అప్పుడూ …ఇప్పుడూ పెద్దాయన మౌనమే!

కవిత మాదిరిగా ఆయన్ని కూడా తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త ఏడాదిలో కేసీఆర్ కుటుంబానికి కష్టాలు తప్పేలా లేవు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దాయన, తెలంగాణ సాధకుడు, దానికి రెండుసార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ అప్పుడూ, ఇప్పుడూ మౌనంగానే ఉన్నారు.

అప్పుడూ అంటే …ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన గారాల పట్టి కవిత అరెస్టయి నెలలపాటు తీహార్ జైలులో ఉన్నప్పుడూ ఒక్క మాటా మాట్లాడలేదు. ఇప్పుడు …కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా -ఈ రేసులో వందల కోట్ల అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ మరియు ఈడీ కేసులు నమోదు చేసినా, పది రోజుల తరువాత అరెస్టు అవుతాడన్న వార్తలు వస్తున్నా కేసీఆర్ పెదవి విప్పడం లేదు.

ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడంలేదు. ఆయన మౌనంపై కాంగ్రెస్ పార్టీలో, గులాబీ పార్టీలో, ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆయన వ్యవహార శైలి అర్థం కాక అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఏడాది ఆయన ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తరువాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.

కేటీఆర్ మీద ఏసీబీ, ఈడీ కేసులు నమోదయ్యాక కేసీఆర్ తీవ్రంగా కలత చెందుతున్నట్లు సమాచారం. కానీ ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో, ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారో సమాచారం లేదు. కొత్త ఏడాదిలోనైనా కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి జనంలోకి వచ్చి మాట్లాడతారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఒకవేళ కేసీఆర్‌ను ఈడీ అరెస్టు చేస్తే ఆరు నెలల వరకు బెయిల్ రాదని కొందరు అంటున్నారు. కవిత మాదిరిగా ఆయన్ని కూడా తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త ఏడాదిలో కేసీఆర్ కుటుంబానికి కష్టాలు తప్పేలా లేవు.

4 Replies to “అప్పుడూ …ఇప్పుడూ పెద్దాయన మౌనమే!”

  1. ఏమి పీకలేనప్పుడు నోరేసుకుని పడిపోయి అభాసు పాలు అయ్యే కన్నా సైలెంట్ గా ఉంటె అదే పెద్ద స్ట్రాటజీ అని భజనగాళ్ళ తో డప్పు కొట్టించుకోవచ్చు కదా

Comments are closed.