బిజెపి తరఫు నుండి జరిగిన పొరపాట్లలో 25 మంది ఫిరాయింపుదార్లకి టిక్కెట్లు యివ్వడం ఒకటి. రిపబ్లిక్ పెరేడ్‌కి ఒబామాను తెచ్చి 'బరాక్ బరాక్' అని పిలిస్తే ఢిల్లీ ఓటరు మురిసి ముక్కలవుతాడని అనుకోవడం మరొకటి. ఆ ఫంక్షన్‌కు అరవింద్‌ను, షీలా దీక్షిత్‌ను పిలవకపోవడం అహంకారానికి పరాకాష్టగా ఓటర్లు ఫీలయ్యారు. ముందువరుసలో కూర్చున్న కిరణ్ 'ఆహ్వానం కావాలంటే అరవింద్ బిజెపిలో చేరాలి' అనడం ప్రజలను భగ్గుమనిపించింది. మతప్రచారం తక్కువ, రాజకీయప్రచారం ఎక్కువ అయిన షాహీ ఇమామ్ బుఖారీ అరవింద్‌కు ఓటేయమని యిచ్చిన పిలుపును ప్రస్తావిస్తూ బిజెపి ఆప్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం మరో తెలివితక్కువ పని. ఇదంతా బిజెపి కుట్రలో భాగం అంటూ అరవింద్ బుఖారీ మద్దతును తిరస్కరించి, వాళ్లను యిబ్బందుల్లోకి నెట్టాడు. బహుశా ఏ రాజకీయవేత్తా మతనాయకుడి మద్దతును తిరస్కరించడేమో. కానీ అరవింద్ అలా చేయడం చేతనే కాబోలు అతనికి ముస్లిము ఓట్లలో 77%, సిఖ్ ఓట్లలో 57% పడ్డాయి. ఆప్‌కు వచ్చిన విరాళాల గురించి అల్లరి చేయబోతే 'దమ్ముంటే అరెస్టు చేయ్' అని అరవింద్ అరుణ్ జైట్లేకి సవాల్ విసిరాడు. విచారణ జరిపించమని తనే కోరాడు. 'విచారణ జరిపించామని, ఆరోపణలు అబద్ధమని తేలాయని' కేంద్రం కోర్టుకి విన్నవించిందని తాజా వార్త. అంటే యిది ఎన్నికల కోసమే బిజెపి ఆడిన నాటకమని తేటతెల్లమైనట్లే కదా!
ఇండియా టుడేవారు ఏ వర్గం ఎటు ఓటు వేసిందో తెలుసుకోవడానికి పోలింగ్ తేదీన ప్రత్యేకమైన సర్వే నిర్వహించారు. 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో 120 లొకేషన్లలో 2060 మందిని యింటర్వ్యూ చేసి ఫలితాలు క్రోడీకరించారు. సర్వే శాంపుల్ తక్కువగానే వున్నా వారి శాంప్లింగ్ మెథడ్ వాస్తవాలను ప్రతిబింబించిందని వారు చెప్పుకున్నారు. దళితులు 16.2% మంది ఓటేసి వుంటారని వీరు లెక్క వేస్తే వాస్తవానికి 16.8% మంది వేశారట. ఆప్‌కు 54.8% ఓట్లు వస్తాయని వీరు అంచనా వేస్తే వాస్తవానికి 54.3% వచ్చాయిట. ఇంతకీ వీరు చెప్పే వర్గీకరణ ప్రకారం మగవాళ్లలో 55% ఆప్‌కు, 33% బిజెపికి ఓటేస్తే ఆడవాళ్లలో 52% ఆప్‌కు, 35% బిజెపికి వేశారు. పేదవాళ్లలో 65% ఆప్‌కు, 22% బిజెపికి, దిగువ మధ్యతరగతివారు 56% ఆప్‌కు, 30% బిజెపికి, మధ్యతరగతివారు 50% ఆప్‌కు, 36% బిజెపికి వేయగా ఎగువ మధ్యతరగతి/ధనిక వర్గాలవారు 46% ఆప్‌కు, 44% బిజెపికి వేశారు. ఈ వర్గాలవారిలో కాంగ్రెసుకు 6% మంది వేశారు, మధ్యతరగతివారిలో 12% మంది వేశారు. ఇక తక్కిన వర్గాలలో వారి ఓటు శాతం 9-10 వుంది. దీనర్థం ధనికవర్గాలు బిజెపిని ఎక్కువగా ఆదరించగా, పేదవర్గాలు ఆప్‌ను ఎక్కువగా ఆదరించాయి. ఇక వయసు ప్రకారం చూస్తే 25 సం||ల లోపువారిలో 56% ఆప్‌కు, 31% బిజెపికి, 26-35 గ్రూపులో 59% ఆప్‌కు, 32% బిజెపికి, 36-43 గ్రూపులో 53% ఆప్‌కు, 35% బిజెపికి, 46-55 గ్రూపులో 49% ఆప్‌కు, 35% బిజెపికి, 56 ప్లస్ గ్రూపులో 45% ఆప్‌కు, 38% బిజెపికి వేశారు. ఈ చివరి గ్రూపులో కాంగ్రెసుకు 15% మంది వేశారు. తక్కిన గ్రూపుల్లో 6-10% మంది ఓట్లు వేశారు.
బిజెపికి మొదటినుండీ వ్యాపారస్తుల, అగ్రవర్ణాల పార్టీగా పేరుంది. ఢిల్లీలో అయితే పంజాబీల పార్టీగా కూడా అనుకుంటారు. పార్లమెంటు ఎన్నికలలో మోదీ చాయ్‌వాలా యిమేజి చూసి పేదలు కూడా ఓట్లేశారు. బిజెపి కూడా యుపిఏ తరహా కార్పోరేట్ ఫ్రెండ్లీ ఆర్థికవిధానాలే కొనసాగించడంతో క్రమేపీ మోదీ అంటే పేదలకు మోజు తగ్గింది. పార్లమెంటు ఎన్నికలు జరగగానే అసెంబ్లీ ఎన్నికలు జరిపించి వుంటే తమకు యీ అపజయం తప్పేదని వెంకయ్యనాయుడు అంటున్నారు. 8 నెలలు గడిచేసరికి ప్రభుత్వవిధానాలు అందరికీ అర్థమై పోయాయి. ఇదే ఏడాది చివర్లో జరగబోయే బిహార్ ఎన్నికలలో మోదీ మ్యాజిక్ ఏ మేరకు పనిచేస్తుందో ఢిల్లీలో ఒక సంకేతం లభించింది. పేదరాష్ట్రాలైన బిహార్, యుపిల నుండి ఢిల్లీలో స్థిరపడినవారిని పూర్వాంచలీలంటారు. వారు ఓటర్లలో 20-25% మంది వుంటారు. బిజెపి వారిలో అభ్యర్థులలో 4గురు మాత్రమే పూర్వాంచలీలు కాగా, ఆప్ 12 మందిని నిలబెట్టి వారి ఓట్లను కొల్లగొట్టింది. ఢిల్లీ ఎన్నికలో పార్టీ నిర్వహణలో లోపం లేకపోయినా మోదీ మ్యాజిక్ పనిచేయలేదని అర్థమైంది. మోదీ హవా యింకా నడుస్తోందని జనాల్ని నమ్మించాలని చూస్తున్న పార్టీకి యీ వైఫల్యాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియలేదు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాలు రాగానే అనేకమంది బిజెపి నాయకులు కెమెరాలకు ముందుకు వచ్చి యిదంతా మోదీ విజయమే అని ఉపన్యాసాలు దంచారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఆ ఘనతను మోదీకి కట్టబెడుతూ ఒక తీర్మానం కూడా చేసింది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతూ వుంటే బిజెపి హెడ్‌క్వార్టర్స్‌కు ఒకే ఒక్క మంత్రి – ప్రకాశ్ జావడేకర్ వచ్చారు. ఫలితాలు పూర్తిగా రానీయండి అని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత మురళీధరరావు, షా నవాజ్ హుస్సేన్, శంభిత్ పాత్రా, జివిఎల్ నరసింహారావు టీవీ చర్చలకు వచ్చారు. వారికి అప్పగించిన పని – అపజయానికి, మోదీకి కించిత్తు కూడా సంబంధం లేదని వాదించడం! ఇంకాస్సేపటికి బిజెపి సీట్ల సంఖ్య సింగిల్ డిజిట్లో ఆగిపోతుందని తెలిసింది. ఇక బిజెపి జనరల్ సెక్రటరీ రామ్ లాల్ కొందరు నాయకులతో కలిసి కూర్చుని చర్చించి 'బిజెపికి ఓట్ల శాతం కొద్దిగానే తగ్గింది' అనే వాదనను ముందుకు తెస్తూ గత ఎసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చెప్పారు. పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే దారుణంగా పడిపోయిందన్న విషయం ప్రస్తావించలేదు. ఆ తర్వాత కొందరు మేధావులు ఢిల్లీ ఎన్నికలలో బిజెపి కావాలనే ఓడిపోయిందనే వింత వాదన, ఆరెస్సెస్ సహకరించలేదు కానీ లేకపోతేనా.. అమ్మో అంటూ యింకో వాదన యివన్నీ ప్రచారం చేశారు. ఓడిపోవాలనుకునేవారు పత్రికలలో 120 యాడ్స్ యివ్వరు, చతురంగ బలాలను మోహరించరు. జరిగింది జరిగిపోయింది. జరగాల్సినది ఏమిటి అన్నదే ముఖ్యమైన ప్రశ్న. హిందూత్వ ప్రచారం తమకు నష్టం కలిగిస్తోందని గ్రహించిన మోదీ మతపరమైన దాడులు సహించం అంటూ గట్టిగా మాట్లాడారు. అలాగే భూసేకరణ చట్టానికి మార్పులు తెస్తూ చేసిన ఆర్డినెన్సును చట్టరూపంలో తెచ్చేటప్పుడు కొన్ని మార్పులు కూడా చేయవచ్చు. తాము పేదలకు మేలు చేస్తున్నామని చూపించుకోకపోతే ఆ వర్గాలు తమకు పూర్తిగా దూరమవుతాయనే భయం కలగడం సహజం కాబట్టి యీ సారి బజెట్‌లో పెట్టుబడిదారీ విధానాలు తగ్గించుకోవచ్చు. – (సమాప్తం)
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)