విడుదలకు ముందు సంగతి. బచ్చల మల్లి ట్రయిలర్ లో అల్లరి నరేష్ క్యారెక్టర్ చూసి చాలామంది అర్జున్ రెడ్డితో పోల్చారు. అల్లరోడి కెరీర్ కు ఇది అర్జున్ రెడ్డి స్థాయి చిత్రమౌతుందని ఊహించారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. బచ్చల మల్లి బోల్తాపడ్డాడు. అసలు అర్జున్ రెడ్డిలో ఉన్నదేంటి? బచ్చల మల్లిలో మిస్సయిందేంటి?
ఏ పాత్రకైనా ఆర్క్ చాలా ముఖ్యం. ఓ పాత్ర ఎలా మొదలైంది, ఎలా ప్రవర్తించింది, ఆ పాత్ర ఎలా ముగిసిందనేది చాలా ఇంపార్టెంట్. అర్జున్ రెడ్డిలో ఇవన్నీ పరిపూర్ణంగా కనిపిస్తాయి. నిర్లక్ష్యంగా ఉండే ఓ కుర్రాడు అర్జున్ రెడ్డి. చదువులో టాప్. కానీ యాంగర్ మేనేజ్ మెంట్ లో జీరో. అతడు తన కెరీర్ ను, జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు, తర్వాత తనకుతాను ఎలా పరివర్తన చెందాడనేది అర్జున్ రెడ్డి. ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకు తెలిన ఓ వ్యక్తి జీవితాన్ని దగ్గరగా చూస్తున్న ఫీలింగ్.
దాదాపు అదే ఫీలింగ్ బచ్చల మల్లి పాత్రను చూసినప్పుడు కూడా కలుగుతుంది. కానీ తొలి 10-15 నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత ఆ పాత్ర రకరకాలుగా మారిపోతుంది. నిజజీవితంలో ఉన్న ఓ వ్యక్తిని చూసి రాసుకున్న ఈ క్యారెక్టర్ ను, అర్జున్ రెడ్డి అంత బలంగా దర్శకుడు చెప్పలేకపోయాడు. ఒక దశలో అల్లరి నరేష్ పాత్ర ఓవరాక్షన్ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందంటే, అది ఆ పాత్ర తప్పు లేదు, రాసుకున్న సన్నివేశాల్లో లోపం.
అర్జున్ రెడ్డి తరహాలోనే బచ్చల మల్లి కూడా మూర్ఖుడు. తను అనుకున్నదే చేస్తాడు. అర్జున్ రెడ్డిలా బచ్చల మల్లి కూడా ముందువెనక ఆలోచించడు. అర్జున్ రెడ్డిలో కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ప్రేయసి దూరమైందనే పెయిన్ ఉంటుంది. మరో అమ్మాయిని అతడు సెక్స్ పరంగా చూస్తాడే తప్ప, ప్రేమించాలని అనుకోడు. వీటిలో కొన్ని లక్షణాలు బచ్చల మల్లిలో కూడా కనిపిస్తాయి.
కానీ అర్జున్ రెడ్డి అంత తీవ్రత బచ్చల మల్లిలో కనిపించదు. అర్జున్ రెడ్డిలో ప్రతి సన్నివేశంలో తీవ్రత కనిపిస్తుంది. అలాంటి సీన్లు బచ్చల మల్లిలో ఎక్కడా కనిపించవు. అందుకే బచ్చల మల్లి మరో అర్జున్ రెడ్డి కాలేకపోయాడు. కనీసం ఆ దరిదాపులకు కూడా వెళ్లలేకపోయాడు.