్చి హెచ్చరించింది. నరకానికి వెళ్లేవారిలో తమ నగరవాసులే ఎక్కువమంది ఉంటారని ఫ్లోరెన్స్‌ వాసులు ఫీలయ్యారు. ఎందుకంటే ఆధునిక బ్యాంకింగ్‌కు పునాదులు అక్కడే పడుతున్నాయి.

అస్సలు పాపం చేయకుండా ఉండడం కంటె, ఆ పాపాలేవో చేసేసి, డబ్బు సంపాదించి, ఆ డబ్బుతో మతపరమైన గొప్ప కళాఖండాలను తయారు చేయించి, పాపప్రక్షాళన చేసుకుని, నరకవాసాన్ని తప్పించుకోవడం మంచిదని ఫ్లారెన్స్ వడ్డీ వ్యాపారస్తులు లెక్క వేశారు. ఈ విధమైన లెక్కే అంతర్జాతీయ ఆర్థిక పరిశ్రమకు, పునరుజ్జీవనం నాటి చిత్రకళావైభవానికి కేంద్రంగా ఫ్లారెన్స్ ఎదగడానికి దోహదపడింది. ఆ పరిణామక్రమాన్ని రికార్డు చేయడానికి 2012లో మెడిచి కుటుంబం వారసులు ఫ్లారెన్స్‌లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు యీ సంగతులన్నీ గుర్తు చేస్తూ ‘‘ద ఎకనమిస్ట్’’ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ప్రదర్శనకు కారకులైన మెడిచి కుటుంబం తొలుత ఉన్ని వ్యాపారం చేసి, తరువాత బ్యాంకర్లుగా మారారు. ఫ్లారెన్స్, టస్కనీలలో వ్యాపారస్తులుగా, పరోక్ష పాలకులుగా మారి, 1737 వరకు ఆధిపత్యం చలాయించారు. వారి వారసులు ఆనాటి చరిత్రను యిప్పటి తరానికి అందించడానికి యీ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ఆ వ్యాసంలో ఫ్లారెన్స్ అని కనబడగానే నాకు రినైజాన్స్ కాలం నాటి ప్రముఖ చిత్రకారత్రయం గుర్తుకు వచ్చారు. లియోనార్డో ద విన్చి (మోనాలిసా చిత్రకారుడే కాక బహుముఖ ప్రజ్ఞాశాలి), మైకెలాంజెలో (వాటికన్‌లోని పోప్ అధికార నివాసమైన సిస్టిన్ చాపెల్‌లో సీలింగులో ‘ద క్రియోషన్ ఆఫ్ మ్యాన్ (ఏడమ్)’ వంటివి పెయింటు చేయడమే కాక, గొప్ప శిల్పి కూడా), రఫేల్ (ద స్కూల్ ఆఫ్ ఏథెన్స్ వంటి అనేక చిత్రాలు వేసి ప్రిన్స్ ఆఫ్ పెయింటర్స్‌గా పేరు తెచ్చుకున్నవాడు) – యీ త్రయాన్నే కాక ఆనాటి అనేకమంది చిత్రకారులను పోషించి, చరిత్రలో నిలిచిపోయే కళాఖండాలు రూపొందడానికి మెడిచి కుటుంబం వంటి బ్యాంకర్ల పాపభీతి కారణమని తెలిసి నివ్వెరపోయాను. ఆ తర్వాతి రోజుల్లో అలాటి కళపై నిరసనజ్వాలలు ఎగసిపడి, కొన్ని కళాఖండాలను దగ్ధం చేశారని తెలిసి నిర్ఘాంతపోయాను. అలాటి మోరల్ పోలీసింగ్ వలన కొంతమంది చిత్రకారులు తమ శైలిని మార్చుకున్నారని తెలుసుకుని విచారించాను. ఆ విషయాలు మీతో పంచుకోవాలనే యీ వ్యాసం.

ఫ్లారెన్స్ రినైజాన్స్ యుగం 1400 నుంచి 200 ఏళ్ల పాటు నడిచింది. అప్పటిదాకా పాప్యులర్‌గా ఉన్న గోథిక్ శైలికి భిన్నంగా, దేవుళ్లను కూడా మనుషుల రూపానికి దగ్గరగా చిత్రీకరించి వారిని సజీవంగా, జీవకళ ఉట్టిపడేట్లు చూపింది యీ యుగం. ఈ శైలిని ఆమోదించడానికి కొంతకాలం పట్టినా త్వరలోనే ప్రజాదరణ పొందింది. దాంతో పోప్‌లు యీ ఆర్టిస్టులను పిలిచి వాటికన్‌లో కూడా చిత్రాలు వేయించుకోవడం జరిగింది. ఇటలీయే కాక, యితర యూరోప్ దేశాల్లో కూడా యీ కళ వ్యాపించింది. ఈ ఉద్యమంలో మొదటి దశ 1400-1450 వరకు అనుకుంటే 1450-1492 దశను మెడిచీల ఉచ్చ దశ అనుకోవచ్చు. ఆ తర్వాత నుంచి మెడిచీల నాటి కళకు వ్యతిరేకంగా గిరోలామో సవోనరోలా పోరాడిన దశ 30 ఏళ్లు సాగింది. తర్వాతి దశలో కొందరు చిత్రకారులు తమ శైలి మార్చుకున్నారు. వాటికన్ కూడా వీరిని పిలిచి, వారి చేత బొమ్మలు వేయించుకుంది.

ఈ దశల గురించి క్లుప్తంగా చెప్తాను. మెడిచీ పీరియడ్‌లో శాండ్రో బొట్టిసెల్లి వేసిన ‘ద బర్త్ ఆఫ్ వీనస్’ (సముద్రం లోంచి వీనస్ బయటకు రావడం), ‘ప్రైమావెరా’ (వీనస్ యితర దేవతలు), ‘స్ప్రింగ్’, మైకెలాంజెలో చెక్కిన ‘టూంబ్ ఆఫ్ లొరెంజో ద మెడిచి’ లాటివి ప్రసిద్ధి కెక్కాయి. ఆర్టిస్టులు మెడిచీ కుటుంబసభ్యుల బొమ్మలే కాక, యితర ధనవంతుల బొమ్మలు కూడా వేసేవారు. క్రిమినల్స్ బొమ్మలు, ఉరిశిక్ష పడినవారి బొమ్మలు కూడా గీసేవారు. ఎవరూ చూడని దేవీదేవతల బొమ్మలు వేయడం సులభమే కానీ రక్తమాంసాలతో ఉన్న సహజమైన మనుష్యులను, వివిధ సందర్భాల్లో వారి హావభావాలను తమ కుంచెతో ఒడిసి పట్టుకుని ప్రశంసలు అందుకునే వారు. మతంతో సంబంధం లేకుండా వేసిన పెయింటింగ్స్ కాబట్టి వాటిని సెక్యులర్ పెయింటింగ్స్ అని కూడా అనేవారు. .

దీన్ని నిరసిస్తూ ఉద్యమం లేవదీసినవాడు గిరోలామో సవోనరోలా (1452-1498). ఫెరారా ప్రాంతానికి చెందిన ఒక మతాధికారి. తన ఉపన్యాసాలతో, జోస్యాలతో ప్రజలను ఆకట్టుకున్నాడు. 1494లో ఫ్రాన్స్ రాజు 8వ ఛార్లెస్ ఇటలీపై దండయాత్రలో భాగంగా ఫ్లారెన్స్‌ వచ్చినపుడు, అతను నగరాన్ని వశపరుచుకోలేడని యితను జోస్యం చెప్పాడు. ‘మనమంతా కలిసి ఫ్రెంచ్ వారిపై కలిసి పోరాడుదాం.’ అని పిలుపు నిచ్చిన పోప్‌ను ధిక్కరించి, ఛార్లెస్‌ను కలిసి ‘మీ నాయకత్వంలో మనమంతా పోప్‌కు వ్యతిరేకంగా క్రైస్తవ మత సంస్కరణ చేపడదాం’ అని ప్రతిపాదించాడు. ఇతని బోధనలు విని ఛార్లెస్ ఆ నగరాన్ని వదిలి ముందుకు సాగడంతో ప్రజల్లో యితనికి పలుకుబడి పెరిగింది. ఇతను నియంతల పాలనను, పేదలను దోపిడీ చేయడాన్ని నిరసించడంతో ఆగకుండా పోప్‌ వ్యవస్థలో ఉన్న అవినీతిని కూడా ఎండగట్టడంతో ప్రజలు యితనికి హారతి పట్టారు. జనాల్లో నైతిక విలువలు పరిరక్షించాలంటే ధనవంతులు రాజ్యమేలకూడదని, ప్రజాప్రతినిథులతో కూడిన రిపబ్లిక్ ఏర్పడాలని వాదించి నెగ్గాడు.

అతను ఫ్లారెన్స్ వారి విలాసాలు, జూదం, కార్నివాల్‌లు, ప్రత్యేకంగా వారి అసభ్యకరమైన చిత్రలేఖనాలను తీవ్రంగా దుయ్యబట్టాడు. మెడిచీ చిత్రాలలో “వర్జిన్ మేరీ ఒక వేశ్యలా కనిపిస్తుంది” అన్నాడు. పిల్లలు తమ తల్లిదండ్రులపై నిఘా ఉంచాలని, వ్యభిచారులను శిక్షించాలని, స్వలింగ సంపర్కులను సజీవంగా కాల్చివేయాలని, మతవిరుద్ధమైన సరదాలను నిషేధించాలని పిలుపు నిచ్చాడు. మతపరంగా కూడా ఫ్లారెన్స్ ఎంతో ఉన్నత స్థానాన్ని పొంది నూతన జెరూసలేమ్ కావాలని, ప్రపంచ క్రైస్తవానికి కేంద్రం కావాలని పిలుపు నిచ్చాడు. ఇదంతా చూసి కంగారు పుట్టిన అప్పటి పోప్ 6వ అలెగ్జాండరు ‘నువ్వు రోమ్‌కు రా, మాట్లాడుకుందాం.’’ అని పిలిచాడు.

కానీ సవోనరోలా వెళ్లలేదు. అయితే నువ్వు మతబోధలు చేయడానికి వీల్లేదన్నాడు పోప్. అతని అజ్ఞను ధిక్కరించి మత ప్రబోధం చేస్తూనే, ఫ్లారెన్స్ పవిత్ర నగరం కావాలంటే ధనికులు పాపభీతితో వేయించిన అశ్లీల చిత్రాలను, రచనలను ధ్వంసం చేయాలని ఉద్యమించినప్పుడు ఫ్లారెన్స్ యువత అతనికి మద్దతుగా నిలిచింది. అందుకే అతను యించుమించు ఫ్లారెన్స్‌కు పరోక్ష పాలకుడిగా ఉన్న 1497, 1498 సంవత్సరాల్లో భారీగా ‘‘బాన్‌ఫయర్స్ ఆఫ్ ద వానిటీస్’’ (అహంకారాల ఆహుతి) జరిగాయి. అప్పుడు లెక్కలేనన్ని కళాఖండాలు, పుస్తకాలు, దుస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ సందర్భంగా అతను అనేక చిత్రాలపై దుష్టమైనవన్న ముద్ర కొట్టి మంటల్లో వేసి తగలబెట్టించాడు. తనకు నచ్చని వాటన్నిటినీ సవోనరోలా ‘పెయింటింగ్స్ ఆఫ్ ఇన్‌ఫేమీ’ అన్నాడు. నీతిబాహ్యమైనవి, క్రైస్తవ వ్యతిరేకమైనవి అన్నాడు. ఆ దేశంలో క్రైస్తవ వ్యాప్తికి ముందు ఉన్న దేవుళ్ల బొమ్మల్ని, చిత్రకళా రీతులను కూడా యితను నిరసించాడు.

లియోనార్డో ద విన్చి, అతని గురువు వెరోచియో కలిసి వేసిన 1475 నాటి ‘బాప్టిజం ఆఫ్ క్రైస్ట్’ కూడా క్రైస్తవ వ్యతిరేక ముద్రను తెచ్చుకుంది. చర్చి మతాధికారుల అనైతికను వెక్కిరించిన బొకాషియో (1313-1375) రచనలను కూడా యీ మంటల్లో తగలబెట్టారు. సెక్యులర్ గీతాల మాన్యుస్క్రిప్టులను, శిల్పాలను కూడా యీ మంటల్లో పడేశారు. కొన్ని మతానికి వ్యతిరేకం కాకపోయినా అనవసరమైన ఆడంబరంతో ఉన్నాయనే కారణం చెప్పి తగలబెట్టారు. డబ్బున్నవాళ్లు ధనమదంతో ఆర్టిస్టుల చేత బొమ్మలేయించు కున్నారనే కారణంతో మరి కొన్నిటిని భస్మీపటలం చేశారు. ఈ దశలో పెయింటర్స్ చాలా భయపడిపోయారు. కొందరు రాత్రి పూట కర్టెన్ల వెనక దాక్కుని పెయింటు చేసేవారు.

తనను ధిక్కరించి కూడా యింతటి ప్రజాదరణ పొందుతున్న సవోనరోలాను పోప్ 1497లో మతం నుంచి వెలి వేశాడు. ఫ్లారెన్స్‌ను నిషిద్ధనగరంగా ప్రకటిస్తానన్నాడు. ఇతను ‘నేను నా మహిమలు చూపించగలను’ అంటూ ఛాలెంజ్ చేశాడు. ఫ్లారెన్స్‌లో అతన్ని వ్యతిరేకించే మతాధికారులు ‘నిప్పుల్లో నడిచి చూపించు’ అన్నారు. సవోనరోలా వెనకాడితే అతని శిష్యుడు ‘ఆయన బదులు నేను నడుస్తాను’ అన్నాడు. అక్కడికే ప్రజల విశ్వాసం నమ్మకం సడలింది. 1497 ఏప్రిల్ 7న నగరపు నడి కూడలిలో ప్రదర్శన ఏర్పాటు చేశాక, సవోనరోలా అనుచరులు ఏదో ఒక సాకు చెప్పి, అది ఆలస్యంగా ప్రారంభ మయ్యేట్లు చేశారు. ఇంతలో భారీ వర్షం కురిసి, ఆ ప్రదర్శన రద్దయింది. సవోనరోలాకు దైవికశక్తులు ఉండి వుంటే, ఆ వర్షాన్ని ఆపగలిగేవాడు కదా, అతనికి అవేవీ లేవు అని ప్రజలకు తోచింది.

మర్నాడు అతను నివసించే కాన్వెంట్‌పై వారు దాడి చేశారు. అతను అరెస్టయ్యాడు. పోలీసు కస్టడీలో ఉండగా నా జోస్యాలు, మహిమలు అన్నీ ఉత్తివే, నేను కల్పించినవే అని ఒప్పుకున్నాడు. తర్వాత పోలీసులు నా చేత అలా చెప్పించారు అన్నాడు. కొన్నాళ్లకి మళ్లీ ఒప్పుకున్నాడు. అతనిపై, అతని ముఖ్య అనుచరులిద్దరిపై విచారణ జరిగింది. చివరకు దోషులుగా నిర్ధారించి, 1498 మే 23న బహరంగంగా ఊరి మధ్య ఉరి కొయ్యలకు వేలాడేసి, క్రింద మంటలు పెట్టి సజీవదహనం చేసి, ఆ బూడిదను ఆనవాలు లేకుండా నదిలో కలిపేశారు.

సవోనరోలా 46 ఏళ్లు మాత్రమే బతికినప్పటికీ అతని అనుచరులు మాత్రం ‘‘పీయాన్యోనీ’’ (రోదించేవారు అని అర్థం, తమ పాపాలకు, మన పాపాలకు వాళ్లు విలపిస్తారట) పేర ఒక సంస్థగా ఏర్పడి, అతని రిపబ్లికన్ ఉద్యమాన్ని, మత‘సంస్కరణ’ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. మరణానంతరం సైతం అతనికి ప్రజాదరణ పెరగడం గమనించిన పోప్ రెండవ జూలియస్ (1503-13) అతనికి సెయింట్‌హుడ్ ప్రసాదిద్దామా అని కూడా ఆలోచించాడు. క్రైస్తవ సన్యాసులు, సన్యాసినులు మరణించాక కూడా మహిమలు చూపిస్తున్నట్లు ఎవరైనా ఆధారాలు చూపితే, వాటిని వాటికన్ నమ్మితే వారిని ‘ఋషులు’ (సెయింట్)గా గుర్తించే ప్రక్రియను కాననైజేషన్ అంటారు. మదర్ థెరిసాకు అలాగే సెయింట్‌హుడ్ దక్కింది. ఈ సవోనరోలాకు కూడా అలాటిది యిచ్చి పీయాన్యోనీని తమలో కలుపుకుందామని ఆయన ఆలోచించాడు.

అయితే 1492లో లొరెంజో మెడిచీ మరణంతో తగ్గిన మెడిచీ కుటుంబపు ప్రాభవం అతని వారసుల పలుకుబడితో పుంజుకుని, పోప్‌ల సహాయంతో 1512 నాటికి ఫ్లారెన్స్ పాలనను చేజిక్కించుకుంది. వాళ్లు యీ పీయాన్యోనీల బలాన్ని క్షీణింపచేశారు. 1527లో మెడిచీలు కొద్దికాలం పాటు అధికారం కోల్పోయారు కానీ 1530లో పోప్ తన సైనికులను పంపి, మెడిచీ పాలనను పునరుద్ధరింప చేశాడు. అంతేకాదు, సవోనరోలా సద్దు మణిగాక, పోప్‌లు రినైజాన్స్ చిత్రకారుల చేత, శిల్పకారుల చేత వాటికన్‌లోనూ, యితర చర్చిల్లోనూ అనేక బొమ్మలు వేయించుకున్నారు, శిల్పాలు చేయించుకున్నారు. మైకెలాంజిలో. రఫేల్ వంటి వారు చిరకాల ఖ్యాతి గడించడానికి దోహదపడ్డారు.

ఏది ఏమైనా పోప్‌ వ్యవస్థను ఎదిరించిన సవోనరోలా మార్టిన్ లూథర్ వంటి ప్రొటెస్టంట్లకు ఆదర్శంగా నిలిచాడు. లూథర్ స్వగ్రామంలో సవోనరోలా విగ్రహాన్ని ప్రతిష్ఠాపించారు. అతని రచనలు జర్మనీ, స్విజర్లాండ్, ఫ్రాన్స్‌లలో ప్రాచుర్యం పొందాయి. పోప్ వ్యవస్థపై ఆగ్రహం పెరిగిన కొద్దీ యితని ఆరాధన పెరిగింది. జీవించి ఉండగా మహిమను ప్రదర్శించలేక శిక్ష అనుభవించిన యితనికి మహిమలు ఉన్నాయని జనాలు నమ్మసాగారు. ఇదంతా చూసి 1558లో అప్పటి పోప్ సవోనరోలా ఆర్థోడాక్స్ చర్చికి వ్యతిరేకం కాదని, కాథలిక్ చర్చి వ్యవస్థపై విశ్వాసం కలవాడని ప్రకటించాడు. పీయాన్యోనీ యిప్పుడు కాథలిక్ చర్చిలో ఒక శాఖగా మిగిలింది. ప్రస్తుత వాటికన్ అతనికి బీటిఫికేషన్ యిద్దామా అని కూడా ఆలోచిస్తోందట.

ఇది సవోనరోలా కథ కాగా, అతను మెడిచి యుగం నాటి కళారూపాలపై చేసిన దాడి అనేక మంది చిత్రకారులను, గేయకారులను భయపెట్టింది. కార్నివాల్ (జాతర)లలో అప్పటిదాకా పాడే అశ్లీలాన్ని స్ఫురింప చేసే జానపద శైలి గేయాలను నిషేధించి, వాటి స్థానంలో సవోనరోలా, అతని మిత్రుడు బెనివియెన్నితో కలిసి మతప్రధానమైన గేయాలు ప్రవేశపెట్టాడు. అతని మరణానంతరం కూడా అవే పాడసాగారు. “వీనస్ జననం” వంటి విలాసవంతమైన, శృంగార భరిత పౌరాణిక చిత్రాన్ని గీసిన సాండ్రో బొట్టిసెల్లి అనే చిత్రకారుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

అతని చిత్రాలేవీ వానిటీస్ బాన్‌ఫయర్లలో దగ్ధం కాలేదు కానీ అతను సవోనరోలా ప్రభావానికి లోనైనట్లు అతని తరువాతి చిత్రాలు స్పష్టంగా తెలియజేస్తాయి. వీనస్ బొమ్మలో కనిపించే అందం, శృంగారం తదుపరి బొమ్మల్లో కనబడకపోగా తీవ్రమైన భక్తి, బాధాతప్తమైన వ్యక్తీకరణ ఎక్కువగా దర్శనమిచ్చాయి. “మడోన్నా అండ్ చైల్డ్ విత్ ది యంగ్ సెయింట్ జాన్”లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వీటి మధ్యలో “ది కేలమ్నీ (ఆఫ్ ద ఏపిల్స్)” వంటి చిత్రాలు వచ్చాయి. ఇది నేరుగా మతపరమైనది కానప్పటికీ, భావం నైతికంగా సరైనది. కాబట్టి ఇది సవోనరోలా అనుయాయులకు ఆమోదయోగ్యమై బతికిపోయింది. ఇవి వేసేటప్పుడే అతను రహస్యంగా అనేక ధనిక కుటుంబాల స్త్రీలకు వారి నగ్నచిత్రాలను వేసి పెట్టాడని చరిత్రకారులు చెప్పారు.

చిత్రకారుడికి సృష్టిలో అందమైనది ప్రతీదీ ఆరాధనీయమే. కానీ మోరల్ పోలీసింగ్‌తో, మత విశ్వాసాల పేరు చెప్పి అతన్ని భయభ్రాంతుణ్ని చేస్తే కళ దెబ్బ తింటుంది. మధ్యయుగాల యూరోప్‌లో యిటువంటి అంధశకాలు చోటు చేసుకున్నాయి. భావస్వేచ్ఛను, స్వతంత్ర వ్యక్తీకరణను చర్చి కానీ, మతం పేరుతో కొందరు బోధకులు కానీ అణచివేశారు. మెడిచీ వంటి వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారస్తులు – ఏ కారణం చేతనైనా కానీయండి – కొత్త రకం చిత్రకారులు, శిల్పకారులు, కళాకారులు ప్రభవించడానికి, ఎదగడానికి ఆర్థికంగా చేయూత నిచ్చి దోహదపడ్డారు. కానీ దానికి విఘాతం కలిగించడానికి యీ మతశక్తులు, రాజకీయ శక్తులు ప్రయత్నించి కొంత మేరకు సఫలీకృతులయ్యారు. ఈ ఆధునిక యుగంలో కూడా యిలాటి ప్రయత్నాలు ఏదో ఒక మేరకు సాగుతూండడం గమనించినప్పుడు మధ్య యుగాల నుంచి మనం ఎంత దూరం వచ్చామా అనేది సింహావలోకనం చేసి చూసుకోవడం అవసరమనిపిస్తుంది. (ఫోటో – ‘బర్త్ ఆఫ్ వీనస్’, (బొట్టిసెల్లి), ‘స్కూల్ ఆఫ్ ఏథెన్స్’ (రఫేల్), ‘కేలమ్నీ’ (బొట్టిసెల్లి), ‘క్రియేషన్ ఆఫ్ మ్యాన్’ (మైకెలాంజెలో)

– ఎమ్బీయస్ ప్రసాద్

mbsprasad@gmail.com

19 Replies to “ఎమ్బీయస్‍: పాపపరిహారార్థం కళోద్ధరణ”

  1. ఇలాగ రాసుకుంటూ పోతే… ప్రతి వీధి మీద వీధికొక వ్యాసం రాయొచ్చు…

    1. అవునండి, కాదేదీ కవిత కనర్హం.. అన్నట్లు, దేని గురించైనా రాయవచ్చు, కొత్త విషయాలు తెలుసుకుందామనే ఆసక్తి కల పాఠకులున్నంత కాలం….

      గుడుగుడుగుంచంలా తమకు తెలిసిన విషయాలలోనే పడి కొట్టుకునే వారికి యివన్నీ బోరు. కానీ ఒక సంగతిని ఎవరైనా రచయిత పరిచయం చేయగానే తమంతట తాము యింకా తెలుసుకోవాలని అన్వేషించే వారున్నంత కాలం జ్ఞానం వర్ధిల్లుతూనే ఉంటుంది.

      దీనిలో మైకెలాంజెలో, ద విన్చి, రఫేల్ గురించి చదివి, వారి బొమ్మలు ఎలా ఉంటాయో చూదామనే కుతూహలం కలిగేవారు కూడా కొందరుంటారు. నేనూ అలాటి వాణ్నే కాబట్టి, యింత సమాచారం సేకరించాను. నా కంటె తెలివైనవారు యింకా ఎక్కువగా సేకరిస్తారు.

      ఉత్తర రామ చరితంలో భవభూతి ఏమన్నాడో తెలుసా? ‘నేను రాసేది కొందరికి ప్రస్తుతానికి నచ్చకపోవచ్చు. కానీ నచ్చేవాళ్లు ఎప్పుడో, ఎక్కడో ఉంటారు, కాలం అవధి లేనిది, భూమి సువిశాలమైనది’ అంటూ ‘కాలః హి అయం నిరవధిః విపులా చ పృథ్వీ’ శ్లోకం చెప్పాడు. ‘కభీ న కభీ, కహీఁ న కహీఁ, కోయీ న కోయీ..’ అంటూ సాగుతుంది ఓ హిందీ పాట. వ్యాస రచయితదీ అదే ఆశావహదృక్పథం.

      1. అవును… కాదేదీ కళకు అనర్హం… ఈ లాజిక్ తొటే కోటానుకోట్ల యూట్యూబ్ చానల్స్, రీల్స్ వదులుతున్నారు

        ఒకే ఒక మాటతో…” నచ్చితే చూడండి… లేకపోతే మానేయండి…మా ఇష్టం”

        1. కోటానుకోట్ల రీల్స్ వదిలినా, దేనికదే. వదలడం వారి యిష్టం, చూడకుండా వదిలించుకోవడం మన యిష్టం.

          ఈ పర్టిక్యులర్ వ్యాసం మీకు నచ్చిందా, లేదా అన్నదే యిక్కడ ప్రశ్న. పైన రియాక్షన్లలో పర్శంటేజిలు చూస్తున్నారుగా! జిహ్వకో రుచి. ఒకరికి నచ్చింది కాబట్టి మరొకరికి నచ్చాలని లేదు.

          నాకు నచ్చలేదు కాబట్టి రచయిత యిలాటివి రాయనక్కరలేదనీ, వీడియో వాళ్లు రీల్స్ చేయనక్కరలేదనీ అనుకుంటే అదీ కరక్టు కాదు.

    1. పోలిక కరక్టు కాదు. పోప్ వంటి వ్యవస్థ హిందూమతంలో లేదు. పీఠాధిపతుల ఆధిపత్యం చాలా పరిమితం.

  2. Power star Pavan Kalyan movies quiz: https://youtu.be/4Nm6OTKSNm4

    Megastar Chiranjeevi movies quiz: https://youtu.be/crQfuH0Tywc

    Mega power star Ramcharan movies quiz: https://youtu.be/QEsrbd6Fd1Y

    Nata Simham Balakrishna movies quiz: https://youtu.be/9hMcgg-fAig

    Mass Maharaja Raviteja movies quiz: https://youtu.be/T5f-eUANVMo

    NagaChaitanya movies quiz: https://youtu.be/9O_bjjU14qM

    Natural star Nani movies quiz: https://youtu.be/GHX1gGNRCvE

    Mahesh babu movies quiz: https://youtu.be/ciiIRnisQdE

    JrNTR movies quiz: https://youtu.be/nWNhnOQYo40

    AlluArjun movies quiz: https://youtu.be/dBIx1lMS6hY

    Prabhas movies quiz: https://youtu.be/KmHULtleqMg

  3. ఆఫ్గనిస్తాన్ లో బుద్ధుడి ప్రతిమ లని కూలగొట్టడం , భారత దేశం లో స్థానిక ఆరాధన పద్ధతుల విగ్రహాల్ని, గుళ్ళ నీ నాశనం చేయడం కూడా ఈ వినాశన ఆలోచన పద్ధతి లోకీ వస్తుంది ఏమో.

    1. మన కి వ్యతిరేకం గా ఉన్నది మొత్తం నాశనం చేయి, నేను తప్ప వేరే ఆరాధన పద్ధతుల దైవ విరుద్ధం అన్న అబ్రహం మత ఆలోచన ల వలన వచ్చిన దే ఈ నాశనం చేసే ఆలోచనలు.

      నలంద లో పుస్తకాలు తగలబెట్టిన విధానం ,

      జనరల్ డయ్యర్ అనేవాడు, పబ్లిక్ మైదానం లో ఉన్న జనాల మీద ఓపెన్ ఫైర్ చేసిన ఆలోచనలు అన్ని కూడా అబ్రహం మత మూలలు లో నుండి వచ్చినవే.

      1. డయ్యర్‌ చర్య వలసవాద విధానంలో భాగం. దీనిలో కలపవద్దు.

        మీరు ప్రస్తావించినవాటికి బౌద్ధ ఆరామాలు ధ్వంసం చేయడం, జైన విగ్రహాలను హిందూ విగ్రహాలుగా మార్చడం, శైవ-వైష్ణవ కలహాలు యివన్నీ కలపవచ్చు. కానీ భారతదేశపు రంధిలో పడితే చర్చ పక్క దారి పడుతుంది. ఇక్కడితో ఆపుదాం.

        పోప్ వ్యవస్థలో చాలా అక్రమాలు జరిగాయి. అవన్నీ రికార్డు అయ్యాయి కూడా. మతం వ్యవస్థీకృతం అయినప్పుడు యిలా జరగడం సహజం. మన దేశంలో యిప్పటికీ స్వామీజీలు చేసే అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అయినా వారి భక్తులు పెరుగుతూనే ఉంటారు.

  4. నమ్మకం, విశ్వాసాల పేరుతో ప్రజలు అజ్ఞానంలో మునిగిపోతున్నారు. పరిశీలనా, ప్రశ్నించే శక్తులను కోల్పోతున్నారు. మతం అనేది ఒక వినోదం అయిపొయింది.

    1. వినోదం అనడం కంటె ఆయుధంగా కొందరు వాడారు, యింకా వాడుతున్నారనేది కరక్టు మాట

  5. బైబిల్ కధలు లాంటి genre లో కొత్త సిరీస్ రాయండి సర్ .. మీ సిరీస్ మేము మిస్ అవుతున్నాము ..

  6. Sir, Please explain the motto / reason behind those who supported and encouraged art and those who didn’t.

    What could be their thoughts / interests in doing so.

    1. Pl note this redemption (పాప ప్రక్షాళన) factor is relevant only to Florence during renaissance period. Art has been encouraged all over the world for millenniums for various reasons.

    1. Vatican need not have private army for crusades sake. Many countries participated in them with their own armies. Vatican always ran like an empire with several intrigues and involvement in politics of different countries.

Comments are closed.