అంతర్యుద్ధంలో ఎల్‌టిటిఇని పూర్తిగా మట్టుపెట్టిన శ్రీలంక ప్రభుత్వం యిచ్చిన మాట ప్రకారం తమిళుల ప్రాబల్యం వున్న ఉత్తర శ్రీలంకలో ప్రాదేశిక కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించింది. యుద్ధానంతరం శ్రీలంక ప్రభుత్వం యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ ఎలయన్స్ (యుపిఎఫ్‌ఏ) అనే కూటమిని అధికారంలో నిలిపి వాళ్ల ద్వారా ఆ ప్రాంతాలన్నిటిలో అభివృద్ధి పనులు చేపట్టింది. అయితే మొత్తం 38 సీట్లలో యుపిఎఫ్‌ఏకు 20% ఓట్లు వచ్చాయి కానీ సీట్లు మాత్రం ఏడే వచ్చాయి. శ్రీలంక ముస్లిం కాంగ్రెసుకు ఒకటి వచ్చింది. తమిళ్ నేషనల్ అలయన్స్ (టిఎన్‌ఏ) పేర వెలసిన ఐదు పార్టీల కూటమి 28 సీట్లు గెలుచుకుని, బోనస్‌గా మరో రెండు పొంది, మొత్తం 30 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతోంది. ఎల్‌టిటిఇ ఆవిర్భావానికి ముందు తమిళ హక్కుల కోసం అహింసాయుతంగా, ప్రజాస్వామ్యపద్ధతుల్లో పోరాడిన టెలో (తమిళ ఈలం లిబరేషన్ ఆర్గనైజేషన్), ఇపిఆర్‌ఎల్‌ఎఫ్ (ఈలం పీపుల్స్ రివల్యూషనరీ లిబరేషన్ ఫ్రంట్), తుల్ఫ్ (తమిళ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్) మరో రెండు సంస్థలు కలిసి యీ అలయన్సును ఏర్పరచాయి. వారిలో వారు తగవులాడుకునే వారే కానీ వారందరూ కలిసి విఘ్నేశ్వరన్ అనే రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జిని తమ చైర్మన్‌గా ఎన్నుకుని ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.
ఈ కూటమిపై ఓటర్లందరికీ నమ్మకం ఏర్పడడానికి విఘ్నేశ్వరన్ యిమేజే కారణం. ఆయన ఏ గ్రూపుకీ చెందని మేధావి. ముక్కుసూటిగా మాట్లాడతాడు. శ్రీలంక సార్వభౌమత్వంలోనే తమిళప్రాంతం స్వతంత్ర ప్రతిపత్తి సాధించాలని, దానికై శ్రీలంకను పాలించే మహేంద్ర రాజపక్షతో పొత్తు పెట్టుకున్నా తప్పులేదనీ ఆయన అంటాడు. ‘‘తమిళనాడు రాజకీయనాయకులు మా వ్యవహారాల్లో కలగజేసుకోకుండా వుంటేనే మంచిది. మా పేరు చెప్పి వాళ్లు వాళ్ల ఎన్నికలలో ఓట్లు దండుకుంటున్నారు. ఆ తర్వాత కూరలో కరివేపాకులా మమ్మల్ని తీసిపారేస్తున్నారు. వారి ప్రలాపాల వలన స్థానిక సింహళీయులు మాపై కత్తి కడుతున్నారు.’’ అని మొగమాటం లేకుండా చెప్పాడు. ఇలాటి నిక్కచ్చి మనిషి కేంద్రప్రభుత్వాన్ని నేర్పుతో ఒప్పించి తమ ప్రాంతానికి అధికారాలు సాధిస్తాడని, 50 వేలమంది వితంతువులు, 12 వేల మంది అనాథలు వున్న తమ ప్రాంతానికి వెలుగు చూపుతాడని ఓటర్లు భావించారు. చూదాం ముందుముందు ఏం జరుగుతుందో!
– ఎమ్బీయస్ ప్రసాద్