భార‌త బ్యాట్స్ మెన్ స‌త్తాకు ప‌రీక్ష‌!

వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్షిప్ ఫైన‌ల్ వ‌ర‌కూ చేరారంటే అది భార‌త బ్యాటింగ్ లైనప్ స‌త్తాకు నిద‌ర్శ‌న‌మే. ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్ ల మీద కూడా చ‌క్క‌టి బ్యాటింగ్ చేయ‌డం వ‌ల్లే.. టీమిండియా ఇప్పుడు…

వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్షిప్ ఫైన‌ల్ వ‌ర‌కూ చేరారంటే అది భార‌త బ్యాటింగ్ లైనప్ స‌త్తాకు నిద‌ర్శ‌న‌మే. ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్ ల మీద కూడా చ‌క్క‌టి బ్యాటింగ్ చేయ‌డం వ‌ల్లే.. టీమిండియా ఇప్పుడు సౌతాంఫ్ట‌న్ లో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆడ‌గ‌లుగుతోంది. ఇప్పుడు ఫైన‌ల్ గా టీమిండియా బ్యాట్స్ మెన్ కు ఒక పెద్ద ప‌రీక్ష ఎదుర‌వుతోంది. 

వ‌రుణుడి వ‌ల్ల అనేక బ్రేక్ ల మ‌ధ్య జ‌రుగుతున్న డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ ఆఖ‌రి రోజుకు చేరుకుంది. అది కూడా రిజ‌ర్వ్ డే. ఒక టెస్టు మ్యాచ్ చాలా ద‌శాబ్దాల త‌ర్వాత ఇలా రిజ‌ర్వ్ డే న జ‌రుగుతోంది. మామూలు టెస్టు మ్యాచ్ అయి ఉంటే.. ఐదో రోజు నిన్న‌టితోనే ముగిసేది. డ్రా గా తేలేది. అయితే డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కు రిజ‌ర్వ్ డే ను ఉంచింది ఐసీసీ. ఈ నేప‌థ్యంలో ఆరో రోజున మ్యాచ్ కొన‌సాగుతుంది. అయితే వాతావ‌ర‌ణం అంతిమంగా ఈ విష‌యాన్ని నిర్ణ‌యించాల్సి ఉంది. వ‌ర్షం, లైటింగ్ ఎలా ఉంటుందో.. అనే అంశాలే ఆరో రోజు ఎంత సేపు జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని నిర్ధారించ‌నున్నాయి.

ఒక‌వేళ వాతావ‌ర‌ణం అంతా అనుకూలంగా ఉండి.. ఆరో రోజున మ్యాచ్ పూర్తి స్థాయిలో కొన‌సాగితే ఈ మ్యాచ్ ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశాలు కొంత మేర లేక‌పోలేదు! పిచ్ నుంచి బౌల‌ర్ల‌కు మించి అనుకూల‌త ఉంది. ఈ నేప‌థ్యంలో.. ఆఖ‌రి రోజున ఇరు జ‌ట్ల బౌల‌ర్లూ పూర్తి స్థాయిలో రాణించ‌గ‌లిగితే ఈ మ్యాచ్ ఫ‌లితం ఎటైనా రావొచ్చు! 

గ‌రిష్టంగా 98 ఓవ‌ర్లు ప‌డే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం క్రీజ్ లో విరాట్, పుజ‌రాలున్నారు. భార‌త జ‌ట్లు 32 ప‌రుగుల లీడ్ లో ఉంది. ఈ లీడ్ ను క‌నీసం మ‌రో 150 ప‌రుగుల పై స్థాయి వ‌ర‌కూ తీసుకెళ్లినా టీమిండియా మెరుగైన స్థితిలో ఉన్న‌ట్టే. క‌నీసం ఇంకో 50 ఓవ‌ర్ల పాటు అయినా భార‌త జ‌ట్టు బ్యాటింగ్ చేయ‌గ‌ల‌గాలి. అప్పుడే మ్యాచ్ డ్రా లేదా, భార‌త జ‌ట్ట‌కు అనుకూల‌మైన ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలా కాకుండా.. ఎక్కువ ఓవ‌ర్ల‌ను ఆడ‌లేక భార‌త బ్యాట్స్ మెన్ చేతులెత్తేస్తే మాత్రం న్యూజిలాండ్ విజేత‌గా నిలిచే అవకాశాలు పుష్క‌లంగా ఉంటాయి. 

క‌నీసం యాభై ఓవ‌ర్ల పాటు బ్యాటింగ్ చేయ‌డం అయితే త‌ప్ప‌నిస‌రి. ర‌న్ రేట్ ఓవ‌ర్ కు రెండు ప‌రుగుల‌కు మించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో వీలైన‌న్ని ఓవ‌ర్ల‌ను బ్యాటింగ్ చేసి, టీమిండియా డ్రా కోస‌మే ఆడాల్సిన స్థితిలో కూడా ఉంది. అయితే అద్భుతం జ‌రిగితే టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచినా గెల‌వొచ్చు!

భార‌త జ‌ట్టు వీలైన‌న్ని ఓవ‌ర్ల‌ను ఆడి.. ఆలౌట్ కావ‌డ‌మో, లేక చివ‌రి సెష‌న్ కు ముందు డిక్లేర్డ్ చేయ‌డ‌మో చేయ‌గ‌లిగితే.. కివీస్ త‌న రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు వ‌స్తుంది. ఒక్క సెష‌న్లో 150 పై స్థాయి టార్గెట్ ను చేజ్ చేయ‌డం ఈ పిచ్ మీద దాదాపు అసాధ్యం. అదే స‌మ‌యంలో భార‌త బౌల‌ర్లు చెల‌రేగ‌గ‌లిగితే.. అద్భుత విజ‌యం భార‌త జ‌ట్టు సొంతం కాగ‌ల‌దు. ప్ర‌స్తుతానికి అయితే.. మ్యాచ్ క‌చ్చితంగా ఓడిపోతుంది అనే స్థితిలో భార‌త జ‌ట్టు లేదు. అద్భుతం జ‌రిగితే గెల‌వొచ్చు, లేదా డ్రా కావొచ్చు.

న్యూజిలాండ్ ప‌రిస్థితి కాస్త పై చేయిగా ఉంది. వీలైతే విజ‌యం, లేక‌పోతే డ్రా అన్న‌ట్టుగా ఆ జ‌ట్టు ఉంది. అయితే ఏది జ‌ర‌గాల‌న్నా.. ఆరో రోజు మ్యాచ్ పూర్తి స్థాయిలో కొన‌సాగ‌డానికి వాతావ‌ర‌ణం అనుకూలం అయితే త‌ప్ప‌నిస‌రి!