‘ఆంధ్రా పోరీ’ టైటిల్‌ ఓకేనా.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయి, తెలంగాణ ` ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉద్యమాల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర అన్న పదాలకు దూరంగా సినీ పరిశ్రమ వ్యవహరించింది. ఏ పేరు ఉచ్ఛరిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన సినీ…

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయి, తెలంగాణ ` ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉద్యమాల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర అన్న పదాలకు దూరంగా సినీ పరిశ్రమ వ్యవహరించింది. ఏ పేరు ఉచ్ఛరిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన సినీ జనాలది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. ఇప్పుడు రెండూ కావాలి తెలుగు సినీ పరిశ్రమకి. తప్పదు మరి.. తెలుగు సినిమా మనుగడ సాధించాలంటే, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఆడాల్సిందే.. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని తెలుగువారి కోసం.. సినిమాల్ని ప్రపంచమంతా విడుదల చేస్తున్నారు.

ఇక, అసలు విషయానికొస్తే దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు పూరి ఆకాష్‌, ‘ఆంధ్రా పోరీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదే హీరోగా అతనికి తొలి సినిమా. ‘చిరుత’, ‘బుజ్జిగాడు’.. ఇలా పలు తెలుగు సినిమాల్లో బాల నటుడిగా నటించిన ఆకాష్‌, ఈ చిత్రంతో హీరోగా మారాడు. హీరోగా తొలి చిత్రమంటే అనేక జాగ్రత్తలు తీసుకుంటారెవరైనా. వివాదాల జోలికి అసలే పోరు.

మరి, పూరి సినిమాకి ‘ఆంధ్రా పోరి’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టినట్లు.? ఇది సమీప భవిష్యత్తులో వివాదాస్పదమైతేనో.? అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. అసలే పూరి సినిమాలంటే మహిళా సంఘాలకి ప్రత్యేకమైన ‘అభిమానం’. హీరోయిన్లను అసభ్యంగా చూపిస్తారన్న విమర్శలు ఎదుర్కొన్నారు పూరి గతంలో. ‘ఆంధ్రా పోరి’ పూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కాకపోయినా, ఆయన తనయుడు హీరోగా నటిస్తున్న సినిమా.

‘ఆంధ్రా పోరి’ పేరుతో రానున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా బుల్లితెర నటి ఉల్కా గుప్త, తాను ‘ఆంద్రా పోరీ’గా కన్పించనున్నాంటూ  ప్రారంభోత్సవంలో తెగ సంబరపడిరది. అసలే మనోభావాలంటూ చిన్న విషయానికీ సినిమాల్ని వివాదాస్పదం చేసేస్తున్నారు కొందరు. మనోభావాల పేరుతో కొన్ని సినిమాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా. 

‘లింగ’ సినిమా ఆల్రెడీ వివాదంలో చిక్కుకుంది. మరి, ‘ఆంధ్రా పోరి’ టైటిల్‌పై వస్తున్న అనుమానాలేమవుతాయో.! కంటెంట్‌ తెలియకుండా పబ్లిసిటీ కోసం వివాదాలు సృష్టిస్తోన్నవారికి ‘ఆంధ్రా పోరి’ చిక్కుతుందా? వేచి చూడాల్సిందే.