ప్రతి సినిమా టీజర్ కు ఒక్కో పద్ధతి ఫాలో అవుతారు. సినిమా నుంచి ఫస్ట్ వచ్చే కంటెంట్ కాబట్టి, ఎక్కువమంది జానర్ చెప్పడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది నేరుగా తమ టార్గెట్ ఆడియన్స్ ను లక్ష్యంగా చేసుకొని టీజర్ రిలీజ్ చేస్తుంటారు. ఈరోజు రిలీజైన మనమే సినిమా టీజర్ కు మరో పద్ధతి ఫాలో అయ్యారు.
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ తో ఇప్పటికే ఆడియన్స్ కు ఓ క్లారిటీ వచ్చింది. అందుకే ఈసారి టీజర్ తో పాత్రల్ని పరిచయం చేశారు.
మనమే సినిమాలో కీలకమైన పాత్రలు మూడే. ఆ 3 పాత్రలు, వాటి స్వభావాల్ని ఇందులో చూపించారు. ఇందులో హీరో జీవితాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడే ఛిల్ బాయ్. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తాడు కానీ, కనిపించినంత అమాయకుడు మాత్రం కాదు. ఈ విషయాన్ని తనే డైలాగ్ రూపంలో చెబుతాడు. ఇక హీరోయిన్ ను బాధ్యతాయుత అమ్మాయిగా చూపించారు. వీళ్లిద్దరి మధ్యలో ఓ బాబును ప్రవేశపెట్టారు.
హీరో, హీరోయిన్లకు ఎలా పరిచయం అవుతుంది.. వీళ్ల మధ్యలోకి బాబు ఎలా వచ్చాడు.. లాంటి విషయాలపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ టీజర్ కట్ చేశారు. పాత్రలు ఎంత బాగున్నాయో.. టీజర్ లో విజువల్స్ అంతకంటే బాగున్నాయి. ఇక హేషమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది.
నిజజీవితంలో తండ్రి అయిన శర్వానంద్, సరైన టైమ్ లో సరైన రోల్ సెలక్ట్ చేసుకున్నట్టున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ సమ్మర్ లోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం శ్రీరామ్ ఆదిత్య.