తుడాలో తన హయాంలో అక్రమాలు జరిగాయని ఎవరో ఆరోపణలు చేయడం కాదని, నిజాలు నిగ్గు తేల్చాలని తానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణలతో పాటు సంబంధిత అధికారులకు లేఖలు రాసినట్టు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెల్లడించారు.
తుడాలో అక్రమాలు జరిగాయో, లేదో తేల్చేందుకు విజిలెన్స్ విచారణ చేపట్టడంపై “గ్రేట్ ఆంధ్ర ప్రతినిధి”తో ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ మనసా, వాచా అభివృద్ధి చేయడానికి మాత్రమే పదవిని సద్వినియోగం చేసుకున్నట్టు చెప్పారు. తుడాలో ఒక్క రూపాయి అవినీతికి కూడా తాను పాల్పడలేదని నమ్ముతున్నట్టు ఆయన తెలిపారు.
తనపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపణలు చేయడాన్ని ఆయన కొట్టి పారేశారు. ఎలాంటి అక్రమాలకు తాను పాల్పడలేదనే ధైర్యంతోనే ప్రభుత్వ పెద్దలకు విచారించాలని లేఖలు రాసినట్టు చెవిరెడ్డి తెలిపారు. అయితే విజిలెన్స్ విచారణను రాజకీయ కక్షతో కాకుండా, నిజాయతీగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
బహుశా ప్రతిపక్ష నాయకుడిగా వుంటూ, అంతకు ముందు తమ హయాంలో జరిగిన అవకతవకల ఆరోపణలపై విచారించాలని ఎవరూ డిమాండ్ చేసి వుండరని ఆయన అన్నారు. తనపై విచారించాలని పులివర్తి నాని డిమాండ్, అలాగే ప్రభుత్వం ఒత్తిడి తేవడం లాంటివి హాస్యాస్పదమని చెవిరెడ్డి అన్నారు.
good move