తె‘హెల్‌’కా కష్టాలు

ఒక్క స్టింగ్‌ ఆపరేషన్‌.. తెహెల్కా దశ మార్చేసింది. మీడియా ప్రపంచంలో రారాజుని చేసేసింది. కానీ, ఇంకో స్టింగ్‌ ఆపరేషన్‌ తెహెల్కా పరువు బజార్న పడేలా చేసింది. బీజేపీ నేత, రాష్ట్రానికి చెందిన బంగారు లక్ష్మణ్‌ని…

ఒక్క స్టింగ్‌ ఆపరేషన్‌.. తెహెల్కా దశ మార్చేసింది. మీడియా ప్రపంచంలో రారాజుని చేసేసింది. కానీ, ఇంకో స్టింగ్‌ ఆపరేషన్‌ తెహెల్కా పరువు బజార్న పడేలా చేసింది. బీజేపీ నేత, రాష్ట్రానికి చెందిన బంగారు లక్ష్మణ్‌ని తెహెల్కా స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా ఇరకాటంలో పడేసిన విషయం విదితమే. ఆ స్టింగ్‌ ఆపరేషన్‌ కారణంగా బంగారు లక్ష్మణ్‌ జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఆయన రాజకీయ జీవితానికీ సమాధి కట్టేసిందా ఘటన.

కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు కదా. అలాంటి స్టింగ్‌ ఆపరేషన్‌ ఇప్పుడు తెహెల్కా సంస్థను లీగల్‌ చిక్కుల్లో పడేసింది. తెహెల్కా ఇమేజ్‌ని పెంచిన తరుణ్‌ తేజ్‌పాల్‌, తన దగ్గర పనిచేసే జర్నలిస్ట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడనీ, లైంగిక వేధింపులకు గురిచేశాడన్నది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఈ ఘటనతో తెహెల్కా సంస్థ అప్రమత్తమయ్యింది. తరుణ్‌ తేజ్‌పాల్‌ని పక్కన పెట్టింది. ఆ వెంటనే అతనిపై ఆరోపణలు చేసిన జర్నలిస్టూ, తెహెల్కాకి గుడ్‌ బై చెప్పింది. తాజాగా, ఈ ఘటనలో తెహెల్కా మేనేజింగ్‌ ఎడిటర్‌ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. రేపేం జరుగుతుందో, అసలు ఈ వివాదం ఎక్కడికి వెళుతుందోగానీ, తెహెల్కా అసలు రూపం బయటపడిందనే కామెంట్స్‌.. తెహెల్కా బాధితుల నుంచి అప్పుడే వెల్లువెత్తుతున్నాయి.

తెహెల్కా మేనేజింగ్‌ ఎడిటర్‌ సోమా చౌదరి, తరుణ్‌ తేజ్‌పాల్‌కి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ప్రముఖంగా విన్పిస్తున్న విషయం విదితమే. కేసు విచారణలో భాగంగా తెహెల్కా మేనేజర్‌ సోమా చౌదరిని పోలీసులు ప్రశ్నిస్తే, కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం లేకపోలేదట.

ఏదిఏమైనా.. తుపాకీ పట్టుకున్నోడు తుపాకీకే బలవుతాడనీ, కత్తిని నమ్ముకున్నోడు కత్తికే బలవుతాడన్నట్టు.. తెహెల్కా ఇప్పుడు స్టింగ్‌ ఆపరేషన్‌కే బలైపోయేలా వుంది. ఓ వ్యక్తి ద్వారా ఓ వ్యవస్థ నాశనమైపోతుందా.? అంటే అన్ని సందర్భాల్లోనూ కాదుగానీ, కొన్ని సందర్భాల్లో అవునని అనాల్సి రావొచ్చు కూడా.