బహుశా శతాబ్దాల నాగరికత, సంస్కృతుల ప్రభావం ఎలా ఉందంటే.. అమ్మాయిలు తమకు తగిన వాడు ఎవరని నిర్ణయించుకోలేనంతగా! భూమ్మీద అమ్మాయిల పెళ్లిళ్లు రెండే రకాలుగా ప్రధానంగా అవుతుండవచ్చు! అందులో ఒకటి.. తల్లిదండ్రులు చూసిన వాడిని చేసుకోవడం. రెండో పద్ధతి తమకు ప్రపోజ్ చేసిన వాడిని, లేదా తమ చుట్టూ అలిపి లేకుండా తిరిగిన వాడిని .. జాలితోనో, వాడికి ఆర్థిక శక్తి ఉండటం వల్లనో, అందంగా ఉన్నాడనో.. అన్నింటికీ మించి సరైన వయసులో, సరైన సమయంలో తమ చుట్టూ తిరిగాడు కాబట్టి.. వాడు ప్రేమిస్తున్నాడని అంటున్నాడు కాబట్టి.. వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం! ప్రధానంగా.. అంటే నూటికి వెయ్యికి 999 శాతం అమ్మాయిలకూ ఇదే తరహాలోనే పెళ్లిళ్లు జరుగుతూ జీవిత భాగస్వామి లభిస్తూ ఉండవచ్చు!
క్రమేపీ వందల సంవత్సరాల నుంచి ఇదే పద్ధతే కొనసాగుతూ ఉండటం వల్ల నిజంగా తాము ఎవరితో ఆనందంగా ఉండగలమో అలాంటి వాడిని అమ్మాయిలు పొందే ఆలోచన జ్ఞానాన్ని కూడా కోల్పోతూ ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అమ్మాయిల గురించి అయితే తల్లిదండ్రులు ఆలోచించాలి, వారి లెక్కలు చాలా వరకూ కమర్షియల్ గానే ఉంటాయి. ఆర్థికంగా ఉన్న కుటుంబం వాడిని, బాగా చదువుకుని ఉద్యోగం చేసేవాడైనా లేదా చదువు రాకపోయినా డబ్బు సంపాదిస్తున్నవాడిని చూసి వారు తమ కూతురికి పెళ్లి చేయడం చాలా సంప్రదాయక పద్ధతి.
మరి ఆ అబ్బాయి అమ్మాయికి నచ్చాడా అంటే.. నచ్చాడే. ఎందుకంటే తల్లిదండ్రులు చూపించారు కాబట్టి.. ఆర్థిక శక్తి ఉంది కాబట్టి. పోషించగలడు కాబట్టి నచ్చాడు. కారూబంగ్లా ఉంది కాబట్టి, విదేశానికి తీసుకెళ్లగలడు కాబట్టి నచ్చాడు. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఇలాంటి లెక్కపక్కలే తప్ప.. అన్నీ కుదిరాయి కాబట్టి, ఇక భర్తకాబట్టి ప్రేమించాలి, కుటుంబం కోసం కాపురం చేయాలి. ఇది సమాజం బాగా ఆమోదించిన పద్దతి.
ఇక ప్రేమ వివాహాలకూ గత కొన్నేళ్ల కాలంలో సామాజిక ఆమోదం దక్కింది. కులాంతర వివాహాలూ జరుగుతూ ఉన్నాయి. మరి ప్రేమ వివాహాల్లో కూడా ఎంత వరకూ అమ్మాయి నుంచి ఇన్షియేషన్ ఉంటుందనేది కొశ్చన్ మార్కే. కాలేజీలో కొత్తగా చేరాకా… లేదా కొత్తగా ఉద్యోగంలో చేరాకా.. చదువు పూర్తయ్యాకా ఉద్యోగాన్షేణలో ఉన్నప్పుడు.. ఇలా ఎక్కడైనా కొత్తగా ప్రస్థానం ప్రారంభం అయినప్పుడు, ఇన్ సెక్యూరిటీతో ఉన్నప్పుడు, కొత్త పరిసరాల్లోకి వెళ్లినప్పుడు… ఎవరో ఒక అబ్బాయి ఆమెను చూసి ఇష్టపడి.. ఆమెకు ప్రపోజ్ చేస్తే.. వాడికి ఆ అమ్మాయి ఓకే అనుకుంటే అక్కడో ప్రేమకథ మొదలవుతుంది.
మరి ఇలాంటి ఎక్కువ ప్రపోజల్స్ పొందిన అమ్మాయిలు.. వాటిల్లో ఒకదాన్ని ఛాయిస్ గా తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వెంట కనీసం సగటున అరడజను మందికిపైగా అబ్బాయిలే పడొచ్చు. ఆ ఐదారు మందీ ఆమెకు ఏదో ఒక సందర్బంలో ప్రపోజ్ చేసినా.. వారిలో ఒకరిని ఆమె ఛాయిస్ గా తీసుకోవచ్చు. ఇలా అయితే మాత్రమే అమ్మాయికి ఒక చాయిస్ ఉన్నట్టు. లేకపోతే తనను చూసి ప్రేమించిన వాడినో, లేక తల్లిదండ్రులు చూసి ఓకే చేసిన వాడినో చేసుకోవాలి. ఏతావాతా.. అరేంజ్డ్ మ్యారేజ్ లో అయినా, లవ్ మ్యారేజ్ లో అయినా.. అమ్మాయి తనకు నచ్చిన వాడిని పొందుతుందనే నమ్మకమేదీ లేదు!
ఈ రకంగా చూస్తే.. అమ్మాయే తనే ప్రపోజ్ చేయడం అంటే అది ప్రపంచ పోకడకు విరుద్ధమే! తన భర్తకు ప్రపోజ్ చేయాలి, లేదా తనకు ప్రపోజ్ చేసిన వాడికి ప్రపోజ్ చేయాలి.. అయితే ఇది గాక.. రిలేషన్ షిప్ లో ఇంకో గ్యాప్ మిగిలే ఉంది. అది అమ్మాయి కోరుకున్నవాడు. కమర్షియల్ గా మ్యారేజ్ తో పార్ట్ నర్ అయ్యే వాడు, తనను ప్రేమించాడు కాబట్టి.. తను ప్రేమించిన వాడు కాకుండా.. అమ్మాయి ప్రపోజ్ చేయాలనుకునే వాడు కూడా ఉంటాడు. అయితే వాడు ఆమెకు దక్కుతాడనుకోవడం మాత్రం ప్రశ్నార్థకం.
సామాజిక పరిస్థితులు, సెక్యూరిటీ.. వీటి వల్ల అమ్మాయే మొదట ప్రపోజ్ చేసే దాఖలాలు ఎక్కడా పెద్దగా కనిపించవు. ఏ ఫ్రెండ్షిప్ తోనో బాగా దగ్గరయిన వాడు బాగా నచ్చినా తనే మొదట చెబితే వాడేమనుకుంటాడో అనే బెరుకు. చిన్నబోతామనే భయం. ఇవన్నీ అతివను ఆపవచ్చు. మరి నిజంగానే అమ్మాయే మొదట ప్రపోజ్ చేస్తే ఏమవుతుంది? అని రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ ను అడిగితే.. ఆ బంధం చాలా బాగుంటుందనే అంటారు.
అమ్మాయి మొదట ప్రపోజ్ చేసిన బంధం దీర్ఘకాలం చాలా స్ట్రెంగ్తీగా ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. అబ్బాయి మొదట ప్రపోజ్ చేస్తే సాగే లవ్ స్టోరీ కన్నా.. అమ్మాయి మొదట అడిగే బంధం చాలా బాగుంటుందంటున్నారు. అబ్బాయిని అమ్మాయి చూడటమే నాన్సెన్స్ అన్నట్టుగా త్రివిక్రమ్ లాంటి వాళ్లు డైలాగుల్లో అర్థరహిత సందేశం ఇచ్చి ఉండొచ్చు. అయితే ప్రేమ అనేది అమ్మాయి వద్దనే మొదట మొదలయితే అది అనిర్వచనీయమైన గొప్పదని రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు!