గోవిందుడు సక్సెస్ మీట్ జరిగిపోయింది. విడుదలై పన్నెండు రోజులయింది.ముఫై నాలుగు కోట్లు కలెక్షన్లు వచ్చాయని చెబుతున్నారు. డిసిఆర్ లు చూసిన వారు ఎవరూ లేరు. సరే కాదని ఖండించినా, అవునని తలూపినా సరే, బయ్యర్లు అగచాట్లు మాత్రం మారవు. అమ్మిన ఏరియాలు కొన్నే. మరికొన్ని బయ్యర్లు, అడ్వాన్స్ లు దొరక్క నిర్మాతే పంపిణీ చేసుకున్నారు.
కొన్నబయ్యైర్లు కూడా ఈ రోజుకు సేఫ్ కాలేదు అన్నది నికార్సయిన వాస్తవం. ఒక్కో బయ్యరు గట్టెక్కాలంటే, గడచిన వారంలో వున్న మాదిరిగా కలెక్షన్లు మరో వారం వుండాలి. కానీ కలెక్షన్లు రెండు రోజుల క్రితమే ఢమాల్ మని కింద పడ్డాయి. దీంతో బయ్యర్లు తమ తమ నష్టాలు ఎంత అన్నది లెక్క వేసుకునే పనిలో పడిపోయారు. గుంటూరు ఏరియా కొన్న పంపిణీదారుకే ఎనభై దాకా ఇంకా రావాలట. అడుగు బొడుగు కలెక్షన్లు ఏమి వచ్చినా ఈవారం మాత్రమే.
వచ్చేవారం కరెంటు తీగ, లైలా కోసం రెండూ అంచనాలున్న సినిమాలే. ఈ వారం కూడా సినిమాల పడినా, వాటిలో దిక్కులు చూడకు రామయ్యా ఒక్కటే కాస్త కలెక్షన్లు రాబట్టుకునే అవకాశం వుంది. అందువల్ల గోవిందుడు బయ్యర్లకు ఈ వారం దింపుడు కళ్లం ఆశ మిగిలి వుంది. కానీ ఈ వారంతో గట్టెక్కుతారన్నది అత్యాశే. కాస్త కవరింగ్ మాత్రమే జరుగుతుంది. ఇదిలా వుంటే బయ్యర్లను నష్టాలపై పెదవి విప్పవద్దని, వాటిలో కొంత మేరకు తన ఎన్టీఆర్ సినిమాతో భర్తీ చేస్తానని నిర్మాత బండ్ల గణేష్ హామీ ఇస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.