వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చిన్నవయసులోనే ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న అనంతకు ఎంతో రాజకీయ భవిష్యత్ ఉండింది. అధికార పార్టీలో ఉంటున్న అనంతకు సీఎం జగన్ ఆశీస్సులు కూడా పుష్కలంగా వుండేవి. ఈ నేపథ్యంలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు కావడం చర్చనీయాంశమైంది. ఈ హత్య ఘటనలో అతనిపై కేసు నమోదైంది. కాసేపట్లో అతని అరెస్ట్‌ను అధికారికంగా పోలీసులు చూపనున్నారు.
ప్రస్తుతం కాకినాడ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో అనంతబాబు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. పోలీసులు విచారణలో హత్యకు దారి తీసిన పరిస్థితులను చెప్పాడనే ప్రచారం జరుగుతోంది. వాస్తవాలేంటో పోలీసు అధికారులు చెబితే తప్ప తెలిసే అవకాశం లేదు. ప్రమాదంలో సుబ్రమణ్యం మృతి చెందాడని ఎమ్మెల్సీ నమ్మించే ప్రయత్నం చేశాడు. పైగా శవాన్ని తనే కారులో ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించడం గమనార్హం.
అయితే సుబ్రహ్మణ్యంది ముమ్మాటికీ హత్యేనని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పోస్టుమార్టం నివేదిక వాస్తవాలను బయట పెట్టింది. తీవ్రంగా కొట్టడంతోపాటు గొంతుమీద కాలేసి తొక్కడంతో ఊపిరాడక గుండె ఆగిపోయి సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు వైద్యులు తేల్చి చెప్పారు. ఇదిలా వుండగా మంగళగిరిలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కొన్ని శాంపిల్స్‌ను వైద్యులు పంపనున్నారు. వాటి ఫలితాలొచ్చాక పూర్తి నివేదిక రానుంది.
కాస్త ఆలస్యంగానైనా డ్రైవర్ హత్యపై ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది. హత్యలో ఎమ్మెల్సీ ప్రమేయం వుంటే విడిచి పెట్టొద్దని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడం గమనార్హం. హత్యకు కారణాలు ఏమైనప్పటికీ, అనంత ఉదయభాస్కర్ ఆవేశంతో చేయరాని నేరానికి పాల్పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిదీ రాజకీయమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య తీవ్ర వివాదాస్పదమైంది.
మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ సుబ్రమణ్యంది హత్యేనన్నారు. అనంతకు అధికార పార్టీ నుంచి డోర్స్ క్లోజ్ అయ్యాయనేందుకు మంత్రి మేరుగ మాటలే నిదర్శనం. అనంత స్వీయ తప్పిదంతో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.