జరిమానాలు బాగున్నాయ్.. జరిగేపనేనా?

చంద్రబాబునాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా.. అనుభవంలోకి వచ్చేలాగా మార్పులు తెస్తూ తీసుకున్న కీలకమైన నిర్ణయాలు రెండు! ఇసుక, లిక్కర్ విషయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం…

చంద్రబాబునాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా.. అనుభవంలోకి వచ్చేలాగా మార్పులు తెస్తూ తీసుకున్న కీలకమైన నిర్ణయాలు రెండు! ఇసుక, లిక్కర్ విషయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకువచ్చింది.

లిక్కర్ విధానంలో కూడా దుకాణాలను ప్రెవేటీకరించారు. ఈ నేపథ్యంలో యథావిధిగా బెల్టు దుకాణాలు లెక్కకు మిక్కలిగా పుట్టుకొస్తున్నాయి. బెల్టు దుకాణాలు పెడితే.. తాను తన బెల్టు తీయాల్సి వస్తుందని చంద్రబాబునాయుడు పంచ్ డైలాగులు కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎక్సైజ్ చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ.. కొత్తగా జరిమానాలను విధిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీ ధరకంటె అధికంగా విక్రయిస్తున్నారని ఆరోపణలు బీభత్సంగా ఉన్నాయి. ఇలా చేస్తే రూ.5 లక్షల జరిమానా విధించేలా చట్టంలో సవరణ చేశారు. మళ్లీ అదే తప్పు చేస్తే ఆ మద్యం దుకాణం లైసెన్సు రద్దు చేయాలని కూడా నిర్ణయించారు. ఒక దుకాణం పరిధిలో బెల్టు షాపులు నిర్వహిస్తే కూడా రూ.5 లక్షల జరిమానాలు విధించేలా మార్పులు చేశారు.

ఈ జరిమానాల యవ్వారం బాగానే ఉంది. కానీ ఇదంతా అమలు కావడం నిజమేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యం దుకాణాల నుంచి లాభాల్లో 25 శాతం నుంచి 50 శాతం వరకు స్థానికంగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు దందాలు వసూలు చేస్తున్న నేపథ్యంలో దుకాణాల వారు ఎమ్మార్పీ కంటె ఎక్కువకు అమ్మాల్సి వస్తోంది.

దుకాణాల లైసెన్సుదారులకు మాత్రమే కాదు.. బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారికి కూడా స్థానిక ఎమ్మెల్యేల, కూటమి పార్టీల నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. చంద్రబాబునాయుడు చేసిన చట్టాలు కాగితం మీద చాలా బలంగా ఉండవచ్చు గానీ.. స్థానికంగా ఎమ్మెల్యేల మాట జవదాటి జరిమానాలు విధించే ధైర్యం అధికారులకు ఉంటుందా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది.

ఉచిత ఇసుక అనేది కూడా రాష్ట్రంలో ఒక ప్రహసనంగా మారిపోయింది. ఇసుకను కేవలం రవాణా చార్జీలు మినహా, స్థినక పన్నులు, సీవరేజీ చార్జీలు సహా దేనికోసమూ ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో ఏ ఒక్కచోట కూడా అంత పారదర్శకంగా ఇసుక విక్రయాలు జరగడం లేదు. ఎక్కడికక్కడ దందాలు శృతిమించుతున్నాయి.

వైసీపీ హయాంలో ఉన్న ధరల కంటె ఏమాత్రం దిగిరావడం లేదు. ప్రజలు లోలోపల తిట్టుకున్నప్పటికీ.. అప్పటి ధరకే వస్తోంది కదా అని మిన్నకుండిపోవచ్చు. కానీ.. అప్పట్లో ప్రభుత్వానికి వస్తుండిన ఇసుక ఆదాయం మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్లిపోతోంది.

ముందుగా తమ ఎమ్మెల్యేలను సంస్కరించుకోకుండా.. వారి అడ్డదారులు, అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా.. ఈ జరిమానాల చట్టాలను తయారుచేయడం అనేది మొక్కుబడి చర్యలు మాత్రమేనని ప్రజలు పెదవివిరుస్తున్నారు.

8 Replies to “జరిమానాలు బాగున్నాయ్.. జరిగేపనేనా?”

  1. అప్పటికంటే ఎక్కువ అని ఇండ్లు కడుతున్న సాధారణ పౌరులు చెప్తున్నారు. అయినా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా

Comments are closed.