తమిళనాట పన్ను మినహాయింపుల కోసం పవర్ పాండీ కాస్తా “పా పాండీ”గా మారింది. పేరు మారితేనేం, సినిమాలో పవర్ మాత్రం ఏమాత్రం మారలేదు. అదిరిపోయే స్టోరీలైన్, అల్టిమేట్ టైమింగ్.. మరీ ముఖ్యంగా రాజ్ కిరణ్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. ఓ ఫక్తు తమిళ సినిమా గురించి తెలుగు ఆడియన్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ పా పాండీ గురించి మాత్రం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. సీనియర్ హీరోలతో నిండిపోయిన టాలీవుడ్ కు పా-పాండీ లాంటి కథల అవసరం ఎంతైనా ఉంది.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా చాలామంది సీనియర్లున్నారు మనకు. వీళ్లతో పాటు మోహన్ బాబు, జగపతిబాబు లాంటి నటులు కూడా ఉన్నారు. వీళ్లందరికీ సెట్ అయ్యే స్టోరీలైన్ ఇది. వయసు మీద పడుతుందంటే వీళ్లలో కొందరు ఒప్పుకోకపోవచ్చు. ఇలాంటి కథల్నిరిజెక్ట్ చేయొచ్చు. కానీ హీరోయిజం చూపిస్తూనే, పెద్దరికం నిలుపుకునే ఇలాంటి పాత్రలు అరుదుగా మాత్రమే దొరుకుతాయి. కచ్చితంగా మన సీనియర్ హీరోలు కన్సిడర్ చేయాల్సిన కథ ఇది.
ఓ ఏజ్ బార్ స్టంట్ మాస్టర్ జీవితంలో జరిగే కుటుంబ సంఘటనలు, లవ్ స్టోరీ ఆధారంగా పా పాండీ సినిమా తెరకెక్కింది. ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ అయినా కంటెంట్ లో మాత్రం కావాల్సినన్ని కమర్షియల్ హంగులున్నాయి. మరీ ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, హార్ట్ టచింగ్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసుకునే అవకాశమున్న వెరీ ఫ్లెక్సిబుల్ స్టోరీలైన్ ఇది.
మనసుకు హత్తుకునే ఇలాంటి కథల్లో చిరంజీవి లాంటి బడా స్టార్ నటిస్తే చాలా బాగుంటుంది. అయితే ఈ సినిమా చేసిన తర్వాత మళ్లీ ఖైదీ నంబర్-150 లాంటి కమర్షియల్ సినిమాల్ని చిరు టచ్ చేయలేరు. ఇప్పటికే మోహన్ బాబు ఈ సినిమా రీమేక్ రైట్స్ పై కర్చీఫ్ వేశారని టాక్. హీరో ధనుష్, ఈ సినిమాకు దర్శకుడు.