సచిన్‌ జీవితం ఓ పాఠం

సచిన్‌ టెండూల్కర్‌.. భారత క్రికెట్‌కి సరికొత్త గుర్తింపును అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌, ఇకపై పాఠ్యాంశం కాబోతున్నాడు. తమ రాష్ట్రానికి చెందిన సచిన్‌ సాధించిన విజయాల నేపథ్యంలో, ఆయన క్రికెట్‌కి చేసిన…

సచిన్‌ టెండూల్కర్‌.. భారత క్రికెట్‌కి సరికొత్త గుర్తింపును అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌, ఇకపై పాఠ్యాంశం కాబోతున్నాడు. తమ రాష్ట్రానికి చెందిన సచిన్‌ సాధించిన విజయాల నేపథ్యంలో, ఆయన క్రికెట్‌కి చేసిన సేవలకు గుర్తింపుగా, సచిన్‌ను పాఠ్యాంశంగా చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దేశంలోని అత్యున్నత పురస్కారం భారతరత్న వరించిన తర్వాత, సచిన్‌కి దక్కిన మరో అరుదైన గౌరవం ఇది. క్రికెట్‌లో సచిన్‌ సాధించిన విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే సమయంలో, సచిన్‌ చుట్టూ ఈ మధ్య వివాదాలూ ఎక్కువైపోయాయి. ఓ రాజకీయ ప్రముఖుడు, సచిన్‌ ఊరికినే క్రికెట్‌ ఆడలేదనీ, అతనికి భారతరత్న ఇవ్వాల్సిన అవసరమేముందని ప్రశ్నించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. హాకీకి సేవలందించిన ధ్యాన్‌చంద్‌కి ఇవ్వకుండా, సచిన్‌కి భారతరత్న ఇవ్వడమేంటన్నది ఆయన ప్రశ్న.

విమర్శలు, వివాదాలెలా వున్నా.. క్రికెట్‌కి సచిన్‌ గుడ్‌ బై చెప్పిన వెంటనే భారతరత్న పురస్కారం ఆయనకు కేంద్రం ప్రకటించడం, మహారాష్ట్ర ప్రభుత్వం సచిన్‌ పేరుతో పాఠ్యాంశాన్ని తీసుకురావాలనే నిర్ణయానికి రావడం.. ఇవన్నీ రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయన్న అనుమానాలు సచిన్‌ అభిమానుల్లోనూ కలుగుతున్నాయి.

అనుమానాలు, విమర్శలు, వివాదాలు సర్వసాధారణమైపోయాయిప్పుడు. అయితే, సచిన్‌ వ్యక్తిత్వం.. క్రీడాకారుడిగా సచిన్‌ గొప్పతనం.. ఇవన్నీ భావితరానికి ఆదర్శప్రాయం.. అన్నది మాత్రం నిర్వివాదాంశం.