లగడపాటి శ్రీధర్..ఓ విలక్షణమైన పారిశ్రామిక వేత్త. వ్యాపారాలు సాగిస్తారు..సినిమాలు తీస్తారు. కానీ ఆయనకంటూ ఓ అంతరంగం వుంది. అందులో ఓ ఆలోచనావాది, ప్రేమికుడు, ఫిలాసఫర్, భక్తుడు ఇలా ఎందరో దాగి వుంటారు. ఆయన టేబుల్ పై పెదబాలశిక్ష నుంచి బాబా, ఓషో, ఇలా రకరకాల పుస్తకాలు వుంటాయి. సినిమా ఆయన అభిరుచి. కానీ మళ్లీ సినిమాలో ఆయన అభిరుచి కనిపించాలి. తెల్లావారి పేపర్లో వచ్చే ప్రకటన క్యాప్షన్ నుంచి మొదలు పెట్టి, సినిమా నిర్మాణం అడుగుడుగునా ఆయన స్వయంగా చూసుకోవాలి. అందుకే ఆయన తన మనసుకు నచ్చిన సినిమాలే తీస్తారు. పెద్ద హీరోలు అందరూ పరిచయమే అయినా, పెద్ద సినిమా తీయగల కెపాసిటీ వున్నా, కథ నచ్చితేనే ముందుకు వెళ్తారు..అలా వెళ్లిన తరువాత నో రిగ్రెట్స్..ఆయన తాజాగా నిర్మించిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వూ.
వరుసగా రెండో కన్నడ సినిమా రీమేక్ చేస్తున్నారు..ఏమిటి సంగతి?
విశేషం ఏమీ లేదు. ఇలా చేయడానికి చాలా కారణాలువున్నాయి. ఒకటి ఆయా సినిమాలు నచ్చడం. రెండవది తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇస్తున్నారు కన్నడ సినిమా రంగంలో. ఎప్పుడయితే తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా తీయాలో, అప్పుడు ఆలోచన పెరుగుతుంది. అదే సమయంలో తెలుగు, కన్నడ ప్రజల అలోచనలు, అభిరుచులు దగ్గరగా వుంటున్నాయి. అందువల్ల సరైన కన్నడ సినిమాను తీసుకుని, కాస్త నేటవిటీ జోడిస్తే చాలు, మంచి చిన్న సినిమా తయారవుతుంది.
సాధారణంగా రీమేక్ లు అనగానే ఒరిజినల్ తో పోల్చుకుంటారు కదా?
నిజమే అందుకే ఈ సారి కన్నడ సినిమా చార్మినార్ టీమ్ నే యాజిటీజ్ గా తీసుకున్నాం. దర్శకుడు, సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్. అయితే చేసిన మరొ విశేషమేమిటంటే, ఆ ముగ్గురు ఒరిజినల్ కు ఇచ్చిన ఔట్ పుట్ కంటే ఇంకా ఇంప్రూవ్డ్ వెర్షన్ తీసుకోగలిగాం. అందువల్ల ఒరిజినల్ కన్నా బాగుండేలా తయారైంది.
మీకు చకచకా సినిమాలు తీయగల స్టామినా వుండి..ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు?
మనకు ఎంత సత్తా వుంది అన్నది కాదు. మనం ఒకసారి ఎంతవరకు కాన్సన్ ట్రేట్ చేయగలం అన్నది. ఎంత తెలివైన విద్యార్థి అయినా ఒకేసారి అన్ని పరీక్షలు రాసేయలేడుకదా?
మీ సినిమా నిర్మాణంలో మీరు కాస్త ఎక్కువగానే ఇన్వాల్వ్ అవుతారని..?
కొంచెంమేం ఖర్మ..పూర్తిగానే ఇన్వాల్వ్ అవుతాను. ఎందుకంటే నేను ఎక్కడో లేను. జన ప్రపంచలోనే వున్నారు. యాభై,లేదా వంద పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకుడు, నా డబ్బులు దండుగ అయ్యాయి అనుకోకూడదు. నేను సినిమా నిర్మాణంలోకి రావాలని చిన్నతనంలోనే అనుకున్నది ఇదే మోటోతో. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాను.
సికిందర్ తో డబ్బింగ్ వ్యవహారాలను వదిలేసినట్లేనా?
అది నాకు పూర్తిగా సంబంధం లేకుండా జరిగింది. లింగుస్వామి-సూర్య వీళ్లను చూసి మాకు ఆ సినిమా కావాలి మీరు అందించండి చాలు అని అడగబట్టి చేసాను. అంతకు మించి అందులో నాదేమీ లేదు.
మీ కుమారుడిని నటన రంగంలోకి మెలమెల్లగా తెస్తున్నారు..హీరోను చేయాలనుకుంటున్నారా?
నేనేమీ అనుకోవడం లేదు. నేను నిర్మాతను కావాలనుకున్నాను. వాడు హీరో కావాలనుకుంటే వాడిష్టం.
కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని..ఏమిటి దీని కథాశం.?
ఇది ఓ మంచి ప్రేమ కథ. నిజమైన ప్రేమ ఎప్పటికైనా కలుస్తుంది. మన కళ్ల ముందు దేవుడు లేకపోవచ్చు. ప్రకృతి వుంది. అదే దైవంగా మారి ప్రేమికులను కలుపుతుంది. ప్రేమ విలువను పెంచే ప్రేమకథ. ప్రేమకు సంబంధించి కుర్రాళ్లకు ఓ గైడ్ లాంటి ప్రేమకథ.
ప్రేమకథ అనగానే మాటలు, పాటలు, విజువల్స్ ఈ మూడూ ప్రాధాన్యత వహిస్తాయి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నారా?
పాటలు మీరే చూసారు..కేవలం ట్యూన్ల కోసం కాదు..సాహిత్యం కూడా వినాలి. అన్నీ విభిన్నంగా చిత్రీకరించాం.
చిన్న సినిమాల పరిస్థితి ఎలా వుంది?
తొలి రోజు కలెక్షన్లు వుండడం లేదు. బాగుందని వింటే, టాక్ వస్తే, మర్నాటి నుంచి కలెక్షన్లు వుంటున్నాయి. అందుకే సేఫ్ జోన్ లో సినిమాలు తీయాల్సి వస్తోంది.
తరువాతి ప్రాజెక్టులు?
గోలీసోడా సినిమా హక్కులు కొన్నాం. దాన్ని తీయాలి.
బెస్టాఫ్ లక్ సర్
థాంక్యూ
విఎస్ఎన్ మూర్తి