Brahma Anandam Review: మూవీ రివ్యూ: బ్రహ్మ ఆనందం

నేపథ్య సంగీతం నీరసంగా, స్క్రీన్ ప్లే నిట్టూర్చేలా, డైలాగ్స్ పేలవంగా సా… గుతూ ఎప్పటికి ముగుస్తుందా అనిపించేలా ఉంది ఈ “బ్రహ్మ ఆనందం”.

చిత్రం: బ్రహ్మ ఆనందం
రేటింగ్: 2/5
తారాగణం: బ్రహ్మానందం, రాజా గౌతం, వెన్నెల కిషోర్, ప్రియ వడ్లమాని, రాజీవ్ కనకాల, సంపత్, తాళ్లూరి రామేశ్వరి, ఈటీవీ ప్రభాకర్, మలయజ, దివిజ ప్రభాకర్, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు
కెమెరా: నితీష్ పర్వతనేని
ఎడిటింగ్: ప్రణీత్ కుమార్
సంగీతం: శాండిల్య పీసపాటి
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
దర్శకత్వం: ఆర్వీఎస్ నిఖిల్
విడుదల తేదీ: 14 ఫిబ్రవరి 2025

ట్రైలర్ చూడగానే సరదాగా సాగిపోయే కంటెంట్ రిచ్ సినిమాలా అనిపించింది. ప్రచారం కూడా బాగా జరగడంతో చూడాలన్న ఆసక్తి కలిగించింది. తారాగణం నిండుగా ఉండంతో అంచానాలు కాస్త పెంచింది. ఇంతకీ విషయమేంటో చూద్దాం.

బ్రహ్మ (గౌతం) ఒక స్టేజ్ నటుడు. అది అతని ప్రొఫెషన్. జాతీయ స్థాయిలో పెద్ద వేదికల మీద ప్రదర్శనలివ్వాలని అతని కోరిక. అలాంటి అవకాశం ఒకటి వస్తుంది. కానీ ఆ అవకాశం పొందాలంటే ఆరు లక్షలు అవసరమవుతాయి. దాని కోసం ప్రయత్నాలు చేసి విఫలమవుతుంటాడు. గిరి (వెన్నెల కిషోర్) ఒక డాక్టర్. బ్రహ్మకి రూం మేట్. తార (ప్రియ వడ్లమాని) బ్రహ్మ ని ఇష్టపడుతుంది. బ్రహ్మ కి తల్లిదండ్రులుండరు. బాబాయి (ఈటీవీ ప్రభాకర్) అతనికి సపోర్ట్ చేస్తానంటాడు. కానీ బ్రహ్మకి అతనితో ఏదో ఈగో క్లాష్. ఆ బాబాయి కూతురు రాశి (దివిజ ప్రభాకర్).

బ్రహ్మకి ఒక తాత.. పేరు ఆనంద రామమూర్తి (బ్రహ్మానందం).. ఓల్డ్ ఏజ్ హోం లో ఉంటాడు. అతనక్కడ ఎందుకున్నాడు? ఏమిటా కథ అనేది ఒక ట్రాక్. ఇంతకీ తాతయ్యని కలవడమంటే టైం వేస్ట్ అనుకునే బ్రహ్మకి ఆనంద రామ్మూర్తి ఒక ఐడియా ఇస్తాడు. తనకి ఒక పల్లెటూరిలో 6 ఎకరాల పొలం ఉందని, తనతో వస్తే అది ఇస్తానని చెప్తాడు. దాంతో ఆ ల్యాండ్ తీసుకుని కళాకారుడిగా తన కల నెరవేర్చుకోవచ్చని తాతతో బయలుదేరతాడు బ్రహ్మ. ఆ తర్వాత ఎమయ్యిందనేది తెర మీద చూడాలి.

అసలు సినిమా మొదలవ్వడమే ఏదో స్టేజ్ డ్రామా చూస్తున్న ఫీలింగొస్తుంది. తెర మీద పాత్రలు ఏవో ఎమోషన్స్ కి లోనవుతుంటాయి కానీ ప్రేక్షకులకి మాత్రం ఏ విధమైన ఫీలింగ్ కలగదు. అసలీ సినిమాని ఏ జానర్ అనుకుని చూడాలో కాసేపటి వరకు అర్ధం కాదు.

కథానాయకుడు బ్రేక్ కోసం చూస్తున్న స్టేజ్ ఆర్టిస్ట్, అతని పక్కన వెన్నెల కిషోర్ లాంటి స్నేహితుడు.. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆర్ధిక ఇబ్బందులు, అవకాశాలు చేజారడాలు, హీరోయిన్ హెల్ప్ చెయ్యాలనుకోవడం.. ఈ సెటప్ చూడగానే “సాగరసంగమం”లో కమల హాసన్, శరత్ బాబు టైపులో అనిపిస్తుంది. కానీ విషయం అది కాదు. ఈ రోజుల్లో స్టేజ్ ఆర్టిస్ట్ ప్రొఫెషన్ ఏంటా .. అని అనుకుంటుండగానే “మంచి ప్రొఫెషనే” అని బ్రహ్మానందం చేత ఒక డైలాగ్ కూడా చెప్పించారు. అక్కడే ఒక పెద్ద నాన్-సింక్.

అదలా ఉంచితే హీరో తాత ఓల్డ్ ఏజ్ హోం కథ, వృద్ధాప్యంలో ఒంటరితనం, తాళ్లూరి రామేశ్వరి పాత్ర.. ఈ నేపథ్యమంతా కాస్త “మిథునం” లా అనిపిస్తుంది.

బ్రహ్మ తాతతో పల్లెటూరికి చేరాక, అక్కడ “సత్యం సుందరం” టైపులో ఏదో ఎమోషనల్ గా చూపిస్తాడేమో అనిపిస్తుంది. కానీ అది కాదు.

ఏదో ఆర్ట్ ఫిల్మ్ స్టైల్లో తీస్తున్నట్టున్నాడు.. అనుకుంటుండగా సడెన్ గా.. బ్రహ్మానందం హాస్య నటుడు కాబట్టి ఆయన చేత కామెడీ చేయించాలని గుర్తొచ్చినట్టుంది.. సగటు కమర్షియల్ సినిమాల్లో లాంటి కామెడీ సీన్లు పెట్టారు ఆయన మీద. ఆ తర్వాత సంపత్, రఘుబాబు, రాజీవ్ కనకాల.. ఈ ట్రాక్ మొత్తంలో సందేశం, కాస్తంత హాస్యం ఉన్నా… ఎంగేజింగ్ కథనంగా మలచడంలో విఫలమయ్యాడు దర్శకుడు.

సినిమా దర్శకత్వానికి, స్టేజ్ డ్రామా దర్శకత్వానికి తేడా ఉంటుంది. డ్రామాలు సీన్ ప్రధానంగా ఉంటాయి. సినిమాల్లో ప్రతి షాట్, ఎక్స్ప్రెషన్, నేపథ్య సంగీతం అన్నీ ముఖ్యమైనవే. ఉదాహరణకి ఒక సీన్లో రాజీవ్ కనకాల సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ గట్టిగా నవ్వుతాడు. ఆ రకమైన నవ్వు కృతకంగా అనిపిస్తుంది సినిమాల్లో. స్టేజ్ డ్రామాల్లో ఓకే. థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు పేస్ ని ఆశిస్తారు. ఆ పేస్ ఉండాలంటే డైలాగ్స్ లో షార్ప్నెస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరిగ్గా ఉండాలి. అవన్నీ దర్శకుడు రాబట్టుకోవాలి. ఆ విషయంలో ఈ చిత్రం వెనుకబడింది. ఎంచుకున్న కంటెంట్ తో సమస్య లేదు కానీ, తీసిన విధానంతోనే ఇబ్బంది.

అదెలా అంటే.. కథలో రెండు కుటుంబాలు. ఒకటి హీరోది, రెండోది రాజీవ్ కనాకాలది. అసలు హీరో తల్లిదండ్రులెవరు? వళ్ళిద్దరూ పోయారా? లేక తండ్రి ఒక్కడేనా? బాబాయంటే హీరోకి ఇబ్బందేమిటి అనేవి ఎస్టాబ్లిష్ చేయలేదు. డైలాగుల్లో చెప్పేస్తే పనైపోయే కంటెంట్ కాదది.

అలాగే సంపత్ పాత్ర ఇంట్లోంచి వెళ్లిపోయి తల్లికి మొహం చాటేయడానికి కారణం కూడా కనపడలేదు. బ్రహ్మానందం- తాళ్లూరి రామేశ్వరి మధ్యన ట్రాక్ ఎమోషనల్ గా పండించాల్సింది. దానిని కామెడీగా చూపించి, ఆడియన్స్ ని అందులో ఎమోషన్ చూడమన్నట్టుంది. ఇలాంటి లూజ్ కనెక్షన్స్ వల్ల కథనంలో కరెంట్ పాసవ్వలేదు. ఆ పొరపాట్లు జరక్కుండా ఉండుంటే ఇది మంచి కంటెంట్ గా నిలబడే సినిమా అయ్యుండేది.

నటీనటుల విషయానికొస్తే గౌతం మంచి నటుడు. ఎక్కువగా సినిమాల్లో నటించకపోయినా బాగా అనుభవమున్నట్టుగానే నటించాడు. అయితే చాలా చోట్ల సుబ్బరాజు తరహా ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ కనిపించాయి.

బ్రహ్మానందం పాత్రలో మునుపటి స్పార్క్ లేదు. దానికి కారణం ఆయన చెప్పినట్టు వయసు మాత్రం కాదు. ప్రధానంగా ఎంచుకునే పాత్రలవల్ల, ఆ పాత్రలకి రాసిన డైలాగుల వల్ల ఆకట్టుకోలేకపోతున్నారనిపించింది.

ప్రియ వడ్లమాని ప్రధామార్ధంలో ఫీమేల్ లీడ్ గా ఓకే. ద్వితీయార్ధంలో ఆమె పెద్దగా కనపడదు. ఐశ్వర్య హోలక్కల్ సెకండాఫ్ లో తెర మీద అందంగా కనిపించడానికి తప్ప నటన పరంగా ఆమె చేయగలిగింది పెద్దగా లేకపోయింది.

వెన్నెల కిషోర్ ఒక్కడూ ఉన్నంతలో నవ్వించగలిగాడు తన మార్క్ డైలాగ్స్ తో. ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ హీరోకి చెల్లెలి పాత్రలో ఆకట్టుకుంది. ఆమె నటనలో ఈజ్ ఉంది. బిజీ నటి కావడానికి ఉండాల్సిన ప్రతిభ ఉందనిపించింది.

రాజీవ్ కనకాల నటనలో ఇంటెన్సిటీ కొరవడింది. కామెడీ టచ్ తో ఉన్న సంపత్ నటన ఓకే. తాళ్లూరి రామేశ్వరి ట్రాక్ మనసుని తాకదు.

నేపథ్య సంగీతం నీరసంగా, స్క్రీన్ ప్లే నిట్టూర్చేలా, డైలాగ్స్ పేలవంగా సా… గుతూ ఎప్పటికి ముగుస్తుందా అనిపించేలా ఉంది ఈ “బ్రహ్మ ఆనందం”. ఈ చిత్రానికి టార్గెట్ ఆడియన్స్ ఎవరనేది అర్ధంకాని “బ్రహ్మ”పదార్ధం; వెతికినా కనపడినిది “ఆనందం”. పేపర్ మీదా బాగుందనిపించిన కథ, నెరేట్ చేసినప్పుడు ఆసక్తిగా అనిపించిన కథనం.. తెరకెక్కాక డీలాపడిందంటే అది దర్శకత్వ లోపమే. ఆర్ట్ ఫిలిం ఆలోచనలతో తీసిన కమర్షియల్ సినిమాలా ఉన్న ఈ చిత్రం హార్ట్ ని మాత్రం తాకనే తాకదు.

బాటం లైన్: హార్ట్ ని తాకని ఆర్ట్ ఫిలిం

7 Replies to “Brahma Anandam Review: మూవీ రివ్యూ: బ్రహ్మ ఆనందం”

  1. బాబూ, స్క్రీన్ ప్లే అంటే ‘స్క్రీన్ మీద జరిగే ప్లే’ కాదు. స్క్రీన్ ప్లే అంటే మూవీ స్క్రిప్ట్. మన తెలుగు వాళ్ళు మాత్రమే ఈ తప్పుడు డెఫినిషన్ ఇచ్చుకుంటూ, స్క్రీన్ ప్లే అంటే అదొక క్రాఫ్ట్ లాగా తెగ ఫీలవుతూ ఉంటారు ……

Comments are closed.