పాన్ ఇండియా లెవెల్లో కన్నప్పను తీయాలి, రిలీజ్ చేయాలనేది మంచు విష్ణు ఆశ. ఆ ఆశకు తగ్గట్టే పాన్ ఇండియా లెవెల్లో స్టార్ కాస్ట్ ను సెట్ చేస్తున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్.. ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ ను తన సినిమాలోకి తీసుకొస్తున్నాడు.
అయితే హీరోయిన్ల విషయంలో మాత్రం మంచు విష్ణు ప్లాన్స్ అనుకున్నవి అనుకున్నట్టు సాగడం లేదు. ఏ ముహూర్తాన ఈ సినిమాలో హీరోయిన్ల గురించి అతడు ప్రయత్నం మొదలుపెట్టాడో, అప్పట్నుంచి ప్రతి ప్రయత్నం బెడిసికొడుతోంది.
కన్నప్ప కోసం ముందుగా నుపూర్ సనన్ ను తీసుకున్నారు. ఆమె పూజా కార్యక్రమాలకు కూడా హాజరైంది. అంతలోనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె తమ సినిమాలో లేదనే విషయాన్ని స్వయంగా మంచు విష్ణు ప్రకటించాడు.
ఆ తర్వాత నుపూర్ సనన్ స్థానంలో ప్రీతి ముకుందన్ ను తీసుకున్నాడు. అయితే మంచు విష్ణు అసలు సమస్య ఇది కాదు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ఉంది. ఆ క్యారెక్టర్ ను నయనతారతో చేయించాలనేది అతడి ఆలోచన. చాన్నాళ్ల పాటు నయనతార పేరు నలిగింది. ఆమె దాదాపు ఫిక్స్ అని అంతా అనుకున్నారు కూడా.
కానీ ఉన్నఫలంగా కన్నప్ప చుట్టూ కాజల్ అగర్వాల్ పేరు వినిపించడం మొదలైంది. అంటే దీనర్థం, ఈ ప్రాజెక్ట్ నుంచి నయనతార కూడా తప్పుకున్నట్టే. ఇలా కన్నప్ప కోసం మంచు విష్ణు ఏ హీరోయిన్ ను అనుకుంటే, వాళ్లు జారిపోతున్నారు. కాజల్ అయినా లాక్ అవుతుందో, జారుకుంటుందో చూడాలి.