రాష్ట్రంలో కాపుల్లో రాజకీయ చైతన్యం కనిపిస్తుంది. బిసిల్లో కనిపించదు. కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి బిసి ఓటు చీలడం తక్కువ. కాపు ఓటు చీలడం ఎక్కువ. ఈ సూత్రాన్నిగమనించి ఎన్టీఆర్, ఆ తరువాత చంద్రబాబు బిసి వర్గాన్నిదగ్గరకు తీయడం మొదలుపెట్టారు. కానీ అక్కడ సమస్య ఏమయింది అంటే ఎన్ని ఏళ్లు పాలించినా అధికారం అందుకునే బిసి కుటుంబాలు ఫిక్స్ డ్ గా మారిపోయాయి.
కొత్త వారికి, రెండో జనరేషన్ కు అధికారం అందుబాటులోకి రాలేదు. కానీ అదే టైమ్ లో బాబుగారు రెండు కళ్ల సిద్దాంతం పెట్టుకుని, కాపులను దగ్గరకు తీయడం మొదలు పెట్టారు. ఏళ్ల తరబడి అధికారంలో కూర్చున్న గుప్పెడు మంది బిసి నాయకులు ఇది సహించారు కానీ టోటల్ గా బిసిలు కాదు.
సరిగ్గా ఇది క్యాచ్ చేసారు జగన్. బిసి ల్లో కొత్త జనరేషన్ ను దగ్గరకు తీసారు. సక్సెస్ కొట్టారు. అదే టైమ్ లో కాపుల్లో కాకలు తీరిన వారినీ గుర్తించారు. ఇలా కాలం సాగుతుంటే చంద్రబాబు ఇంకా ఓల్డ్ స్కూల్ నే నమ్ముకున్నారు. జగన్ మళ్లీ పాచిక మార్చి వేసారు. అవకాశం ఇచ్చిన వారిని నయానా, భయానా నచ్చ చెప్పి, కొత్తవారికి చాన్స్ ఇచ్చారు.
నిజానికి ఇది చాలా రిస్క్ వ్యవహారం. చంద్రబాబు ఇలాంటి ధైర్యం చేయలేకే పార్టీలో ద్వితీయ శ్రేణి క్యాడర్ ను దూరం చేసుకున్నారు. వయసు మీద పడిపోయినా, ఏళ్లు పూళ్లుగా ఒకే బ్యాచ్ ను మెయింటెయిన్ చేస్తూ వచ్చారు. కానీ జగన్ అలా కాకుండా ధైర్యం చేయడం వల్ల, వైకాపాలో వుంటే ద్వితీయ కేడర్ కు కూడా చాన్స్ వుంటుందనే భరోసా వచ్చింది. అంతే కాదు, కాపులను బ్యాలన్స్ చేసే ప్రయత్నం చేస్తూనే కాస్త మొగ్గు బిసిల వైపు వుంచారు.
ఇది బిసిల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. అది నిన్నటికి నిన్న విశాఖ జిల్లాలో క్లారిటీగా కనిపించింది. ఇద్దరు మంత్రులయ్యారు. గుడివాడ అమర్ నాధ్, బూడి ముత్యాల నాయుడు. వీరిలో అమర్ నాధ్ కాపు. సో, ఇటు తూర్పు కాపులు, ఓసి కాపులు హ్యాపీ. అదే టైమ్ లో జిల్లాలో కీలకమైన వెలమలకు కూడా చాన్స్ ఇచ్చారు. అయ్యన్న లాంటి వాళ్లను కట్టడి చేయడానికి ఇది పనికి వస్తుంది.
నిన్నటికి నిన్న బిసిలు ముఖ్యంగా వెలమలు విశాఖ జిల్లాలో వెల్లువలా రోడ్ల మీదకు వచ్చారు. పాత విశాఖ జిల్లా సరిహద్దు నుంచి బూడి ముత్యాల నాయుడు స్వగ్రామం వరకు యాత్ర సాగడానికి దాదాపు 12 గంటలు పట్టింది. తమకు చాన్స్ వచ్చినందుకు వెలమలు అంతా క్యూ కట్టారు. బిసి లు ఫుల్ హ్యాపీ అయ్యారు. గమ్మత్తేమిటంటే కాపులతో అంతగా పొసగని జిల్లాలోని గవర సామాజిక వర్గం కూడా బిసిలు అంతా ఒకటి అనే ఆలోచనతో బూడి ముత్యాలనాయుడు వెనక నిల్చుంది.
దీంతో ఇప్పుడు జిల్లాలో మూడు వర్గాలు వైకాపా వైపు నిల్చున్నట్లు అయింది. జనసేన – తేదేపా కలిసినా, కాపు ఓటు చీలకుండా వుండదు. అలా కలిస్తే బిసిలు సాలిడ్ గా వైకాపా వైపు వుండిపోతారు. లేదూ జనసేన-తేదేపా కలవకపోయినా కాపుల ఓట్లలో చీలిక తప్పదు. బిసిల ఓటు బ్యాంక్ కూడా చీలితే చీలవచ్చు. కానీ వైకాపాకు మరీ నెగిటివ్ ఓటింగ్ పెరగదు.
దానా దీనా తేలుతున్నది ఏమిటంటే చంద్రబాబు కొత్త తరం రాజకీయాలు చేయాల్సి వుంది. తన సహచరులను పక్కన పెట్టాలి. కొత్త తరం అంటే యనమల, అయ్యన్న ఇలా నాయకుల వారసులు కాదు. కొత్తవారికి చాన్స్ లు ఇవ్వాలి అని గ్రహించాలి. అలా కాకుండా గతంలో మాదిరిగానే వెళ్తే ఆ నాయకుల కుటుంబాలే వుంటాయి తప్ప కొత్త కుటుంబాలు తోడు కావు.
ఈ వ్యవహారం గమనించారు కనుకే వైకాపా సీనియర్లు సైలంట్ అయ్యారు. లేదూ అంటే రెబల్స్ వాయిస్ గట్టిగానే వినిపించేది. వినిపించాలని అనుకున్నా, కొత్తగా అవకాశం అందుకున్నవారు కూడా నిలదొక్కుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించేసారు.
మొత్తానికి బిసిల్లో కొత్త ఊపు వచ్చింది.