వీడని చిక్కుల్లో దేవయాని?

పని మనిషిని అమెరికాకు తీసుకెళ్ళే విషయంలో వీసా నిభందనలు అతిక్రమించారనే ఆరోపణపై గత వారం అమెరికలో అరెస్టైన దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగడే  ఇప్పుడు కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆమెను బయటకు తీసుకు రావడానికి దౌత్య…

పని మనిషిని అమెరికాకు తీసుకెళ్ళే విషయంలో వీసా నిభందనలు అతిక్రమించారనే ఆరోపణపై గత వారం అమెరికలో అరెస్టైన దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగడే  ఇప్పుడు కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆమెను బయటకు తీసుకు రావడానికి దౌత్య పరంగా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నప్పటికీ మరో వంక  ఆమె ఈ కేసులో మరింత ఇరుక్కున్నారు.  తన పనిమనిషి కుటుంబ సభ్యులను దేవయాని బంధువులు బెదిరిస్తున్నారని తాజా  ఆరోపణ.  ఇది కాకుండా అర్హత లేకున్నాముంబైలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్ పొందడం రెండవది. సుశీల్ కుమార్ షిండే ముఖ్య మంత్రిగా వున్న రోజుల్లో మహారాష్ట్ర  ప్రభుత్వంలో పని చేసిన ఉత్తమ్ ఖోబ్రగడే కుమార్తె దేవయాని.  అప్పుడే ఫ్లాట్ పొంది వుంటారు.  దేవయాని ఖోబ్రగాదే ఇంట్లో పనిమనిషి సంగీతా రిచర్డ్స్‌ను  భారత్‌కు వెనక్కి తీసుకు రావాలంటూ తమపై ఒత్తిడి తేవడంతో తాము చాలాసార్లు భయపడిపోయామని  సంగీతా రిచర్డ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంగీత కుటుంబాన్ని భయపెట్టే సంఘటనలు చాలా జరిగాయని , దేవయాని తండ్రి చాలాసార్లు తనకు ఫోన్ చేసి తన భార్య భారత్‌కు తిరిగి వచ్చేలా చేయాలని బెదిరించాడని సంగీత భర్త ఫిలిప్ తనకు చెప్పినట్లు ఆమె కుటుంబానికి సన్నిహితుడైన ఒక వ్యక్తి తెలిపారని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో రాశారు.  మరో సందర్భంలో  సంగీత భర్తను భారత్‌లో పోలీసులు అమెరికాలో ఆమె ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించినట్లు కూడా ఆ వార్త పేర్కొంది. ఇవన్నీ చూస్తుంటే ఆమె పై కేసును మరింత బిగుతుగా చేయడానికే అ    మెరికా ప్రయత్నిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

ఇదిలా వుంటే, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ వ్యవహారంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు సహా పలువురు రాజకీయ నేతలు చట్టంలోని నిబంధనలను ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించారని కుంభకోణంపై దర్యాప్తు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిషన్ తన నివేదికలో అభిశంసించింది. కార్గిల్ వీరులకు, మృత వీరుల కుటుంబాలకు కేటాయించాల్సిన ఫ్లాట్లను అక్రమంగా అనర్హులకు బీనామి పేర్లపై కేటాయించినట్లు నివేదికలో తెలిపారు. కమిషన్ నివేదికను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికారంలో ఉన్నవారు ప్రవర్తించిన తీరును తీవ్రంగా దుయ్యబట్టిన కమిషన్, కుంభకోణం ఒక దుష్ట సంప్రదాయానికి తెరదీసిందని, దీంతో సంబంధించిన వారి దురాశ, బంధుప్రీతి, ఆశ్రీత పక్షపాతానికి అద్దం పట్టిందని పేర్కొంది. సొసైటీకి చెందిన మొత్తం 102మంది సభ్యుల్లో 25మంది అనర్హులని, 22మంది బినామీ పేర్లతో ప్లాట్‌లు కొనుగోలు చేసారని కూడా నివేదిక పేర్కొంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జెఏ పాటిల్ నేతృత్వంలోని దర్యాప్తు కమిషన్ ఈ ఏడాది ఏప్రిల్ 18న ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా, శుక్రవారం దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు విలాస్‌రావు దేశ్‌ముఖ్, సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవాన్, మాజీ రెవిన్యూ మంత్రి శివాజీ రావు, నీలంగేకర్ పాటిల్, రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మాజీ మంత్రులు సునీల్ తత్కరే, రాజేష్ తోపే వంటి ప్రముఖుల అండదండలు ఆదర్శ్ హౌసింగ్ సొసైటీకి ఉన్నాయని కూడా నివేదిక పేర్కొంది. కుంభకోణంలో సిబిఐ చార్జిషీటు దాఖలు చేసిన ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఒక్కరే కాగా, ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి రాష్ట్ర గవర్నర్ కె శంకర్ నారాయణన్ కొద్ది రోజుల క్రితం సిబిఐకి అనుమతి ఇవ్వలేదు. సొసైటీలో ఫ్లాట్స్ పొందడానికి అర్హులుకారని కమిషన్ పేర్కొన్న వారిలో ఎన్‌సిపికి చెందిన అసెంబ్లీ మాజీ స్పీకర్ బాబా సాహెబ్ కుపేకర్, శివసేన ఎంపి సురేష్ ప్రభు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు చెందిన ముగ్గురు బంధువులు, తప్పుడు వీసా సమాచారం ఆరోపణలపై అమెరికాలో గతవారం అరెస్టయిన భారత దౌత్య అధికారి దేవయాని ఖోబ్రగడే ఉన్నారు.

 ఇదిలా వుంటే దర్యాప్తు కమిషన్ నివేదికను తిరస్కరించాలని మహరాష్ట్ర ప్రభుత్వం ని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రివర్గం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. అయితే మంత్రివర్గ నిర్ణయం ప్రజా ప్రయోజనాల కోసం ఎలా అవుతుందనే విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ప్రవేశపెట్టడం గమనార్హం.