ఐపీఎల్ లోకి రానున్న కొత్త జట్ల కోసం పోటీ గట్టిగానే ఉన్నట్టుంది. వచ్చే సీజన్ ఐపీఎల్ లో రెండు కొత్త జట్లను ప్రవేశ పెట్టనుంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి వేలం పాటకు బిడ్డింగ్ లు దాఖలవుతున్నాయి. ఈ సారి కొత్త ఐపీఎల్ జట్ల ధరలు రికార్డు స్థాయిలో పలికే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
పదేళ్లకు గానూ వీటి విలువ కనీసం ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకూ పలికే అవకాశం ఉందని అంచనా! అయినప్పటికీ ఐపీఎల్ జట్టు ఓనర్లం అనిపించుకోవడానికి అనేక మంది వ్యాపారస్తులు, సెలబ్రిటీలు పోటీ పడుతున్నట్టుగా ఉన్నారు.
ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, అతడి భార్య-స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ లు ఒక జట్టు కోసం బిడ్ ను దాఖలు చేశారట. మరి వీరు మాత్రమే ఓనర్షిప్ ను సొంతం చేసుకుంటున్నారా, లేక వీరితో పాటు ఏదైనా కార్పొరేట్ కంపెనీ ఉంటుందో తెలియదు కానీ బిడ్ లను దాఖలు చేసిన వారిలో దీపికా, రణ్ వీర్ లు కూడా ఉన్నట్టుగా సమాచారం.
ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారాగణం ఐపీఎల్ యాజమాన్యాల్లో ఉన్నారు. షారూక్ ఖాన్ కు సొంతంగా కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ ఉంది. ఇక పంజాబ్ టీమ్ లో ప్రీతీజింతా సహ యజమానిగా ఉంది. శిల్పా షెట్టిరాజ్ కుంద్రాలు రాజస్తాన్ రాయల్స్ టీమ్ కు గతంలో ఓనర్లు.
ఇలా ఆది నుంచి ఐపీఎల్ యాజమాన్యంలో ఉండటానికి బాలీవుడ్ సెలబ్రిటీలు ఉత్సాహం చూపించారు. ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను కలిగిన దీపిక, రణ్ వీర్ లు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. అయితే భారీ ధరల వేలం పాటలో వీరు ఏ మేరకు నిలుస్తారో!