ఎమ్బీయస్‌: కెసియార్‌ గడుసుదనం – 1/2

ప్రత్యేక తెలంగాణ బీజం తెరాస వేసినా, దాన్ని పోషించి, పెద్దది చేసినది కాంగ్రెసు పార్టీలోని అంతర్గత కలహాలే. ఆంధ్ర నాయకులను అదుపు చేయడానికి తెలంగాణ కాంగ్రెసు నాయకులు తెరాసను దువ్వుతూ వచ్చారు. కెసియార్‌కు నీరసం…

ప్రత్యేక తెలంగాణ బీజం తెరాస వేసినా, దాన్ని పోషించి, పెద్దది చేసినది కాంగ్రెసు పార్టీలోని అంతర్గత కలహాలే. ఆంధ్ర నాయకులను అదుపు చేయడానికి తెలంగాణ కాంగ్రెసు నాయకులు తెరాసను దువ్వుతూ వచ్చారు. కెసియార్‌కు నీరసం వచ్చి తెరాస దుకాణం కట్టేసే టైములో కేకే, ఎమ్మెస్సార్‌ కలిసి పన్నాగం పన్ని కరీంనగర్‌కు ఉపయెన్నిక తెచ్చి కెసియార్‌కు మళ్లీ ఊపిరి పోశారు. అలాగే కెసియార్‌ నిరాహారదీక్ష టైములో కూడా ఆయనకు ప్రాణంమీదకు వచ్చిందంటూ హంగామా చేసి డిసెంబరు 9 ప్రకటన వచ్చేట్లు చేశారు. ఆ నాటి కెసియార్‌ ఆరోగ్యస్థితి ఎలా వుందో చెప్పాలంటూ నిమ్స్‌ వారిని రికార్డులు అడిగితే వాళ్లు మాట్లాడరు. గోనె ప్రకాశరావుగారు సేకరించి వుంచానంటారు. ఎప్పుడు బయటపెడతారో తెలియదు. ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రజలు విభజన కోరుకుంటున్నారని, విభజిస్తే వాళ్లూ సంతోషించి సోనియాపై కీర్తనలు పాడతారనీ టి-కాంగ్రెసు వారు ఆవిణ్ని నమ్మించారు. అందుకే డిసెంబరు 9 ప్రకటన వచ్చింది. తీరా చూస్తే సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ‘అబ్బే, అదంతా చంద్రబాబు పన్నాగం. రాజకీయప్రేరితం. సామాన్యజనాలు విభజనే కోరుతున్నారు.’ అంటూ మళ్లీ పాట మొదలుపెట్టారు. మూడున్నరేళ్లు యిదే పాట సాగింది. 

‘విభజన చేస్తాం కానీ దానివలన మనకు రాజకీయప్రయోజనం ఏమిటి?’ అని అడిగారు సోనియా. ‘డిసెంబరు 9 ప్రకటన తర్వాతనే తెలంగాణ ఉద్యమానికి ఊపు వచ్చింది. ఆ ప్రకటన చేసినది మన పార్టీయే కాబట్టి ఆ ఘనతంతా మనకే దక్కుతుంది. తెలంగాణ ప్రజలంతా మీ ఫోటోను కళ్లకద్దుకుంటారు’ అని చెప్పారు సోనియాకు. ‘కెసియార్‌ మాటేమిటి? ఉద్యమసారథిగా ఆయనా వాటాకు వస్తాడు కదా’ అని సోనియా సందేహిస్తే, ‘మీరు తెలంగాణ ప్రకటన చేయండి చాలు. ఆయన్ను పట్టుకుని వచ్చి మీ చెంత పడేస్తాం.’ అని హామీలు గుప్పించారు. ఆ మేరకు అడపాదడపా కెసియార్‌ చేత ప్రకటనలు కూడా చేయించారు. ‘తెలంగాణ సాధనే మాకు ముఖ్యం. దానికోసం ఎవరినైనా సరే ముద్దాడుతాం.’ అని. ఆఫర్‌ బాగానే వుంది కదాని సోనియా చివరకు జులై 30 న తెలంగాణ యిచ్చేస్తున్నాం అని ప్రకటించారు. ఆ ప్రకటన చేసేటప్పుడే తెరాస విలీనం గురించి జర్నలిస్టులు దిగ్విజయ్‌ను అడిగారు. ‘మా పని మేం చేశాం, ఆయన మాట ఆయన నిలబెట్టుకోవాలి’ అన్నట్టు దిగ్గీ చెప్పారు. ‘దీని గురించి మేము వేరే విజ్ఞప్తి ఏమీ చేయం, తన బాధ్యత గుర్తెరిగి ఆయనే వచ్చి మాతో కలవాలి’ అనే అర్థం వచ్చింది. 

తన పాత్ర గురించి కెసియార్‌కు ఏ అవగాహన వుందో తెలియదు కానీ, జులై 30 గడచి మూణ్నెళ్లు అవుతున్నా కెసియార్‌ విలీనం చేయలేదు సరికదా, అసలా అవసరం ఏముంది అన్నట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ సాధనతో సరిపెడతామన్నవారు, యిప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు. నిర్మాణం తర్వాత మేన్‌టెనెన్స్‌ వుంటుంది. తలిదండ్రులు సృష్టించి వదిలిపెట్టయరుకదా, పిల్లవాణ్ని పెంచి, పెద్ద చేసి, తన కాళ్ల మీద నిలదొక్కుకునేదాకా కనిపెట్టుకునే వుంటారు. ఆ తర్వాత కూడా పట్టించుకోకుండా వుండరు. కాస్త స్వేచ్ఛనిచ్చినట్టే యిచ్చి నక్కినక్కి చూస్తూంటారు. తెలంగాణ విషయంలోనూ తన కనుసన్నల్లో నుండి దాటిపోకుండా చూద్దామని జనకుడు కెసియార్‌ ఉద్దేశం. పొరుగు రాష్ట్రాలతో కొట్లాడైనా తెలంగాణ ప్రయోజనాలను కాపాడగల రక్షకుడిగా వుండాలంటే, తనను తెలంగాణకు మాత్రమే పరిమితం చేసుకోవాలి. కాంగ్రెసు, బిజెపి, వైకాపా, టిడిపిలకెతే యితర ప్రాంతాలనూ దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసిన బాధ్యత వుంటుంది. విభజన తర్వాత జలవివాదాలు రావడం తథ్యం. అబ్బే, ఎందుకు వస్తాయి, కమిటీలు వుంటాయి, బోర్డులు వుంటాయి అంటూ కబుర్లు చెపుతున్నారు కొందరు. ప్రస్తుతం బాబ్లీలో ఏం జరిగిందో చూడండి. కోర్టులో వివాదం నడుస్తూండగానే సరే, మహారాష్ట్ర కట్టిపారేసింది. ‘తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడతాం లెండి’ అని ఓ హామీ యిచ్చిందంతే. నిస్సహాయస్థితిలో కోర్టు ‘హామీ యిచ్చిందిగా’ అంటూ మనల్ని సర్దుకోమన్నారు. 

రేపు ఆంధ్ర విషయంలో తెలంగాణలో కూడా యిదే జరగదన్న భరోసా ఏముంది? ఇంతకంటె ఎక్కువగా జరగడానికే ఆస్కారం వుంది. రాజకీయంగా ఒత్తిళ్లు తెచ్చి అలా జరగకుండా చూడాలంటే యిరుప్రాంతాల్లో సొంత ప్రయోజనం వున్న పార్టీలు మాత్రమే కాస్త జాగ్రత్తగా మాట్లాడతాయి. ‘బెళగాం మహారాష్ట్రలో కలవాల్సిందే’ అని శివసేనంత తీవ్రంగా మహారాష్ట్ర కాంగ్రెసు అనలేదు. ఎందుకంటే కర్ణాటకలో కూడా కాంగ్రెసు యూనిట్‌ వుంది కదా. అందుకని సన్నాయినొక్కులు నొక్కి వూరుకుంటుంది. బాబ్లీ గురించి టిడిపి చేసినంతగా కాంగ్రెసు చేయకపోవడానికి కారణమేమిటంటే టిడిపికి మహారాష్ట్ర యూనిట్‌ లేదు, కాంగ్రెసుకి వుంది. 2009  డిసెంబరు 9 తర్వాత చిరంజీవి సమైక్యంవైపు పూర్తిగా మొగ్గిపోయారు. తన ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ యూనిట్‌ పూర్తిగా దెబ్బ తిన్నా పట్టించుకోలేదు. ఆయన అదే పార్టీని కొనసాగించి, అవసరమైనపుడు కాంగ్రెసును ఆదుకుంటూ, తన ప్రత్యేకతను నిలుపుకుని వుంటే జులై 30 తర్వాత సీమాంధ్రలో ఆయన్ను మించిన హీరో వుండేవాడు కాడు. అయితే కాంగ్రెసులో చేరడం చేత ఆయన ఆ అడ్వాంటేజి పోగొట్టుకున్నాడు. ఎందుకంటే కాంగ్రెసుకు తెలంగాణలో కూడా యూనిట్‌ వుంది. 

తెలంగాణ ప్రయోజనం కాపాడగల సత్తా మాకే వుంది అంటూ మూడు, నాలుగు పార్టీలు చెప్పుకుంటూ వుంటే తమను తాము వీరతెలంగాణ వాదులుగా చూపుకోవాలంటే ‘ఆంధ్ర మిగులు విద్యుత్‌ మనకు అమ్మలేదు కాబట్టి, నీళ్లు ఆపేద్దాం’ వంటి నినాదం యిది ప్రజలను రెచ్చగొట్టాలి. అలాటి నినాదం యివ్వాలంటే తెలంగాణ ప్రాంతీయపార్టీగానే వుండాలి. రెండు, లేక ఎక్కువ రాష్ట్రాలలో వునికి వున్న జాతీయ పార్టీలో చేరకూడదు. అందుకే కెసియార్‌ కాంగ్రెసులో చేరడానికి ఉత్సాహంగా లేరు. ఈ రోజు చిరంజీవి పరిస్థితే రేపు కెసియార్‌ది అవుతుంది. ‘మనకు ఆంధ్రలో యూనిట్‌ కూడా ముఖ్యమే కదా, వాళ్లనూ తృప్తి పరచాలి కదా’ అంటూ సోనియా సీమాంధ్రులకు యిచ్చే కన్సెషన్లను ఆమోదించవలసిన యిబ్బంది కలుగుతుంది. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఎంతకాలం వుంచాలి, హైదరాబాదు సరిహద్దులు ఏ మేరకు వుండాలి, హైదరాబాదు శాంతిభద్రతల పరిరక్షణ ఎవరి చేతిలో.. యిలాటి అనేక విషయాలలో కాంగ్రెసు దృక్పథం, తెరాస దృక్పథం భిన్నంగా వుంటాయి. అది సహజం. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు అని యివాళ అంటున్నారు. ఈలోగా ఆంధ్ర రాజధాని తయారవ్వాలి. అనేక జలయజ్ఞం ప్రాజెక్టులు చూశాం. చెప్పిన గడువు కంటె రెండు, మూడు రెట్లు ఎక్కువ సమయం పడుతోంది. అలనాటి నాగార్జున సాగరే కాదు, యీనాటి పోలవరం కూడా చూస్తున్నాం కదా! గడువు పెరుగుతూనే పోతూంటుంది. ఆంధ్ర రాజధానీనిర్మాణం మాత్రం శరవేగంతో పూర్తవుతుందన్న గ్యారంటీ ఏముంది? ఈ ప్రభుత్వం అవసానదశలో వుంది. తమ ఆఖరి బజెట్‌లో ఎంత ఎలాట్‌ చేస్తారో తెలియదు. అది వచ్చే ప్రభుత్వం మన్నిస్తుందో లేదో తెలియదు. ఎంఎంటియస్‌, రైల్వే కొత్త లైన్లు.. అన్నిట్లోనూ యిదే ధోరణి చూశాం. పదేళ్ల గడువు పెంచాలి అని కాంగ్రెసు నిర్ణయిస్తే కెసియార్‌ ఔననాల్సిందే కదా. ఇప్పుడు విడిగా పార్టీ కాబట్టి రెండు, మూడేళ్లు చాలు. ఉమ్మడి రాజధాని అనక్కరలేదు, తాత్కాలిక రాజధాని అనండి చాలు.. ఇలా ఎంత కటువుగానైనా మాట్లాడవచ్చు. (సశేషం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2013)

mbsprasad@gmail.com