అమ్మాయిలంతా హీరోయిన్లను ఫాలో అవుతుంటారు. వాళ్లలా డ్రెస్ వేసుకోవాలని, వాళ్లలా మేకప్ అవ్వాలని కోరుకుంటారు. ఈ దిశగా చాలామంది అమ్మాయిలు, హీరోయిన్లను అనుకరిస్తుంటారు, వాళ్ల ట్రెండ్స్ ఫాలో అవుతుంటారు. మరి హీరోయిన్లలా ముఖాన్ని నిగారింపుగా ఉంచుకోవడం ఎలా? దీనికి స్వయంగా ఆ హీరోయిన్లే ముందుకొచ్చి సమాధానం చెబితే ఎలా ఉంటుంది?
ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉండేందుకు ఏం చేస్తున్నారో బాలీవుడ్ హీరోయిన్లు స్వయంగా బయటపెట్టారు. ఈ ఏడాది అలా బ్యూటీ టిప్స్ ను బయటపెట్టిన హీరోయిన్లలో మాధురీ దీక్షిత్ నుంచి కరీనా కపూర్ వరకు చాలామంది ఉన్నారు. ఆ స్కిన్ కేర్ టెక్నిక్స్ ఏంటో మీరూ చూసేయండి.
మలైకా అరోరా
ఈమె వయసు పెరుగుతుంది. కానీ ఆ ఛాయలు ముఖంలో మాత్రం కనిపించవు. దీనికి కారణం మలైకా పాటించే ఓ ఇంటి చిట్కా. రోజూ పొద్దున్న లేచిన వెంటనే ముఖానికి అలొవెరా (కలబంద) జెల్ పట్టిస్తుంది ఈ భామ. మన చర్మం ఏ టైపుదైనా ఈ జెల్ అన్ని రకాల చర్మాలకు సూట్ అవుతుందని చెబుతోంది.
డ్రై స్కిన్ అయినా, ఆయిలీ స్కిన్ అయినా, మొటిమలు ఉన్నవాళ్లైనా.. ఇలా ఎవరైనా ఈ జెల్ వాడితే నిగారింపు ఆటోమేటిగ్గా వస్తుందని చెబుతోంది. మరి మలైకా ఏ కంపెనీకి చెందిన అలోవెరా జెల్ వాడుతుందో తెలుసా? ఆమె ఏ బ్రాండ్ వాడదు. తన పెరట్లోనే సహజసిద్ధంగా పెరిగిన ఆలోవెరా మొక్కల నుంచి జెల్ తీసి వాడుతుంది.
మాధురీ దీక్షిత్
మలైకా ఆలోవెరా వాడుతుంటే.. మాధురీ దీక్షిత్ మాత్రం రోజ్ వాటర్, విటమిన్-సి సిరమ్ వాడుతుంది. ఇప్పుడు ఆమె చెప్పే స్కిన్ కేర్ టిప్ ఏంటో చూద్దాం. రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ తో ముఖం కడుక్కోవాలి. తర్వాత విటమిన్-సి రాసుకొని పడుకోవాలి.
ఇలా చేయడం వల్ల రోజంతా ముఖంపై పేరుకుపోయిన డస్ట్ తొలిగిపోతుందట. ఇక ఉదయం లేచిన తర్వాత మరోసారి రోజ్ వాటర్ తో ముఖం కడుక్కొని, సన్-స్క్రీన్ లోషన్ రాసుకుంటుందట మాధురి. ఇలా చేయడం వల్ల రోజంతా ముఖం మెరుస్తుందని ఆమె చెబుతోంది.
భాగ్యశ్రీ
ఇక భాగ్యశ్రీ ఏం చెబుతోందో చూద్దాం. 90ల్లో కుర్రకారును ఓ ఊపు ఊపిన ఈ నటికి ఇప్పుడు 50 ఏళ్లు వచ్చాయి. అయినప్పటికీ ఆమె ముఖంలో మెరుపు అలానే ఉంది. దీనికి కారణం ఆమె సొంతంగా తయారుచేసుకున్న ఫేస్ ప్యాక్.
ఓట్స్ పౌడర్ లో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ పాలు కలిపి ముద్దలా చేసి ముఖానికి రాసుకుంటుందట భాగ్యశ్రీ. బాగా ఆరిన తర్వాత స్మూత్ గా రబ్ చేస్తూ ముఖం కడుక్కుంటుందట. కొన్నేళ్లుగా తను ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాననంటూ.. తన స్కిన్ కేర్ టిప్ బయటపెట్టింది భాగ్యశ్రీ.
బిపాసా బసు
ఒకప్పుడు కుర్రాళ్ల మతులు పోగొట్టిన బ్లాక్ బ్యూటీ బిపాసా బసు కూడా తన గ్లామర్ సీక్రెట్ బయటపెట్టింది. మందార ఆకుల పొడిలో ఆలోవెరా జెల్, శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్ లా రాసుకుంటుందట బిపాసా.
ఇలా చేయడం వల్ల ముఖం నిగారించడంతో పాటు కళ్లకు, శరీరానికి కూడా చాలా మంచిదని చెబుతోంది. అయితే ఈ ప్యాక్ లో అన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలని చెబుతోంది.
కరీనాకపూర్
ఇప్పుడు కరీనాకపూర్ విషయానికొద్దాం. పెళ్లయి, ఓ అబ్బాయి ఉన్నప్పటికీ ఆమె ఫిజిక్ ను బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తోంది. మరి ముఖవర్చస్సు తగ్గకుండా ఉండేందుకు ఆమె ఏం చేస్తోంది? దీనికి స్వయంగా కరీనానే సమాధానం చెబుతోంది. 2 టేబుల్ స్పూన్స్ చందనం, 2 డ్రాప్స్ విటమిన్-ఇ, చిటికెడు పసుపు, కొంచెం పాలు మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ తయారుచేసుకుంటుంది బెబో.
ఈ ప్యాక్ ను ముఖానికి పట్టింది, 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖం కడుక్కుంటే సరిపోతుంది. తను కొన్నేళ్లుగా ఇదే ప్యాక్ ను పట్టిస్తున్నానంటూ, తన వంటింటి చిట్కాను బయటపెట్టింది కరీనా.
లాక్ డౌన్ టైమ్ లో నభా నటేష్, కీర్తిసురేష్, కల్యాణి ప్రియదర్శన్, నివేత పెతురాజ్, రాశిఖన్నా లాంటి సౌత్ హీరోయిన్లు కూడా ఇలాంటి చిన్న చిన్న బ్యూటీ టిప్స్ బయటపెట్టారు. అయితే శృతిహాసన్ లాంటి హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో బ్రాండెడ్ ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడ్డారు.