ఇదివరకటి రోజులతో పోల్చితే ఇప్పుడు మహిళల ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయంటోంది భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. క్రికెట్లో మగవాళ్ళతో పోల్చితే, మహిళలకు అవకాశాలు ఇప్పటికీ తక్కువగానే వున్నాయనీ, మహిళా క్రికెట్ పట్ల జనం ఆలోచనల్లో ఇంకా చాలా మార్పు రావాల్సి వుందని మిథాలీ అభిప్రాయపడింది.
'మ్యాచ్ గెలిచినప్పుడు ఓ ఆటగాడు షర్ట్ విప్పుకుని మైదానంలో తిరిగితే అభిమానులు కేరింతలు కొడ్తారు. పర్సనల్ లైఫ్‌లో ఓ మహిళా క్రికెటర్ కొంచెం గ్లామరస్‌గా కన్పించినా తట్టుకోలేని దురభిమానులున్నారు. ఈ ఆలోచనలు మారాలి. తామెలా వుండాలన్నదానిపై మహిళలకు ఖచ్చితమైన అభిప్రాయాలుంటాయి. ఆ అభిప్రాయాల్ని గౌరవించలేకపోయినాసరే, కించపర్చకుండా వుంటే మంచిది..' అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో మిథాలీ ఫొటో ఒకటి ఆ మధ్య నానా రాద్ధాంతానికి కారణమైన విషయం విదితమే. అది తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయమనీ, ఆ విషయంలో ఇతరులు తలదూర్చి, వారి స్థాయిని తగ్గించుకున్నారని మిథాలీ అభిప్రాయపడింది. 'క్రికెటర్‌గా నా ఆట తీరు గురించి ఎవరైనా మాట్లాడొచ్చు.. నా డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే దాని వల్ల ఉపయోగమేంటి.?' అని ప్రశ్నించింది మిథాలీ రాజ్.