కెవి: మనసున్న సైంటిస్టు బ్లూమ్‌బర్గ్‌!

రోగం వచ్చాక చికిత్స చేయడం కంటె, రోగం రాకుండా నిరోధించే టీకాలను అభివృద్ధి చేయవలసిన అవసరం..

నాకు వచ్చిన పేరుప్రఖ్యాతులకు హెపటైటిస్‌-బి వాక్సిన్‌ కారణమని జగద్విదితం. హెపటైటిస్‌-బి అనే వైరస్‌ వుందని, దానికి వాక్సిన్‌ కనిపెట్టవచ్చని ఎవరైనా ఒక శాస్త్రజ్ఞుడికి తోచకపోతే నా కథ యిలా వుండేది కాదు కదా! బ్లూమ్‌బెర్గ్‌ అనే ఆ నోబెల్‌ గ్రహీత శక్తిసామర్థ్యాలతో పాటు గుణగణాలు, ఆయన నాతో మెలగిన తీరు.. యివన్నీ గుర్తుకు వస్తే ఒళ్లు పులకరిస్తుంది. 2011 ఏప్రిల్‌ 5న తనువు చాలించిన డా. బరూచ్‌. ఎస్‌. బ్లూమ్‌బెర్గ్‌ (1925-2011) హెపటైటిస్‌-బి వైరస్‌ కనుగొనడమే కాదు, ఆ వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్‌ను కూడా కనుగొన్న మహానుభావుడు. ఈ పరిశోధనకై ఆయనకు 1976లో వైద్యవిభాగంలో నోబెల్‌ బహుమతి లభించింది.

బ్లూమ్‌బెర్గ్‌ వైద్యశాఖలోకి వద్దామని అనుకోలేదు. హైస్కూలు చదువు అయిన తర్వాత తన 18 వ యేట అమెరికన్‌ నేవీలో డెక్‌ ఆఫీసరుగా చేరారు. 1946లో యుద్ధం నుండి తిరిగి వచ్చాక కొలంబియా యునివర్శిటీలో మ్యాథమాటిక్స్‌లో డిగ్రీ చదివారు. న్యాయవాద వృత్తిలో వున్న వాళ్ల నాన్నగారు యీయనను వైద్యవిద్యలో చేరమని ప్రోత్సహించారు. అక్కడే నాలుగేళ్లపాటు మెడిసిన్‌ అభ్యసించారు.

చదివే రోజుల్లోనే వాళ్ల పారాసైటాలజీ ప్రొఫెసర్‌ తన స్టూడెంట్స్‌ అందరినీ సురినామ్‌లోని ఓ పట్టణానికి తీసుకెళ్లి మెడికల్‌ క్యాంపులు నిర్వహించారు. అది గని కార్మికులుండే పట్టణం. ప్రపంచంలోని అనేక భాగాల నుండి – ముఖ్యంగా ఇండియా, జావా, ఆఫ్రికా వంటి ట్రాపికల్‌ ప్రాంతాల నుండి – వచ్చినవారు ఉండేవారు. మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులకు, వాటి చికిత్సకు ఒక్కొక్క జాతి ఒక్కొక్కలా ప్రతిస్పందించడం ఆయన దృష్టికి వచ్చింది. దానిపై రిసెర్చ్‌ చేసి తన తొలి పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.

తర్వాత రెండేళ్ల పాటు న్యూయార్కులోని బెల్లెవ్యూ ఆసుపత్రిలో పనిచేసినపుడు ఆయనకు చికిత్సకోసం పేదలు ఎదుర్కొనే కష్టాలు అవగతమయ్యాయి. న్యూయార్కులోని బీదాబిక్కీ అక్కడికే వచ్చేవారు. దీర్ఘవ్యాధులకు గురైన మధ్యతరగతి ప్రజలు కూడా చికిత్స కోసం, ఖర్చుపెట్టే క్రమంలో పేదవారిగా మారిపోవడం గమనించిన బ్లూమ్‌బెర్గ్‌ ఔషధాలను అందుబాటు ధరలలో అందించవలసిన సామాజిక బాధ్యతను గుర్తించారు. అంతే కాదు, రోగం వచ్చాక చికిత్స చేయడం కంటె, రోగం రాకుండా నిరోధించే టీకాలను అభివృద్ధి చేయవలసిన అవసరం గురించి ఆయన మనసులో గట్టిగా నాటుకుంది. అదే ఆయన దృక్పథాన్ని తీర్చిదిద్దింది.

ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో బయోకెమిస్ట్రీ విభాగంలో 1955 నుండి 57 వరకు ఆయన రిసెర్చి చేసి డాక్టరేటు తీసుకున్నారు. పరిశోధనకు ఆయన తీసుకున్న అంశం – హైల్యూరానిక్‌ ఏసిడ్‌ యొక్క బయో-కెమికల్‌ లక్షణాలు! అక్కడ పరిశోధన చేస్తూండగానే రిసెర్చి గైడ్‌ విదేశాలకు పంపించారు. ఈయన నైజీరియా వెళ్లి అక్కడి ప్రజల రక్తపు నమూనాలు తీసుకుని హెమోగ్లోబిన్‌ లోని సీరమ్‌ ప్రొటీన్స్‌ యొక్క పోలీమార్ఫిజమ్‌పై అధ్యయనం చేశారు. అప్పటి అనుభవం దరిమిలా ఆయన హెపటైటిస్‌-బి వైరస్‌ కనుగొనడానికి దోహదపడింది.

ఇంగ్లండ్‌ నుండి తిరిగి వచ్చి ఏడేళ్ల పాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో పనిచేశారు. పాలీమార్ఫిజమ్స్‌పై ఈయన చేసిన రిసెర్చి కారణంగా ఆ సంస్థలో జియోగ్రాఫిక్‌ మెడిసిన్‌ అండ్‌ జెనెటిక్స్‌ శాఖ ఏర్పడిరది. అక్కడే ఈయనా, థామస్‌ లండన్‌ అనే మరో సైంటిస్టు కలిసి ఆస్ట్రేలియా యాంటీజన్‌, హెపటైటిస్‌-బి వైరస్‌లపై పరిశోధన చేశారు. వివిధ దేశాలనుండి (భారతదేశం వాటిలో ఒకటి) సైంటిస్టుల సహాయంతో ఆయన ఆస్ట్రేలియా ఏంటీజన్‌పై రిసెర్చి చేశారు. 1964లో ఫాక్స్‌ ఛేజ్‌ కాన్సర్‌ సెంటర్‌లో చేరి ఇర్వింగ్‌ మిల్‌మన్‌తో కలిసి చేసిన పరిశోధనలు విజయవంతమై హెపటైటిస్‌-బి వైరస్‌ను, దాన్ని నిరోధించే వ్యాక్సిన్‌ను కనుగొనడం జరిగింది. దానికే వారిద్దరికీ కలిపి 1976లో నోబెల్‌ బహమతి లభించింది.

నోబెల్‌ బహుమతి రావడంతో హెపటైటిస్‌-బి వ్యాధి గురించి అవగాహన ప్రపంచమంతా పెరిగింది. రక్తదాతల నుండి రక్తాన్ని స్వీకరించేటపుడు దానిలో ఈ వైరస్‌ వుందేమో పరీక్షించే టెస్ట్‌లు చేయడం జరుగుతూ వచ్చి, ఆ విధంగా వ్యాధి వ్యాప్తి చెందకుండా చూశారు. హెపటైటిస్‌-బి వైరస్‌కు, లివర్‌ క్యాన్సర్‌కు సంబంధం వుందని బ్లూమ్‌బెర్గ్‌ 1969 లోనే ప్రతిపాదించినా 1976 తర్వాత జరిగిన విస్తృత పరిశోధనల తర్వాతనే ఆ విషయం నిర్ధారించబడింది. అంతేకాదు, 1985 ప్రాంతాల్లో హెపటైటిస్‌-సి వైరస్‌ను కూడా కనుగొనడం జరిగింది. (దానికి వ్యాక్సిన్‌ యింకా అభివృద్ధి కాలేదు). దేశదేశాలలోని సైంటిస్టుల నుండి బ్లూమ్‌బెర్గ్‌ హెపటైటిస్‌-బి వ్యాధి గురించి సమాచారం సేకరించి క్రోడీకరించే పనిలో ఎప్పటినుండో నిమగ్నమై వున్నారు.

ఈ విషయంలో ఆయన దృష్టి పెట్టినది ముఖ్యంగా చైనాపై. ఎందుకంటే హెపటైటిస్‌-బి వైరస్‌ సర్ఫేస్‌ యాంటీజెన్‌, ఆస్ట్రేలియా ఏంటీజెన్‌ చైనాలో చాలా తీవ్రంగా వుంది. వెళ్లి పరిశోధన చేద్దామంటే అమెరికా, చైనాల మధ్య అప్పట్లో సయోధ్య వుండేది కాదు. పింగ్‌పాంగ్‌ టీముల రాకపోకలు, నిక్సన్‌ పర్యటనలు జరిగినా 1979 వరకు రాయబార కార్యాలయాలు ప్రారంభించలేదు. ఇలాటి పరిస్థితుల్లో నోబెల్‌ బహుమతి వచ్చాక బ్లూమ్‌బెర్గ్‌కు చైనీస్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నుండి పిలుపు వచ్చింది. ఈయన చైనా పర్యటించి తన టెక్నాలజీ గురించి ప్రసంగించి వారిని మెప్పించారు. విదేశీ టెక్నాలజీ అంటే సందేహంగా చూసే చౌ ఎన్‌ లై సైతం దీన్ని ఆమోదించడంతో ఈయన మెర్క్‌ కంపెనీవారితో మాట్లాడి హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ను చైనాలో తయారుచేసేందుకు వీలుగా వారి మధ్య ఒప్పందం కుదిరేందుకు దోహదపడ్డారు.

మెర్క్‌ కంపెనీ వారు వ్యాక్సిన్‌ తయారుచేయడం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ వుంది. ఫాక్స్‌ ఛేజ్‌ కాన్సర్‌ సెంటర్‌లో పనిచేసే బ్లూమ్‌బెర్గ్‌, ఇర్వింగ్‌ మిల్‌మన్‌లకు హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ నిధులు సమకూర్చింది కాబట్టి 1969లో వ్యాక్సిన్‌ తయారయ్యాక దాని దేశీయ పేటెంటు హక్కులను తను వుంచుకుని సెంటర్‌కు విదేశీ మార్కెటింగ్‌ హక్కులు యిచ్చింది. కానీ వ్యాక్సిన్‌ను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లేవారెవరు? మందుల కంపెనీలకు వ్యాక్సిన్‌లలో పెద్ద ఆదాయం లేదు. అంతకంటె వ్యాధిని ముదరబెట్టి ఔషధాలను అమ్మితేనే వారికి లాభం. చివరకు 1976లో మెర్క్‌ కంపెనీ ముందుకు వచ్చింది. రీకాంబినెంట్‌ పద్ధతిలో మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్‌ ఎలా తయారుచేయాలో బ్లూమ్‌బెర్గే మెర్క్‌ వారికి దారి చూపారు.

వ్యాక్సిన్‌ తర్వాతది క్లినికల్‌ పరీక్షల ఘట్టం. న్యూయార్క్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో పరీక్షలు జరిపి 1980లో రిపోర్టులు సిద్ధమయ్యాయి. ఈ టీకా 90% మందికి రక్షణ కలిగించింది, అదీ అవాంఛిత ఫలితాలేవీ లేకుండా! కొద్ది సంవత్సరాలలోనే యుఎస్‌ఎఫ్‌డిఏ ఆమోదం లభించింది. వ్యాక్సిన్‌ తయారీ చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అనేక దేశాలు దీనిని తమ జాతీయ టీకాల విధానంలో చేర్చడానికి భయపడ్డాయి. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం క్రమేపీ చేరుస్తూ వచ్చాయి. 2003 నాటికి 192 ప్రపంచ దేశాలలో 80% దేశాలు అమలు చేశాయి. ఇమ్యునైజేషన్‌ షెడ్యూల్‌లో చేర్చడం వలన జరిగే మేలు గురించి చెప్పాలంటే ఒక్క ఉదాహరణ చాలు. చైనాలో పూర్వం హెపటైటిస్‌ వ్యాధిపీడితులు 16.3% వుంటే షెడ్యూల్‌లో చేర్చి టీకాలు వేశాక అది 1.4% అయింది. మన దేశంలో కూడా ఇమ్యునైజేషన్‌ షెడ్యూల్‌లో చేరాలని నాబోటి వాళ్లు పోరగా, పోరగా 2011లో అది జరిగింది.

నేను శాంతా బయోటెక్నిక్స్‌ స్థాపించే ప్రయత్నాలలో ఉండగా నాకు బ్లూమ్‌బెర్గ్‌ గురించి కొందరు చెప్పారు. వెళదామా వద్దా, వెళితే ఆయన చెప్పేది నాకు అర్థమవుతుందా లేదా అనే సందేహాలు వెంటాడుతుండగానే నాకు తెలిసిన ఓ సైంటిస్టు ద్వారా ఎపాయింట్‌మెంట్‌ కోసం అడిగాను. ఆయన రెస్పాండ్‌ అయ్యారు. వాళ్ల ఇంట్లో కలిశాను. చాలా ఆదరంగా మాట్లాడారు. నా ప్రయత్నాల గురించి తెలుసుకుని హర్షించారు. నాకు అర్థం కాని సందర్బాల్లో మోకాలు తట్టి, ధైర్యం చెప్పారు –

‘‘నేను వ్యాక్సిన్‌ను కనుగొన్నాను. ప్రపంచంలో అందరికీ అది అందుతుందని ఊహించాను. కానీ ఔషధ కంపెనీలు వాటికి హెచ్చు ధర పెట్టి పేదలకు అందుబాటులో లేకుండా చేశాయి. వారి దృక్పథానికి భిన్నంగా నువ్వు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పరచి, దేశం లోని ఫెసిలిటీస్‌ లోనే తయారుచేసి, దిగుమతి చేసుకునే వ్యాక్సిన్‌ల ధరలో పదో వంతుకే యిస్తానంటున్నావు. నా పరిశోధనా ఫలితాన్ని అందుబాటు ధరలో కోట్లాది ప్రజలకు అందించాలని సంకల్పించినందుకు భగవంతుడు నీ కృషిని ఆశీర్వదించుగాక. నీ యజ్ఞం సఫలమైనపుడు నా కంటె సంతోషించేవారు వేరొకరుండరు.’’ అన్నారు.

19వ శతాబ్దం చివరిలో యూరోప్‌ నుండి న్యూయార్క్‌ తరలి వెళ్లిన యూదు కుటుంబంలో పుట్టిన బ్లూమ్‌బెర్గ్‌ హీబ్రూ భాషలో ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ (పాత నిబంధన గ్రంథం) ని అధ్యయనం చేయడమే కాక, ‘ఒక్క ప్రాణిని రక్షించినా ప్రపంచాన్ని రక్షించినట్లే’ అనే యూదు (టాల్మడ్‌) సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్నారు. అందుకే ఆయన వైద్యపరిశోధనలకే తన జీవితాన్ని అంకితం చేశారు. జీవితాంతం వారాంతాలలో యూదు ప్రార్థనా మందిరానికి వెళ్లడమే కాక, అమెరికన్‌ ఫిలసాఫికల్‌ సొసైటీ (1743లో బెంజమన్‌ ఫ్రాంక్లిన్‌ స్థాపించినది)కి అధ్యక్షుడిగా వున్నారు. ఇంతటి ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి కాబట్టే తను కనుగొన్న వ్యాక్సిన్‌ ఒక భారతీయ సంస్థ ప్రయత్నాల వలన సామాన్యులకు అందబోతోందని తెలిసి ఆనందపడ్డారు, ఆశీర్వదించారు.

భారతదేశమన్నా, భారతీయుల మేధ అన్నా ఆయనకు ఎంతో గౌరవం. 1986లో ఆయన మూడు నెలల పాటు బెంగుళూరులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ గెస్ట్‌ హౌస్‌లో ఉన్నారు. ఆ అనుభవాలను తన ఆత్మకథలో నెమరు వేసుకుంటూ ఇంత మంది మేధావులు ఒకే సంస్థలో వుండడం తను ఎక్కడా చూడలేదని ప్రస్తుతించారు. భారతదేశమంతా పర్యటించి ఉపన్యాసాలిచ్చి, శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచారు. ‘‘భారతదేశంలో వైరుధ్యాలు ఎన్నో వున్నాయి. గొప్పా-బీదా, నగరాలు-గ్రామాలు వీటి మధ్య అంతరాలు తీవ్రంగా వున్నాయి. నిరక్షరాస్యతా వుంది. అదే సమయంలో మేధావుల సంఖ్యా తక్కువ కాదు. భారతదేశంలోని అనేక సంస్థల్లో సమర్థులైన శాస్త్రవేత్తలెందరో పనిచేస్తూండడం చూశాను.’’ అని రాసుకున్నారు.

అప్పుడే రాజీవ్‌ గాంధీని స్వయంగా కలిసి, దేశవ్యాప్తంగా వున్న హెపటైటిస్‌ వ్యాధిగురించి, పబ్లిక్‌ హెల్త్‌పై పరిశోధన చేయడానికి మరిన్ని సంస్థలను నెలకొల్పవలసిన ఆవశ్యకత గురించి, డిస్పోజబుల్‌ నీడిల్స్‌ ద్వారా రోగవ్యాప్తిని నిరోధించడం గురించి, ఎయిడ్స్‌ పరీక్ష, హెపటైటిస్‌-బి పరీక్ష సంయుక్తంగా నిర్వహించడంలో వున్న సౌలభ్యం గురించి, దేశీయంగా వ్యాక్సిన్‌ తయారుచేయడంలో గల ఉపయోగాల గురించి చర్చించి, కొన్ని సిఫార్సులు చేశారు.

1997 ఆగస్టులో శాన్‌వాక్‌-బి మార్కెట్‌లో ప్రవేశించినపుడు, దాని ధర గురించి, నాణ్యత గురించి తెలిసి ఆయన ఎంతో ఆనందించారు. అతి త్వరలోనే హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య యిబ్బడిముబ్బడిగా పెరగడం, ధర ఎన్నో రెట్లు తగ్గడం చూసి తను కన్న కలలు సాకారమైనందుకు సంతోషంతో పొంగిపోయారు. యూనిసెఫ్‌ ద్వారా బడుగు దేశాలలో కూడా తక్కువ ధరకు లభిస్తోందని తెలుసుకుని పులకించారు. తన జన్మదినమైన జులై 28ని కటక్‌ (ఒడిశా) లో హెపటైటిస్‌-బి నిర్మూలనా దినంగా జరుపుకుంటున్నారని తెలిసి ఎంతో ఆనందించారు. స్వయంగా వచ్చి మా ఫెసిలిటీ చూడమని ఆహ్వానించాను కానీ వారి సంస్థ విధించిన నిషేధాల వలన స్వయంగా రాలేకపోయారు.

తన 85వ యేట మరణించే నాటికి బ్లూమ్‌బెర్గ్‌ నాసాలోని ల్యూనార్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సైంటిస్టుగా వున్నారు. 2005 నుండి యునైటెడ్‌ థెరపిటిక్స్‌ కార్పోరేషన్‌ సైంటిఫిక్‌ ఎడ్వయిజరీ బోర్డుకు చైర్మన్‌గా ఉన్నారు. చివరి శ్వాస దాకా తన జ్ఞానాన్ని యితరులతో పంచుకుంటూనే వున్నారు. 2011 ఏప్రిల్‌ 5 న తన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది గంటల్లోనే ఆయన గుండెపోటుతో మరణించారు. ప్రపంచవ్యాప్తంగా వున్న హెపటైటిస్‌ పీడితులందరి తరఫున, భారతీయులందరి తరఫున, శాంతా బయోటెక్నిక్స్‌ తరఫున, నా తరఫున ఆ మహానుభావుడికి యిదే నా నివాళి. తమ పరిశోధనలు సామాన్యప్రజలను చేరాలని పరితపించే శాస్త్రజ్ఞులను, చేర్చడానికి కృషి చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పై లోకాల నుంచి ఆయన ఆశీర్వదిస్తూనే వుంటారు.

– కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్‌)

17 Replies to “కెవి: మనసున్న సైంటిస్టు బ్లూమ్‌బర్గ్‌!”

  1. వరప్రసాదు గారు మీరు మీ కంపనీని ఇంత అభివ్రుద్ది చేసి మీ కంపనీను వేరే వాల్లకు అమ్మడం నచ్హలేదండి.

  2. “మోకాలి తట్టి”. ఇది మీ మీద మీరు వేసుకున్న జోక్ ( చమత్కారం) నా లేక వాస్తవంగా నే వారు మీ మోకాలు నీ తట్టి చెప్పారా ?

  3. మీ లాంటి గొప్ప వ్యక్తి తో మేం ఇలా సింపుల్ గా మాట్లాడం ఎంతో సర్ప్రైజ్ గా ఉంది సార్…మీరెంత ఎత్తులో ఉన్నారు..మేం అసలు మీ దరిదాపుల్లోకి కూడా రాలెం..చాలా థాంక్స్ సార్.మంచి ఆర్టికల్ మాకు చెప్తున్నారు

Comments are closed.