చిరంజీవి నటించిన సినిమా.. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ ట్రా ప్రదర్శనలకు ప్రత్యేక అనుమతి కూడా వచ్చేసింది. ఇలా అన్నీ కలిసొచ్చినప్పటికీ నైజాంలో సైరా సినిమా టాప్ లో నిలవలేకపోయింది. దీనికి కారణం వార్ సినిమా. రిలీజ్ కు ముందు నుంచి ట్రేడ్ ఎనలిస్టులు ఏదైతే అంచనా వేస్తూ వచ్చారో అదే జరిగింది. నైజాంలో సాహోను సైరా బీట్ చేయలేకపోయింది. దీనికి కారణం వార్ సినిమా.
వార్ సినిమా ఉత్తరాదిలో మాత్రమే సైరాకు పోటీగా నిలుస్తుందని అంతా భావిస్తూ వచ్చారు. కానీ నైజాంలో కూడా ఈ సినిమా సైరాకు మొదటిరోజు పెద్ద పోటీనిస్తుందని ట్రేడ్ ముందు నుంచి అంచనా వేస్తూ వచ్చింది. అదే ఇప్పుడు నిజమైంది. ఒక్క హైదరాబాద్ లోనే విడుదల రోజు వార్ సినిమాకు అటుఇటుగా 200 షోలు పడ్డాయి. ఈ ప్రభావం సైరా మొదటిరోజు వసూళ్లపై పడింది. నిజంగా వార్ సినిమా పోటీలో లేకుండా ఉన్నట్టయితే, ఒకవేళ విడుదలైనా హైదరాబాద్ లో ఇన్ని షోలు లేకుండా ఉన్నట్టయితే నైజాంలో సైరా నంబర్ వన్ స్థానంలో నిలిచేది. సాహో సినిమాకు ఇలాంటి పోటీ లేకపోవడం కలిసొచ్చింది.
కానీ వార్ మూవీ సైరాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా నైజాంలో ఆల్ టైమ్ హిట్ సినిమాల జాబితాలో సైరా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొదటిరోజు వసూళ్లలో ప్రభాస్ నటించిన సాహో సినిమా (రూ.9.40 కోట్లు) నంబర్ వన్ స్థానంలో నిలవగా.. బాహుబలి-2 సినిమా (రూ. 8.90 కోట్లు) రెండో స్థానంలో కొనసాగుతోంది. 8 కోట్ల 10 లక్షల రూపాయల షేర్ తో సైరా సినిమా మూడో స్థానానికి పరిమితమైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటిరోజు 38 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఉత్తరాంధ్ర, నెల్లూరులో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ సినిమా… అటు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో కలుపుకొని మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది.