కొన్ని రోజుల కిందటి సంగతి. తన మూడో సినిమాకే మృణాల్ ఠాకూర్ తెలుగులో డబ్బింగ్ చెప్పేస్తోందంటూ వార్త. దర్శకుడు పరశురామ్, దగ్గరుండి ఆమెతో తెలుగులో డబ్బింగ్ చెప్పిస్తున్నాడంటూ కొనసాగింపు.
కానీ అలాంటివేం జరగలేదు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో తన పాత్రకు మృణాల్ ఠాకూర్ డబ్బింగ్ చెప్పలేదు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన మృణాల్, దానికి కారణం కూడా వెల్లడించింది.
“దురదృష్టవశాత్తూ నేను ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పలేకపోయాను. లాస్ట్ మినిట్ వరకు షూట్ జరిగింది, రిలీజ్ డేట్ దగ్గరపడింది. మరోవైపు ప్రచారం మొదలైంది. దీంతో నేను డబ్బింగ్ చెప్పలేకపోయాను. హిందీ వెర్షన్ కు మాత్రం నేను తప్పకుండా డబ్బింగ్ చెబుతాను.”
ఇలా డబ్బింగ్ చెప్పలేకపోవడం వెనక కారణాన్ని బయటపెట్టింది మృణాల్. ఇక ఆచితూచి సినిమాలు చేస్తున్న అంశంపై స్పందిస్తూ.. ఏడాదికి 2-3 సినిమాలు చేసేయాలనే ఆశ తనకు లేదంటోంది. చాలామందికి ఓపిక ఉండదని, తను మాత్రం మంచి స్క్రిప్టుల కోసం ఎదురుచూస్తుంటానని తెలిపింది. భవిష్యత్తులో తన సినిమాలు చూసి, తన పిల్లలు గర్వంగా ఫీల్ అవ్వాలని, అదే ఆలోచనతో కథలు ఎంపిక చేసుకుంటానని అంటోంది.