సమ్మర్ సీజన్ భలే చిత్రంగా మారింది. పెద్ద సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియక చిన్న సినిమాలు సెన్సారు సర్టిఫికెట్ చేతిలో పట్టుకుని, థియేటర్ల వైపు చూస్తూ కూర్చుంటున్నాయి. ఈవారం ఉత్తమ విలన్ ఊడబొడుస్తుందని, గంగ ముంచేస్తుందని భయపడో, జాగ్రత్తపడో కొన్ని సినిమాలు వెనక్కు వెళ్లిపోయాయి. వాటిల్లో మంచు లక్ష్మి దొంగాట, క్రిష్..దాగుడు మూతల దండాకోర్ వున్నాయి. దాగుడు మూతల…డేట్ ముందుగానే ఇచ్చేసారు. మే 9న అని. మే 8న లయన్ వుండనే వుంది. అయినా ఇక తెగించక తప్పలేదు.
ఇదిలా వుంటే మే 1 న అంటే ఈరోజు రావాల్సిన గంగ, ఉత్తమవిలన్ రావడం లేదు అని, గంగ కూడా డిటో డిటో అని తెలియగానే రేపే మేం వస్తున్నాం అంటూ దొంగాట టీమ్ నుంచి సమాచారం అందించింది. ఇంతలోనే గంగ వుందటూ కబురు. దాంతో దొంగాట టీమ్..తూచ్..మేం ఇప్పుడు రావడం లేదు 8న వస్తున్నాం అంటూ మరో కబురు. చిన్న సినిమాలు విడుదల తేదీకి ఎంత కిందా మీదా పడుతున్నాయి, ఆచి తూచి అడుగేయాల్సిన పరిస్థితి ఏమేరకు వుంది అన్నదానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.
అయితే గంగకు సినిమాతో సంబంధం లేకుండా వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, దొంగాట కావచ్చు, ఉత్తమ విలన్ కావచ్చు, రాకపోవడమే మంచిదేమో అని కూడా అనిపిస్తోంది. అది సరే, ఇంతకూ 8న లయన్ మీదకు మాత్రం దొంగాట, దాగుడుమూతల దండాకోర్ కచ్చితంగా వస్తాయా అన్నది కూడా అనుమానంగా వుంది. ఎందుకంటే బాలయ్య సినిమా హిట్ అంటే మాత్రం అది ఓ రేంజ్ లో వుంటుంది.