మంచిని ఆచరించమని.. నలుగురికీ సహాయపడమని.. ఇలాంటి మంచి మాటలే చెప్పారు సాయిబాబా. ‘నాకు గుడి కట్టండి.. వందలు, వేలు, లక్షలు.. విరాళాలుగా ఇవ్వండి..’ అని సాయిబాబా చెప్పలేదు కదా. మాంసాహారం తీసుకోమనీ సాయిబాబా చెప్పలేదు. సాయిబాబానే కాదు, ఇంకెవరూ తమకు అలా పూజలు చేయాలి.. ఇలా పూజలు చేయాలని చెప్పిన దాఖలాల్లేవు. భక్తుడి శక్తి మేర దేవుళ్ళను పూజించుకుంటారు. అందులో ఒక్కో భక్తుడు ఒక్కో విధానాన్ని అవలంభిస్తాడు.
‘నా కోరిక నెరవేరితే కోటి రూపాయలు విరాళమిస్తా..’ అంటాడు ఓ భక్తుడు. ‘నేను అనుకున్నది జరిగితే వజ్రాల కిరీటం సమర్పించుకుంటా..’ అంటాడు మరో భక్తుడు. మతం ఏదైనా, భక్తులు తమ కోరికల్ని రకరకాల రూపాల్లో దేవుడికి విన్నవించుకుంటారు. శక్తి మేరకు దేవుడికి విరాళాలు సమర్పించుకుంటారు. ఆ విరాళాలతో దేవుడేమీ పండగ చేసుకోడు కదా.. తిరిగి అది పూజారులకో, ప్రభుత్వాలకో చెందుతుందంతే.
సాయిబాబా విషయంలో గత కొంతకాలంగా పెద్ద దుమారమే రేగుతోంది. సాయిబాబా అసలు హిందూ దేవుడే కాదని ఓ వివాదం తెరపైకొచ్చింది. తాజాగా మాంసాహారి అయిన సాయిబాబా హిందూ దేవుడెలా అవుతాడని మరో వివాదం పుట్టుకొచ్చింది. మీడియా కనబడితే చాలు నోటికెలాంటి మాటలు వస్తే అలాంటి మాటలు మాట్లాడేయడం రాజకీయ నాయకులకు మాత్రమే చెల్లిన విద్య ఇప్పటిదాకా. ఇప్పుడు స్వామీజీలు, బాబాల అవతారమెత్తినోళ్ళు కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు.
వందలమంది కాదు, వేల మంది కాదు.. లక్షల మంది భక్తులున్నారు సాయిబాబాకి. సాయిబాబా మీద భక్తుల నమ్మకం అలాంటిది. సాయిబాబా దేవుడా.. గురువా.. ఇంకొకటా.. అన్నది ఆయా భక్తుల విశ్వాసాన్ని బట్టి వుంటుంది.. వారి నమ్మకాన్ని బట్టి వుంటుంది. దేవుడు.. అనడానికి సాక్ష్యమెలా దొరుకుతుంది.? నమ్మకాలకి రుజువులుండవు.. అది అనుభవం ద్వారానే తెలుస్తుందంటారు దేవుడ్ని నమ్మేవారెవరైనా.
మొత్తంగా చూస్తే సాయిబాబా పేరుని వివాదాల్లోకి తీసుకురావడం ద్వారా తమ స్థాయిని పెంచుకోవాలని చూస్తున్నారు కొందరు. కానీ, వాళ్ళకే అసలు విషయం తెలియడంలేదు.. వారి స్థాయిని వారే దిగజార్చేసుకుంటున్నారని.