బిగ్‌బాస్ సీజన్ నడిచినంత కాలం అందులో పాల్గొనే వారికి వీర ఫాలోయింగ్ వుంటుంది. హౌస్‌లోంచి బయటకు వచ్చాక కూడా ఒక నెల, రెండు నెలల పాటు వారి పట్ల ప్రేక్షకులు క్రేజ్‌తో వుంటారు. అయితే ఆ తర్వాత వారి అటెన్షన్ మరోవైపు డైవర్ట్ అయిపోతుంది.
ఇంతవరకు బిగ్‌బాస్ సీజన్‌కి వెళ్లి అదే జోరు కొనసాగించిన వారెవరూ లేరు. మొన్న ముగిసిన సీజన్‌కి కూడా అదే రిపీట్ అవుతోంది. వారిలో ఎవరికీ వహ్వా అనుకునే సూపర్ అవకాశాలేమీ రాలేదు.
టైటిల్ విజేత అభిజీత్‌తో సహా అందరూ సరయిన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. కాకపోతే బిగ్‌బాస్‌కి వెళ్లడం వల్ల అందరికీ సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం బాగా పెరుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేలల్లో వున్న ఫాలోవర్లు లక్షల్లోకి వెళతారు.
అలాగే యూట్యూబ్‌లో వారు పెట్టిన చానల్స్‌కి కూడా జనం బాగా సబ్‌స్క్రయిబ్ అవుతుంటారు. వీటి ద్వారా వచ్చే ఆదాయం కూడా బాగానే వుంటుంది కనుక బిగ్‌బాస్‌లో వచ్చే ప్రైజ్ మనీకి తోడు ఇదంతా బోనస్ అనుకోవాలి.
అందుకే మిగతా అవకాశాల మాట ఎలా వున్నా కానీ పాపులారిటీ కోసమని స్ట్రగుల్ అవుతోన్న కళాకారులు, అప్‌కమింగ్ ఆర్టిస్టులు హౌస్‌లో అడుగుపెట్టే ఛాన్స్ కోసం చూస్తున్నారు.