హుందా రాజకీయాలు అంటే ఇవేనా బాబు గారూ..!

ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దింపాలని తెలుగుదేశం పార్టీ చివరి వరకు ప్రయత్నించింది. ఏయే నాయకుడు ఎంతమది ఓటర్లను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా మార్చగలడో తెలుసుకోవడానికి..…

ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దింపాలని తెలుగుదేశం పార్టీ చివరి వరకు ప్రయత్నించింది. ఏయే నాయకుడు ఎంతమది ఓటర్లను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా మార్చగలడో తెలుసుకోవడానికి.. స్థానిక సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు.

ఎన్ని విడతల మంతనాలు సాగించినా.. వాతావరణం ఆశాజనకంగా కనిపింలేదు. దాంతో చంద్రబాబునాయుడు.. తమ పార్టీ పోటీ చేయదలచుకోవడం లేదని చాలా ‘హుందాగా’ ప్రకటించారు. హుం దారాజకీయాలు మాత్రమే చేద్దాం.. ఈ ఎన్నికలో పోటీ వద్దు అని చంద్రబాబు చెప్పడమూ.. ఆయన వందిమాగధులంతా ‘భలే భలే’ అంటూ హర్షధ్వానాలు చేయడమూ జరిగిపోయింది.

ఇంతకూ అసలు హుందా రాజకీయం అంటే ఏమిటి?

ఆ విషయం తెలుసుకోవాలంటే మనం విశాఖ జిల్లా తెలుగుదేశం వారిని కాదు.. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని తెలుగుదేశం నాయకులను అడగాలి. హుందా రాజకీయాలకు అసలైన నిర్వచనం వారు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వారు.. తాజాగా తమకు ఎంతగొప్ప హుందాతనం ఉన్నదో నిరూపించారు.

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ లతో పాటు ఆరుగురు కార్పొరేటర్లు తాజాగా తెలుగుదేశంలో చేరారు. మొత్తం 50 డివిజన్లు ఉండగా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తరువాత మొత్తం ఓ తొమ్మిది మంది తెదేపాలో చేరారు. తాజా చేరికలతో కలిపి తెలుగుదేశం బలం 23కు పెరిగింది. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపితే.. ఒంగోలు మేయర్ స్థానాన్ని తెలుగుదేశం దక్కించుకోగలిగే వాతావరణం ఏర్పడింది.

మరి చంద్రబాబునాయుడు హుందా రాజకీయాలు చేయడం గురించి ప్రవచించి రెండురోజులు కూడా గడవలేదు. దాని అర్థం ఇదేనేమో అనుకోవాల్సి వస్తుంది. ప్రలోభాలకు లొంగి.. తమ పార్టీలో చేరిపోయే వారు ఉంటే విచ్చలవిడిగా చేర్చేసుకుని తమ జెండా ఎగరేయడం!

ప్రలోభాలకు లొంగకుంగా విలువలకు కట్టుబడి ఉండేవారు కనిపిస్తే.. హుందా అనే మాటతో కిక్కురుమనకుండా ఉండిపోవడమే తాజా రాజనీతిలాగా కనిపిస్తోంది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం అనే తరహాకు.. రాజకీయ శైలి ఇది!

2 Replies to “హుందా రాజకీయాలు అంటే ఇవేనా బాబు గారూ..!”

Comments are closed.