Advertisement

Advertisement


Home > Movies - Reviews

Virupaksha Review: మూవీ రివ్యూ: విరూపాక్ష

Virupaksha Review: మూవీ రివ్యూ: విరూపాక్ష

చిత్రం: విరూపాక్ష
రేటింగ్: 2.75/5
తారాగణం: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజి, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్ తదితరులు
కెమెరా: శాందత్ సాయినుద్దీన్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: అజనీష్ లోకనాథ్
నిర్మాత: బి.ఎస్.ఎన్ ప్రసాద్
దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు 
విడుదల తేదీ: 21 ఏప్రిల్ 2023

సాయి ధరమ్ తేజ్ "రిపబ్లిక్" తర్వాత దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ చిత్రంతో ముందుకొచ్చాడు. తనకి రోడ్డు ప్రమాదం జరిగిన పిదప సుదీర్ఘమైన గ్యాప్ తీసుకుని నటించిన చిత్రమిది. 

ట్రైలర్లోనే ఇది హారర్ కథాంశమని అర్ధమయ్యింది. ఇంత వరకు సాయితేజ్ ఈ తరహా చిత్రం చెయ్యకపోవడం, ఈ జానర్లో పెద్ద హీరో సినిమా చూసి కూడా చాలా నాళ్లు కావడం వల్ల దీనిపై ఆసక్తి నెలకొంది. పైగా "సుకుమార్ రైటింగ్స్" ముద్ర కూడా పడడం వల్ల ఏ మాత్రం తక్కువ అంచనా వెయ్యడానికి లేదన్న అభిప్రాయం కూడా కలిగింది. వివరాల్లోకి వెళ్దాం.

కథగా చెప్పాలంటే మరీ రొటీన్ గా లేకుండా కాస్తంత కొత్త నేపథ్యంతో రాసుకున్న కథే. 1979లో రుద్రవనం అనే గ్రామంలో ఒక కుటుంబం చేతబడి చేస్తోందని భావించి ఆ ఊరి జనం ఆ భార్యాభర్తల్ని సజీవదహనం చేస్తారు. చనిపోతూ ఆ గృహిణి ఆ ఊరిని పుష్కర కాలానికి వల్లకాడౌతుందని శపిస్తుంది. ఆ తర్వాత కథ 1991కి వెళ్తుంది. 

ఆ ఊరికి వేరే ఊరి నుంచి ఒక తల్లి, కొడుకు సూర్య (సాయితేజ్) తమ బంధువుల ఇంటికి వస్తారు. ఆ ఊరి సర్పంచ్ కూతురు నందినిని (సంయుక్త) సూర్య ప్రేమిస్తాడు. ఇదిలా ఉంటే గృహిణి శాపం పండి ఆ ఊరిని దుష్టశక్తి ఆవహిస్తుంది. ఊరిలో ఒక్కొక్కరూ అనూహ్యంగా చనిపోతుంటారు. ఆ చావు నందినిని వెంటాడుతుంటుంది. ఏవిటా శక్తి? ఆ శక్తిని నడిపిస్తున్నది ఎవరు? మన హీరో తన ప్రేయసిని, ఆ ఊరిని క్షుద్రశక్తి నుంచి ఎలా కాపాడుకుంటాడనేది తర్వాతి కథ.  

కథగా బాగానే ఉన్నా కథనంలో మరింత పరిపక్వత, గాఢత లోపించాయి. ఈ జానర్లో లాజిక్కులు ఎవరూ అడగరు. ఎందుకంటే దెయ్యం, క్షుద్రశక్తి అనేవి మేజిక్ తప్ప లాజిక్ తో సంబంధం లేనివి. 

ప్రేక్షకులని ఒక ప్రపంచంలోకి తీసుకుపోయి భావోద్వేగాల నడుమ భయపెట్టగలగాలి. క్షుద్రశక్తి మీద మానవశక్తో, దైవశక్తో గెలుస్తున్నప్పుడు రోమాంచితమయ్యి కళ్లు చెమ్మగిల్లాలి. అదే మేజిక్కంటే. 

అరుంధతి, చంద్రముఖి లాంటి సినిమాలు ఈ జానర్ కి ఒక బెంచ్ మార్క్. కనుక ఏం తీసిన దానిని దాటి ఉంటే తప్ప అద్భుతమనిపించదు. కానీ ఇక్కడ సుకుమార్ గారి రైటింగ్ ప్రమేయం ఉన్నా అది జరగలేదు. 

మొత్తం సినిమాలో ఉలిక్కిపడే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఉంది. ఇక రోమాంచితమవ్వడానికి, కళ్లు చెమ్మగిల్లడానికి ఒక్క సీన్ కూడా లేదు. కథనంలో రివీలింగ్ పాయింట్స్ గా రాసుకున్నవి కూడా ప్రేక్షకులు ముందే గ్రహించే స్థాయిలో ఉండడం వల్ల అక్కడ కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది. 

ఈ మైనస్సుల్ని మినహాయిస్తే మిగిలిన ప్రయత్నమంతా బాగానే జరిగిందనిపిస్తుంది. విజువల్ గా హారర్ ఏంబియన్స్ ని సృష్టించగలిగారు. లొకేషన్స్ గానీ, ఆర్ట్ విభాగం కానీ బాగా పనిచేసాయి. 

ఆర్టిస్టులు కూడా ఎక్కడా అతి చెయ్యకుండా ఎంత వరకు చెయ్యాలో అంతవరకు చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. సౌండ్ ఎఫెక్ట్స్ ఈ జానర్ కి న్యాయం చేసే విధంగా లేవు. పాటలున్నా తేలిపోయాయి. చూస్తున్నప్పుడు పర్వాలేదనిపించినా స్వరకల్పనలో హుక్ ఫ్యాక్టర్ లేక డీలా పడ్డాయి. 

ప్రధమార్ధం ప్లాట్ పాయింటుని ఎష్టాబ్లిష్ చేస్తూ బాగానే సాగింది. కానీ హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ ట్రాక్ వీక్ గా ఉంది. ద్వితీయార్ధంలో కథ క్లైమాక్స్ కి చేరుకునే క్రమంలో కొంత ల్యాగ్ అనిపించింది. పతాక స్థాయికి చేరాల్సిన సన్నివేశాలు కొన్ని అర్ధంతరంగా కంక్లూజన్ కి వచ్చేస్తూ ఎమోషనల్ గ్రాఫ్ ని డైల్యూట్ చేసినవి కూడా ఉన్నాయి. 

కానీ రాసుకున్న దానికి అంతకంటే ఏమీ చెయ్యలేని పరిస్థితి దర్శకుడిది. 

సాయితేజ్ ఎప్పటిలాగే తన పద్ధతిలో బాగానే నటించాడు. కథ పరంగా అతనిలోని హీరోయిజం అతి అవ్వకుండా బానే ఉంది. 

సంయుక్తా మీనన్ ఓకే. ఈ పాత్రకి చంద్రముఖిలోని జ్యోతిక రేంజు లుక్స్, పర్ఫార్మెన్స్ ఉంటే తప్ప న్యాయం జరగదు. కనుక ఉన్నంతలో సరిపెట్టుకోవడమే. 

పూజారిగా సాయిచంద్, హీరోయిన్ తండ్రిగా రాజీవ్ కనకాల, మరో ఊరి పెద్దగా సునీల్ కనిపించినంత సేపు పర్వాలేదనిపించారు. అఘోరాగా అజయ్ పాత్ర టేకాఫ్ బాగానే ఉన్నా క్రమంగా డైల్యూట్ అయిపోతూ ఏవరేజ్ అనిపించుకుంటుంది. 

ఎప్పుడూ రొటీన్ కథా చిత్రాలు కాకుండా ఇలా హారర్ మెటీరియల్ తో రావడం, కథ ముగింపు కూడా సగటు సినిమాల్లో చూసే లాంటి ముగింపు కాకపోవడం బాగున్నాయి. దర్శకుడు కార్తిక్ దండు గౌరవానికి భంగం కలిగించని సినిమా ఇది. అద్భుతం కాకపోయినా ఆదరించదగిన విధంగా ఉంది. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే బాగానే ఉంటుంది. 

బాటం లైన్: కూర్చోపెట్టింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?