2013 రౌండప్‌ – వినోదానికే పట్టాభిషేకం

ప్రపంచంలోని సినీ ప్రియులంతా తమ తమ చిత్రాల నుంచి ఏమి ఆశిస్తారో, ఎలాంటి సినిమాలైతే ఆదరిస్తారో మనకి అనవసరం. తెలుగు సినిమా ప్రేక్షకులు అయితే ఇప్పుడు సినిమా నుంచి ఆశిస్తున్నది ఒకే ఒక్కటి. ‘వినోదం’……

ప్రపంచంలోని సినీ ప్రియులంతా తమ తమ చిత్రాల నుంచి ఏమి ఆశిస్తారో, ఎలాంటి సినిమాలైతే ఆదరిస్తారో మనకి అనవసరం. తెలుగు సినిమా ప్రేక్షకులు అయితే ఇప్పుడు సినిమా నుంచి ఆశిస్తున్నది ఒకే ఒక్కటి. ‘వినోదం’… టికెట్‌పై వెచ్చించిన పైకానికి సరిపడా ‘కాలక్షేపం’. ఇవి సినిమాలో ఉంటే, ‘సూసిందే సూడబుద్దేత్తంది’ అంటూ మళ్లీ మళ్లీ చూసేసి కోట్లు కట్టబెట్టేస్తున్నారు. అవి కానీ మిస్‌ అయ్యాయంటే ‘చూసే ప్రసక్తే లేదు’ అని తిప్పి కొట్టేస్తున్నారు. 

సినిమాలో ధృవ తారలున్నా, పేరు కూడా తెలియని యువ తారలున్నా… వినోదానికి లోటు లేదంటే పనులు మానుకుని వచ్చి సినిమా చూసేస్తున్నారు. అది లేదంటే మాత్రం ఎంత పెద్ద తారలున్నా కానీ మాకు వేరే పనులున్నాయని థియేటర్ల ఛాయలకి కూడా పోవడం లేదు. ‘‘సినిమా సరికొత్తగా తీసాం, టెక్నికల్‌గా అద్భుతాలు చేసాం’’ అని చెప్పుకుంటే… ‘అయితే మాకేంటి?’ అని నిక్కచ్చిగా అడిగేస్తున్నారు. సినిమాలో కామెడీ బాగుంటే, వినోదం పుష్కలంగా ఉంటే… యాభై కోట్లతో తీసినా, ఒకటిన్నర కోట్లతోనే తీసినా మన ప్రేక్షకులకి ఫరక్‌ పడదు. 

సాంకేతికంగా అద్భుతంగా ఉంటే ‘ఔరా’ అంటూ వచ్చి నోళ్లు తెరిచి చూసేయరు. వినోదం పుష్కలంగా ఉంటే ఇంట్లో పైరసీ డివిడి చూసి సంతృప్తి పడరు. మీ పాట్లేదో మీరు పడండి… మాకు కావాల్సిన వినోదం మాకిచ్చేయండి అని 2013లో కూడా తెలుగు సినీ ప్రియుడు క్రిస్టల్‌ క్లియర్‌గా మెసేజ్‌ పంపించాడు. హిట్‌ అయిన సినిమాల లిస్ట్‌ చూస్తేనే ప్రేక్షకులకి ఏమి కావాలనేది సుస్పష్టంగా తెలుస్తోంది. ఫ్లాప్‌ సినిమాల జాబితా పరికిస్తే వాటిలో ఏది మిస్‌ అయిందనేది కొట్టొచ్చినట్టు హైలైట్‌ అవుతోంది. 

ధృవతారలున్నా, యువ తారలైనా కానీ వినోదానికే పట్టం కట్టారు. కామెడీ బాగుందని టాక్‌ వచ్చిన సినిమాలే రాజ భోగాన్ని దక్కించుకున్నాయి. గత ఏడాదికీ, ఈ ఏడాదికీ తెలుగు ప్రేక్షకుడి ఆలోచనా విధానంలో, అతని దృష్టి కోణంలో ‘సినిమా’ అనే సాధనంలో ఎలాంటి మార్పూ లేదు. ఎప్పటికి మన వాళ్ల ‘ఐడియా ఆఫ్‌ సినిమా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ మారుతుందనేది ఇప్పుడే చెప్పలేం కానీ ఖచ్చితంగా మరి కొన్నేళ్ల వరకు అయితే మాత్రం ఆడియన్స్‌కి ‘ఎంటర్‌టైన్‌మెంట్‌’ స్టేపుల్‌ డైట్‌. ఆ హీరో, ఈ హీరో అని సంబంధం లేకుండా తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈజ్‌ కింగ్‌’. అది ఉన్న సినిమాలు ‘రూలతాయి’… లేనివి ‘రాలతాయి’!

ఇక ఈ ఏడాది వచ్చిన విజయాల చిట్టా వివరాల్లోకి వెళితే…

సూపర్‌ సిక్స్‌

ఈ ఏడాది కమర్షియల్‌గా టాప్‌ సిక్స్‌ ప్లేసెస్‌లో నిలిచిన బెస్ట్‌ సినిమాల లిస్ట్‌లో అయిదు పక్కా ఫార్ములాతో, తెలుగు సినిమా ప్రేక్షకులకి కావాల్సిన వినోదంతో నిండినవే. ముందుగా పవన్‌కళ్యాణ్‌ ‘అత్తారింటికి దారేది’ ఒక ‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’ రియల్‌ స్ట్రెంగ్త్‌ అండ్‌ స్టామినా ఏమిటో చూపించింది. భారీ ఛేజింగులు, పెద్ద పెద్ద పోరాట దృశ్యాలు ఉంటేనే కొన్ని ఏరియాల్లో సినిమాలు ఆడతాయి అనే గుడ్డి నమ్మకాన్ని ఈ చిత్రం తుడిచి పెట్టేసింది. సీడెడ్‌లాంటి పక్కా మాస్‌ ఏరియాలో ఈ చిత్రం పదిన్నర కోట్ల రూపాయల షేర్‌ సాధించి ఎంటర్‌టైనర్‌కి క్లాసు, మాసు అనే తేడా లేదని సుస్పష్టం చేసింది. ఆ ఏరియా, ఈ ఏరియా అనే తేడా లేకుండా యూనివర్సల్‌గా, యునానిమస్‌గా సక్సెస్‌ అయిన ఈ చిత్రం అల్టిమేట్‌గా తెలుగు సినిమా చరిత్రలో నంబర్‌వన్‌ హిట్‌ కైవసం చేసుకుందంటే అందులో ఆశ్చర్యం లేదు. ఒక స్టార్‌ హీరో, మంచి పాటలు, అందమైన హీరోయిన్లు, పిడికెడు యాక్షన్‌, గుప్పెడు సెంటిమెంట్‌, గంపెడు హాస్యం… చరిత్ర సృష్టించడానికి ఈ మిశ్రమం చాలని, వేరే ఏదో అద్భుతాలు, ఆణిముత్యాలు అక్కర్లేదని ‘అత్తారింటికి దారేది’ నిరూపించింది. 

కామెడీ, సోకాల్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువ లేకుండా బిగ్‌ హిట్‌ అయిన సినిమాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఓ విధంగా ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రానికి ఆ లోటు తీర్చే అంశాలు మరికొన్ని కలిసొచ్చాయి. మహేష్‌బాబు స్టార్‌ పవర్‌కి తోడు, ఈ తరానికి తొలి సిసలైన మల్టీస్టారర్‌ సినిమా అనే ముద్ర దీనికి ప్లస్‌ అయింది. నిజానికి ఈ చిత్రం చరిత్ర సృష్టించేస్తుందని అంచనా వేసారు. కానీ యాభై కోట్ల పైచిలుకు వసూళ్లతో నిలిచిపోయిందంటే అందుకు కారణం తెలుగు ప్రేక్షకుడికి కావాల్సిన వినోదం డోసు సరిపడా లేకపోవడమే అనేది కాదనలేని వాస్తవం. కథానుసారం దర్శకుడు ఎమోషనల్‌గా చిత్రాన్ని నడిపించాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కూడా చోటు కల్పించి ఉంటే ఈ చిత్రం రేంజ్‌ ఎంత పెరిగేదో ఈ చిత్రం తీసిన వాళ్లకి కూడా బాగా తెలుసు. 

ప్రేక్షకులు మెచ్చిన చిత్రానికి సీజన్‌తో పని లేదని ‘మిర్చి’ ఘన విజయం రుజువు చేసింది. సంక్రాంతి సందడి అయిపోయిన తర్వాత డల్‌ ఫిబ్రవరిలో రిలీజ్‌ అయిన మిర్చి కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. అంచనాలని మించి ఆడిన ఈ చిత్రం బయ్యర్లకి లాభాల పంట పండిరచింది. రెండు ఊళ్ల మధ్య వైరం అనే రొటీన్‌ పాయింట్‌కి ఒక పవర్‌ఫుల్‌ మాస్‌ హీరోని జత చేసి హీరోయిజం పండిస్తే ‘కమర్షియల్‌ ఫార్ములా` ఎప్పుడూ వర్కవుట్‌ అవుతుందని మిర్చి స్పష్టం చేసింది. కథ చెప్పడంలో చాతుర్యం ప్రదర్శిస్తే, హీరో జనం మెచ్చిన వాడుంటే కొత్త కథలేమీ అక్కర్లేదని, అదే కథని మళ్లీ చెప్పినా కానీ ప్రేక్షకులు శాటిస్‌ఫై అయిపోతారని ఈ చిత్రంతో ఇంకోసారి ప్రూవ్‌ అయింది. 

కమర్షియల్‌ సినిమా సూత్రం బాగా తెలిసిన, దానిని చాలా సార్లు సరిగ్గా వాడగలిగిన దర్శకుల్లో వినాయక్‌ ముందుంటాడు. ‘నాయక్‌’తో మరోసారి యాక్షన్‌+కామెడీ+హీరోయిజమ్‌ ఫార్ములాని కరెక్ట్‌గా మిక్స్‌ చేసిన వినాయక్‌ దీంతో రామ్‌ చరణ్‌ని మాస్‌కి మరింత దగ్గర చేసాడు. రొటీన్‌ సినిమా, కామెడీ తప్ప ఏమీ లేదు, ఇలాంటి సినిమాలు చూసి ప్రేక్షకులు విసిగిపోయారు… షరా మామూలుగా క్రిటిక్స్‌ గోల చేసారు. కానీ ఈ చిత్రం సంక్రాంతికి కలెక్షన్లు కొల్లగొట్టింది. స్ట్రాంగ్‌ అపోజిషన్‌ని తట్టుకుని ‘ఎంటర్‌టైన్‌మెంట్‌’ బలం ఏమిటో బల్ల గుద్ది చాటింది. 

కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌కి శ్రీను వైట్ల తనదైన మార్కు మిశ్రమం ఒకటి తయారు చేసుకున్నాడు. ‘ఢీ’నుంచి ప్రతి సినిమాలో దానిని వాడుతూ వచ్చాడు. మధ్యలో కొన్ని కొన్ని మిస్‌ ఫైర్‌ అయినా కానీ వైట్ల ఫార్ములాకి ఇంకా కోట్లు కూడగట్టే సత్తా ఉందని ‘బాద్‌షా’తో ప్రూవ్‌ అయింది. ఎన్టీఆర్‌లాంటి మాస్‌ హీరో నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేసే ‘హీరోయిజమ్‌’ కొంచెం తగ్గడం వల్ల యాభై కోట్ల మార్కుని చేరుకోలేకపోయింది కానీ కామెడీకి ఉన్న కమర్షియల్‌ పవర్‌ ఏమిటనేది మాత్రం బాద్‌షా కూడా ఎలుగెత్తి చాటి చెప్పింది. 

‘టైమ్‌పాస్‌ ఎంటర్‌టైనర్స్‌’కి మహరాజులాంటి రవితేజ కొంతకాలం పాటు జడ్జిమెంట్‌ మిస్‌ అయ్యాడు. రవితేజతో మినిమమ్‌ గ్యారెంటీ సినిమా తీస్తే వర్కవుట్‌ అయిపోతుందనేది గతంలో ఎన్నో సినిమాలతో క్లియర్‌గా తెలిసింది. అతని సినిమాల నుంచి రికార్డులు, దిక్కులు పిక్కటిల్లే వసూళ్ల ప్రభంజనాలు ఎవరూ ఆశించరు. రవితేజ సినిమాకెళ్తే రెండు గంటలు కాలక్షేపం అయిందా లేదా అనేది ఒక్కటే పట్టించుకుంటారు. మలినేని గోపీచంద్‌ దీనిని గుర్తుంచుకుని ‘బలుపు’ తీసాడు. ఫలితంగా రవితేజకి తన కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ దక్కింది. ఫ్లాప్‌ల ప్రవాహానికి కూడా అడ్డుకట్ట పడిరది. 

ఫెంటాస్టిక్‌ ఫైవ్‌!

స్టార్‌ హీరోలున్న ఆ ఆరు సినిమాలతో పాటు జస్ట్‌ హీరోలు, బడ్డింగ్‌ హీరోలు ఉన్న మరో అయిదు చిత్రాలు కూడా ఈ ఏడాది విజయాన్ని రుచి చూసాయి. తన బలం ఏమిటో తెలుసుకున్నవాడికి విజయం ఆటోమేటిగ్గా దక్కుతుంది. ఇంతకాలం తనది కాని జోన్‌లోకి వెళ్లి ఎలాగైనా నిరూపించుకోవాలని చూసిన నితిన్‌కి జ్ఞానోదయం అయింది. అందుకే సిక్స్‌ ప్యాక్‌లు, యాక్షన్‌ ఫీట్లు మానేసి పూర్తిగా తన బలానికి కట్టుబడిపోయాడు. ఫలితంగా ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది వచ్చిన బెస్ట్‌ ఎంటర్‌టైనర్స్‌లో టాప్‌లో నిలుస్తుందీ చిత్రం. స్టార్స్‌ లేని సినిమాల్లో ఈ ఇయర్‌ ఇరవై కోట్ల మార్కు దాటిన ఏకైక చిత్రమిదే. మీడియం బడ్జెట్‌ చిత్రాల్లో బ్లాక్‌బస్టర్‌ స్టేటస్‌ని పొందింది ‘గుండె జారి..’. 

వయసుకి మించిన యాక్షన్‌ చేసి ‘దడ’, ‘బెజవాడ’తో ఖంగు తిన్న నాగచైతన్య ఈసారి డోస్‌ తగ్గించి బిలీవబుల్‌ క్యారెక్టర్‌ చేసాడు. కమర్షియల్‌ సినిమాల మాస్టర్‌ అయిన తమిళ డైరెక్టర్‌ లింగుస్వామి తీసిన ‘వేట్టయ్‌’ని రీమేక్‌ చేసి ‘తడాఖా’ చూపించాడు. చైతన్య, సునీల్‌ కాంబినేషన్‌… ‘అన్నదమ్ముల అనుబంధం’ నాటి నుంచీ ఉన్న సక్సెస్‌ ఫార్ములాని సక్సెస్‌ఫుల్‌గా ట్యాప్‌ చేసింది. 

అడల్ట్‌ కంటెంట్‌తో తన కెరీర్‌కి ఫౌండేషన్‌ వేసుకున్న మారుతి ఈసారి ‘హారర్‌ కామెడీ’తో హిట్‌ కొట్టాడు. హిలేరియస్‌ కామెడీతో ఒక సాధారణ కథతో కోట్లు రాబట్టుకున్నాడు. ‘ప్రేమకథా చిత్రమ్‌’ ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌. అత్యంత లో బడ్జెట్‌లో, అతి సాధారణ మేకింగ్‌ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌తో స్కోర్‌ చేసింది. 

‘కొత్తగా ఉంది’ అనిపించుకుని సక్సెస్‌ అయిన సినిమా ‘స్వామి రారా’. దర్శకుడు సుధీర్‌ వర్మ ప్రతిభావంతుడని మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ సక్సెస్‌కి కూడా ప్రధాన కారణం ఎంటర్‌టైన్‌మెంట్‌. సినిమా కొత్తగా ఉన్నా కానీ వినోదాన్ని దర్శకుడు అస్సలు మిస్‌ కాలేదు. ఇదే చిత్రాన్ని సీరియస్‌గా తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కొత్తదనంతో కూడా వినోదాన్ని పండిరచవచ్చు, విజయాన్ని సాధించవచ్చు అని స్వామిరారా కొత్త దర్శకులకి దిక్సూచిలా నిలిచింది. 

వినోదాన్ని మిస్‌ కాకుండా ప్రేక్షకులకి కావాల్సిన కాలక్షేపం అందిస్తే మౌత్‌టాక్‌తోనే బ్రహ్మాండమైన విజయం అందుకోవచ్చునని ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ స్పష్టమైన సందేశం పంపించింది. బయ్యర్లకి మంచి లాభాలు తెచ్చి పెట్టిన ఈ చిన్న చిత్రంతో పరిచయమైన దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రేక్షకుల మెప్పునే కాక పరిశ్రమ నమ్మకాన్ని కూడా గెలుచుకున్నాడు. 

గత దశాబ్ధంలో వచ్చిన భారీ విజయాల్ని, ఈ సంవత్సరం వచ్చిన ఫలితాల్ని బట్టి ప్రేక్షకులు కోరుకుంటున్నది ఏమిటనేది తెలుసుకోవడానికి ఇలాంటి ఆర్టికల్సో, లేదా పెద్ద పెద్ద రీసెర్చిలో అవసరం లేదు. సినిమా అనేది అంతిమంగా వ్యాపారం. లాభ నష్టాలే చివరిగా కౌంట్‌ అయ్యేది. కాబట్టి ప్రేక్షకుల్ని బలవంతంగా మార్చాలని చూడకుండా, వారికి తగ్గట్టుగా కొంచెం మారి, వారికి అందించేది అందిస్తూ, ఇటు తమ పరిధిలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తే విజయాలు వాటంతట అవే వస్తాయి. సినిమా ఫలితం క్షణాల్లో మారుమూల ప్రాంతాలకి చేరిపోతున్న ఈ సాంకేతిక యుగంలో ఎలాంటి ఛాన్స్‌ తీసుకోవడానికి లేదు. నెమ్మదిగా టాక్‌ బెటర్‌ అయి స్లీపర్‌ హిట్స్‌ కొట్టే అవకాశం అస్సల్లేదు. హిట్టా, ఫట్టా… మార్నింగ్‌ షో పూర్తయ్యేసరికి జాతకాలు ఎస్‌ఎంఎస్‌ల్లో తేలిపోతున్నాయి. ఫలితాలు గంటల్లో రివ్యూల్లో తేటతెల్లమవుతున్నాయి. ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు సినిమా అసలు రంగుని వ్యక్తిగత అభిప్రాయాలతో ప్రపంచానికి చేరవేస్తున్నాయి. మొదటి ఆటకి ‘బాగుంది’ అనే ఆ టాక్‌ రావాలంటే ప్రేక్షకుడికి కావాల్సింది ఇవ్వడమే తప్ప ఇంకో ఆల్టర్‌నేటివ్‌ ఏదీ లేదు మరి. 

2013 టాప్‌ ఫిలింస్‌కి గ్రేట్‌ఆంధ్ర రేటింగ్స్‌:

అత్తారింటికి దారేది3.5/5
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు3.25/5
మిర్చి 3/5
నాయక్‌ – 3.25/5
బాద్‌షా – 3.25/5
బలుపు – 3/5
గుండెజారి గల్లంతయ్యిందే – 3.25/5
తడాఖా – 3/5
ప్రేమకథా చిత్రమ్‌ – 3.25/5
స్వామిరారా – 3/5
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ – 3/5

– గణేష్‌ రావూరి

[email protected]

twitter.com/ganeshravuri