Advertisement

Advertisement


Home > Movies - Reviews

Kota Bommali PS Review: మూవీ రివ్యూ: కోట బొమ్మాళి పి.ఎస్

Kota Bommali PS Review: మూవీ రివ్యూ: కోట బొమ్మాళి పి.ఎస్

చిత్రం: కోట బొమ్మాళి పి.ఎస్
రేటింగ్: 2.5/5
నటీనటులు:
శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళిశర్మ, బెనెర్జీ తదితరులు
సంగీతం: రంజిన్ రాజ్
కెమెరా: జగదీష్ చీకటి
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్య కొప్పినీడి
దర్శకత్వం: తేజ మర్ని
విడుదల: నవంబర్ 24, 2023

ఓటీటీలో మళయాళ చిత్రం "నాయట్టు" సరిహద్దులు దాటి ఇతర భాషలవారిని కూడా ఆకట్టుకుంది. ఆ చిత్రానికి రీమేక్ ఈ "కోటబొమ్మాళి పి.ఎస్".

రామకృష్ణ (శ్రీకాంత్) అనే సీనియర్ కానిస్టేబుల్, ప్రవీణ్ (రాహుల్ విజయ్), కుమారి (శివాని రాజశేఖర్) అనే జూనియర్ కానిస్టేబుల్స్ శ్రీకాకుళం జిల్లాలోని కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంటారు. అనుకోకుండా ఒక రోజు రాత్రి వారు ప్రయాణిస్తున్న పోలీస్ జీప్ ఒక రాజకీయవర్గానికి చెందిన వ్యక్తిని ఢీకొంటుంది. అతను మరణిస్తాడు. మరో రెండ్రోజుల్లో ఎన్నికలు. పరిస్థితులన్నీ రాజకీయవర్గానికే సానుకూలంగా ఉంటాయి. పైగా ఈ కానిస్టేబుల్స్ లో ఇద్దరు తాగి వెహికల్ నడిపినట్టు గుర్తిస్తాడు ఒక డాక్టర్. కనుక అది పెద్ద క్రైం. అప్పటికే ఈ రాజకీయ వర్గానికి, ఇదే కానిస్టేబుల్స్ కి మధ్య ఒక ఘర్షణ జరుగుతుంది. ఆ గుంపంతా వీళ్ల వెంట పడుతుంటే ఈ ముగ్గురు వేరే దారి లేక అక్కడి నుంచి పారిపోతారు.

24 గంటల్లో ఆ ముగ్గురినీ పట్టుకు తీరతామని తొడగొట్టి మీడియా ముందు ప్రతిజ్ఞ చేస్తాడు అక్కడి నాయకుడు (మురళి శర్మ).

ఇంతకీ ఆ కనిస్టేబుల్స్ పారిపోయి ఎక్కడికెళ్తారు? వాళ్ల సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఎందుకు తోడ్పాటు అందదు? పోలీసులయ్యుండి పోలీసుల బారి నుంచి, రాజకీయ ముఠాల నుంచి పారిపోవడమేంటి? అవే ఈ చిత్రానికి హుక్ పాయింట్స్.

ఆద్యంతం ఆసక్తికరంగా సాగే మలయాళ మాత్రుకకి కొన్ని మార్పులు చేసారు మనవాళ్లు. మూలచిత్రం సరిగ్గా 2 గంటలుంటే, ఈ రీమేక్ కి మరొక 20 నిమిషాల నిడివి పెరిగింది. అయితే ఆ సన్నివేశ విస్తరణలో కొన్ని అతిగా, మరీ సినిమాటిక్ గా ఉంటే.. కొన్ని పర్వాలేదనిపిస్తాయి. మొత్తంగా చూసుకుంటే అంతగా చెడగొట్టని మార్పులే చేసారు ఈ తెలుగు రీమేక్ లో.

దర్శకుడు తేజ మర్నిని ఎక్కడ అభినందించాలంటే.. ఒరిజినల్ స్టోరీని తీస్తూనే మరీ ఫ్రేం టు ఫ్రేం అనుకరించకుండా సొంతగా ఆలోచించి చేసినందుకు.

"నాయట్టు" చూసినవాళ్లకి కొన్ని కంప్లైంట్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే అది పూర్తిగా వాస్తవికతకి దగ్గరగా నడుస్తుంది. ఇది కొంచెం కమెర్షియల్ యాంగిల్ తీసుకుంది.

హీరో క్యారెక్టర్ కి మాజీ గ్రేహౌండ్స్ షూటర్ అని ఎలివేషన్ ఇవ్వడం, రాజకీయ సన్నివేశాలు పెట్టి సాగదీయడం మొదలైనవి అనవసరమనిపిస్తాయి. అయితే ఒరిజినల్ చూడని వాళ్లకి మాత్రం ఆ కంప్లైంట్స్ ఉండవు.

మలయాళంలో జోజు జార్జ్ చేసినంత సహజంగా ఇక్కడ శ్రీకాంత్ చేయలేదు. తన పాత్ర డ్రమటిక్ గా ఉంది.

రాహుల్ విజయ్, శివాని మాత్రం తమ పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోయారు. న్యాయం కూడా చేసారు.

వరలక్ష్మి క్యారెక్టర్ బాగుంది. తన స్టైల్లో తాను చేసుకుపోయింది.

మురళీశర్మ ఎంతోకొంత కొత్తదనం చూపే ప్రయత్నం చేసాడు. ఈ మధ్యన సినిమాల్లో ఏదో ఒక మేనెరిజం పెట్టుకుంటున్నట్టే ఇందులో కూడా ఒక మేనరిజం పెట్టుకున్నాడు.

టెక్నికల్ అంశాలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానీ, కెమెరా, ఎడిటింగ్ లు గానీ ఒరిజినాలిటీని చాటుకున్నాయి. పాపులరైన "లింగిడి లింగిడి" పాట కూడా ఫ్లో కి అడ్డుపడకుండా బాగుంది.

ప్రధమార్థంలోనూ, ద్వితీయార్థంలోనూ కొన్ని లాజిక్ మిస్సులైతే లేకపోలేదు. "మొట్టమొదటి పోలీస్ నక్సల్ జాయింట్ ఆపరేషన్" అంటూ కొత్త యాంగిల్ పెట్టే ప్రయత్నం చేసారు. గ్రేహౌండ్స్ షూటర్ కి నక్సల్స్ అండ ఎందుకుంటుంది? ఆ లాజిక్కుల్లోకి వెళ్లకుండా కన్వీనియంట్ గా కథలో ఆ భాగాన్ని అల్లేసుకున్నాడు దర్శకుడు.

సీరియస్ హంటింగ్ సినిమాలు, ఇంటిలిజెంట్ మిస్లీడింగ్స్, ఎత్తుకు పై ఎత్తులు చూడాలనుకునేవారికి ఈ చిత్రం నచ్చుతుంది.

అలాగే చివర్లో రాజ్యాంగానికి, రాజకీయ వ్యవస్థకి, ప్రజలకి మధ్యన ఉన్న సంబంధాన్ని ఒక పోలీసు కుక్కని ఉపమానంగా తీసుకుని మురళీశర్మ చెప్పే డైలాగ్ కొంతవరకు బాగానే ఉందనిపిస్తుంది. చిన్న సినిమాల్లో పర్వాలేదనిపించే సినిమాగా దీనిని చెప్పుకోవచ్చు. మలయాళ మాత్రుక చూడని ఆడియన్స్ ని నిరాశపరచదు.

బాటం లైన్: ఒరిజినల్ అంత కాదు కానీ..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?