‘అంతన్నాడింతన్నాడే గంగరాజు.. ముంతమామిడి పండన్నాడే గంగరాజు.. అస్కన్నడు బుస్కన్నడే గంగరాజు..’ అన్నట్టుగా తయారయ్యింది, ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్ జిల్లాలో పురావస్తు శాఖ తవ్వకాల పరిస్థితి. శోభన్ సర్కార్ అనే సాధువు చెప్పగానే, ప్రభుత్వం కదిలిపోయి, రాంభక్ష్సింగ్ కోటలో పురావస్తు శాఖకు ఆదేశాలు జారీ చేయడం, పురావస్తు శాఖ ముందూ వెనుకా చూసుకోకుండా తవ్వకాలకు దిగడం తెల్సిన విషయాలే.
ఇంతా చేసి, అక్కడేమీ దొరకలేదు. వారం రోజులకు పైగా తవ్వకాలు జరిపితే, బుద్ధుడి కాలం నాటి బొచ్చెలు.. అనగా పాత్రలు మాత్రమే దొరికాయట. ఓ పురాతనమైన ఇల్లు కూడా బయటపడిందని పురావస్తు శాఖ చెబుతోంది. లక్షలు వెచ్చించి తవ్వకాలు జరిపాక, ఏదో ఒకటి దొరికిందని చెప్పాలి కదా మరి అన్నట్టుంది పరిస్థితి.
వెయ్యి టన్నుల బంగారం అక్కడ వుందని శోభన్ సర్కార్ సెలవిచ్చాడు. ఒకప్పటి రాజుగారు తన కలలోకి వచ్చాడని, కలలో వెయ్యి టన్నుల బంగారం గురించి చెప్పాడని శోభన్ సర్కార్ చెప్పడంతో ప్రభుత్వ పెద్దల్లో అత్యాశ బయల్దేరింది. సాధువు చెప్పడమేంటి, తవ్వకాలు జరపడమేంటన్న ఇంగితం కూడా లేకుండా దేశమంతా ముక్కున వేలేసుకుంటున్నా పాలకులు తవ్వకాలకు ఆదేశాలు జారీ చేసేశారు.
ఇప్పటికన్నా మూఢ నమ్మకాల విషయంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడమనే ప్రక్రియను కాస్త పెట్టి, అధికారంలో వున్నవారికి మూఢ నమ్మకాల విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడితే బావుంటుందేమో.!
మొత్తమ్మీద, ఏమీ దొరకలేదని తెలిశాక నిరాశా నిస్పృహలతో తవ్వకాలు నిలిపేశారు పురావస్తు శాఖ అధికారులు. వారిలోనూ ప్రభుత్వం తీరుపట్ల అసహనం వ్యక్తమవుతోందంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.