సినిమాయే లోకమైన రెండు కల్పిత పాత్రలు మాట్లాడుకునే సరదా కబుర్లే తప్ప కించపరచడానికో, చిన్నబుచ్చడానికో… ఎగతాళి చేయడానికో, అపహాస్యం కోసమో రాసింది కాదు. గ్రేట్‌ఆంధ్రలో బాగా పాపులర్ అయిన ఫీచర్ ‘కృష్ణానగర్ కుర్రాళ్లు’ ఇప్పుడు మాట్లాడుకుంటున్న టాపిక్ ‘మసాలా’… వాళ్లేం మాట్లాడుకుంటున్నారో మీరే చూడండిక..!
బాలు: హ్హ హ్హ హ్హ… ఓహ్హొహ్హొహ్హొ… హ్హా హ్హ హ్హా హ్హా…
శీను: ఏంట్రా ‘కామెడీ కార్నర్’ యాంకర్‌లా… కారణం లేకుండా నవ్వుకు ఛస్తున్నావ్…
బాలు: అది కాదు బా… నిన్న రాత్రి చూసిన సినిమా గుర్తొచ్చి నవ్వొచ్చేత్తంది (మళ్లీ నవ్వులు)
శీను: అంత గుర్తు చేసుకుని నవ్వుకునే సినిమా ఏం చూసావేంటి?
బాలు: మసాలా…
శీను: అదేం సినిమా?
బాలు: వెంకీ రామ్ కా మసాలా… బా!
శీను: ఏంటి ఆళ్లిద్దరూ ‘మసాలా’ ప్యాకెట్స్ కంపెనీ పెట్టారా… లేదంటే ఏదైనా మసాలా బ్రాండ్‌కి అడ్వర్‌టైజింగ్ చేస్తున్నారా?
బాలు: వెటకారమా… రిలీజ్ రోజున ఫోన్ చేస్తే సినిమా చూస్తున్నా అని చెప్పావ్!
శీను: ఓప్ అదా… ఇప్పుడు గుర్తొచ్చిందిలే…
బాలు: ఏంట్రా చూసి వారం కూడా కాలేదు… అప్పుడే మర్చిపోయావా?
శీను: రోజులు తరబడి గుర్తెట్టుకునే బొమ్మా అది? టైమ్ బాగోనపుడు కొన్ని చూడాల్సొస్తుంది. చూసి దులిపేసుకోవాలి కానీ గుర్తెట్టుకుని దుప్పటి తన్నేయకూడదు!
బాలు: మరీ అలా అంటావేంట్రా… కామెడీ అంత బాగుంటేనూ!
(శీను ఎగా దిగా చూసాడు)
బాలు: ఆ లుక్కేంట్రా… బొమ్మ బాగుంది కదా. నాకైతే ఇప్పటికీ నవ్వొచ్చేత్తుంది… (మళ్లీ నవ్వులు)
శీను: నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది
బాలు: ఇంత జాలీగా ఉన్నోడ్ని చూసి జాలి పడ్డమేంటి బా…
శీను: ఒరేయ్ పిచ్చోళ్లని ఎప్పుడైనా చూసావా… ఎప్పుడూ నవ్వుకుంటూనే ఉంటారు. వాళ్లని చూసి జాలి పడతామా, జాలీగా ఉన్నాడని సంతోషపడతామా?
బాలు: ఏడిసావ్ ఎదవకనా… అసలు కామెడీ ఎంజాయ్ చేయలేకపోతున్న నీ బాడీలో ఏవో సెల్స్ మిస్ అయినట్టున్నాయ్. చెక్ చేయించుకో!
శీను: ఆ కుళ్లు జోకులకి కూడా నవ్వొచ్చి ఉంటే తప్పకుండా చెక్ చేయించుకునే వాడ్నిలే…
బాలు: అసలు ఆ పాయింట్ ఎంత బాగుందో చూడు. అబద్ధం ఆడి దొరక్కుండా ఉండడానికి రామ్ ఎంత బాగా మేనేజ్ చేస్తాడో చూడు… అబ్బబ్బబ్బబ్బా… ఇంకోసారి చూడాలి బా!
శీను: పుట్టిన దగ్గర్నుంచి ఎన్ని సినిమాలు చూసావ్‌రా?
బాలు: యావరేజ్‌గా ఒక రెండేలు చూసుంటా…
శీను: రెండు వేలలో ఇలాంటి సినిమాలు కనీసం రెండొందలైనా లేవా?
బాలు: మనం చాలా సార్లు మాట్టాడుకున్నదేరా… కథలు కొత్తవేం ఉండవు. అవే తిప్పి తిప్పి తీస్తుంటారు… అదేం తప్పు కాదు!
శీను: ఛా… మరేదో అద్భుతం చూసినట్టు తల్చుకుని తల్చుకుని నవ్వేసుకుంటున్నావేంటి?
బాలు: వెంకటేష్ ఇంగ్లీష్ డైలాగ్స్ గుర్తొచ్చి నవ్వుకున్నారా… నీకు అవి కూడా నచ్చలేదా?
శీను: బట్లర్ ఇంగ్లీష్‌తో నవ్వించడం… చాలా కొత్త కాన్సెప్ట్. ఫస్ట్ టైమ్ చూసాం కదా!
బాలు: ఎల్లెహే… అన్నిటికీ. అసలు ఇద్దరు హీరోలు ఒక సినిమాలో ఉన్నారంటేనే పైసా వసూలు. అది చాలు సినిమాకి!
శీను: ఆ సంగతి తెలీక ఎక్కడ్నుంచో రీమేక్ రైట్స్ కొనుక్కొచ్చి, పాటలెట్టి, డైలాగులు రాసి… కష్టపడ్డార్రా పాపం.
బాలు: ఎటకారాలు ఆపు కానీ… పాటలంటే గుర్తొచ్చింది. తమన్ ఇరగదీశాడురా!
శీను: ఇన్‌స్ట్రుమెంట్సేనా? అవునంట… నెక్స్‌ట్ సినిమాకి కొత్తవి ఆర్డరిచ్చాడంట!
బాలు: ఆ పాటలకేంట్రా… ఆడియో కూడా వినలేదు. డైరెక్ట్‌గా తెరమీద చూడ్డమే. అయినా కానీ చాలాసార్లు వినేసినట్టు ఈజీగా ఎక్కేసాయి. నువ్వేమంటావ్?
శీను: నేను అనేదేముంది. నువ్వే చెప్పావ్ కదా. చాలాసార్లు వినేసిన పాటల్లా ఉన్నాయని.
బాలు: క్యాచీ సాంగ్స్ అంటార్రా వాటిని…
శీను: వీళ్లు పాత సినిమా తీస్తుంటే నేను మాత్రం కొత్త పాటలు ఎందుకు చేయాలని అనుకుని ఉంటాడులే. తప్పు లేదు.
(హెడ్‌ఫోన్స్ బాలు చెవిలో పెట్టి… ఫుల్ వాల్యూమ్‌తో ఒక పాటేదో ప్లే చేశాడు శీను)
బాలు: (గావు కేక పెడుతూ… హెడ్ ఫోన్స్ తీసి విసిరికొట్టి) కొంచెముంటే చెవులు దొబ్బేవి… ఏం పాటరా అది..
శీను: మసాలా సినిమాలోదే!
(బాలు తడబడి.. సర్దుకుంటూ)
బాలు: ఆ.. ఆఁ… సినిమాలో చూస్తుంటే బానే అనిపించాయి మరి.
శీను: అది వాటి గొప్పతనం కాదురా… నీ ఎదవతనం. తెర మీద బొమ్మాడితే చాలు కదా నీకు.
బాలు: నాకు సినిమా చూడ్డం రాదంటావ్… థియేటర్లో జనాలు ఎలా నవ్వుతున్నారో తెల్సా?
శీను: ఏడవలేక నవ్వడం అంటారు… ఎప్పుడైనా విన్నావా?
బాలు: నువ్విలాగే ఏడుస్తూ ఉండు. అక్కడ కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయ్.
శీను: ఆఁ ఆఁ… అవునవును. బయ్యర్లని బాగానే కుమ్ముతుందంట.
బాలు: బ్యాడ్ సీజన్‌లో ఆ కలెక్షన్స్ అంటే మాటలు కాదు మరి…
శీను: సింగిల్‌గా వస్తేనే ఇలాగుందంటే… కాంపిటీషన్ ఉన్న సీజన్‌లో వచ్చుంటే సితికిపోయేది!
బాలు: కొన్ని సినిమాలు బాగున్నా జనం చూడట్లేదు బా…
శీను: అంటే అన్నానంటావ్ కానీ… కోవై సరళతో ఐటెమ్ సాంగులకి డాన్సులేయించడమేంట్రా?
బాలు: అది కామెడీ…! సీరియస్‌గా తీసుకుంటారా ఏంటి?
శీను: హాస్యానికీ.. హింసకీ తేడా తెలిస్తే… కలెక్షన్స్ మీద సీజనల్ ఎఫెక్టులుండవ్.
బాలు: అన్ని కామెడీ సినిమాలు తీసిన డైరెక్టర్‌కే ఏది హాస్యమో తెలీదంటున్నావా?
శీను: నేనెళ్లే సరికే టైటిల్స్ అయిపోయాయి. ఇంతకీ డైరెక్టర్ ఎవరు?
బాలు: మన విజయభాస్కర్
శీను: ఆయనెవరు?
బాలు: ఒరేయ్… నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి… డైరెట్టర్రా…
శీను: ఓప్ ఆయనా… ఇంకా సినిమాలు తీస్తున్నాడా?
బాలు: బాగా ఎక్కువైందిరా నీకు. ఆయన సినిమాలు తీయకపోవడం ఏంటి?
శీను: నువ్వు చెప్పిన లిస్ట్ కూడా పాత సినిమాల్దే కదా?
బాలు: అంటే ఆయన గుర్తు రావాలంటే ఆ సినిమాలే చెప్పాలి కదా.
శీను: కదా… అప్పట్లో గొప్పగా చెప్పుకునే సినిమాలు తీసిన డైరెక్టరు, ఇప్పుడు పేర్లు కూడా గుర్తుండని సినిమాలు తీస్తున్నాడన్నమాట.
బాలు: అన్ని సినిమాల మాటెలా ఉన్నా ఈమధ్యొచ్చిన సినిమాల్లో ఇది బాగానే తీసాడు మరి…
శీను: జిరాక్స్ మిషన్ మంచిది కొన్నట్టున్నాడు…
బాలు: జిరాక్స్ మిషనేంట్రా..! అన్నట్టు ఇద్దరు హీరోలే కాకుండా ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు. అది కూడా బోనస్సేగా బొమ్మలో!
శీను: ఇద్దరేంటి… ముగ్గురున్నారు కదా?
బాలు: ముగ్గురెక్కడ్రా… అంజలీ పాప, ఆరెంజ్ పాప.. అంతే కదా?
శీను: కోవై సరళ కూడా ఉందిగా!
బాలు: నీ… మరీ అంత కక్ష కట్టేశావేంట్రా? మసాలా సినిమా అంటే కొత్తగా ఉంటది, వెరైటీగా ఉంటది అని అర్థమా? రొటీన్ మసాలా అని!
శీను: అవునా… మరి అదే టైటిల్ పెట్టలేకపోయారా?
బాలు: నీలాంటి క్రిటిక్స్ అంతా హిందీలో బోల్‌బచ్చన్ వచ్చినప్పుడు ఇలాగే కామెడీ చేశారు. కానీ వంద కోట్లు కలెక్ట్ చేసింది.
శీను: అక్కడ వందొస్తే ఇక్కడ తక్కువలో తక్కువ ఫిఫ్టీ రావా అనేసుకుని ఉంటారు. ఫైనల్‌గా ఫిఫ్టీన్ కూడా రావంటగా! మన ఆడియన్స్ ఒక్కోసారి కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చేస్తార్రా. ఏది చేసినా చూసేస్తార్లే అనుకున్నప్పుడే… వాతెట్టి పంపించేస్తారు.
బాలు: నీకు చెప్పడం ఎవరి వల్ల అవుద్ది కానీ… నిన్నేదో సినిమా చూసా అని చెప్పావ్. ఏంటది?
శీను: విల్లా
బాలు: ఎలా ఉంది. చూడొచ్చా?
శీను: నీలాంటి ‘మసాలా’ బ్యాచ్‌కి ఎక్కే సినిమా కాదులే. కొంచెం బుర్రుండాలి
బాలు: నాకు బుర్ర లేదంటావా? రామ్‌గోపాల్‌వర్మ ఫాన్స్ బాబూ ఇక్కడ!
శీను: ప్రతోడికీ ఇదో ఫ్యాషనైపోయింది. వర్మ ఫాన్ అని చెప్పుకుంటే ఇంటిల్లిజెంట్ అనుకుంటారని అనుకుంటున్నారు.
బాలు: ఫ్యాషన్ ఏంట్రా? అసలు ‘సత్య 2’ సినిమాలో ఆ టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడూ…
శీను: సత్యా టూ ఆ… థూ! ఎక్కడా రామ్‌గోపాల్‌వర్మ ఫాన్‌నని చెప్పుకోకు. ఆయన గొప్పతనం నిజంగా తెలిసుంటే ఈ సినిమాకి డప్పు కొట్టడెవడూ!
బాలు: అది కాదు బా… అసలు సత్యా 2…
శీను: ఇంకోసారి ఆ పేరెత్తితే సంపేత్తానురోయ్. మళ్లీ హెడ్‌ఫోన్స్ చెవిలో పెట్టి మసాలా పాట ప్లే చేసేస్తాను ఏమనుకుంటున్నావో…
బాలు: అయ్‌బాబోయ్ వద్దురా బాబూ… ఎల్లిపోతన్నాను.
– గణేష్ రావూరి
Feedback at: